నీళ్లిచ్చిన తర్వాతే సమ్మక్క పేరు పెట్టాలె

ఏటూరునాగారం, వెలుగు: స్థానిక మండలాల రైతులకు ఉపయోగం లేని తుపాకులగూడెం బ్యారేజీకి సమ్మక్క పేరు పెట్టి వన దేవతకు అపనింద తేవద్దని ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం ఏటూరునాగారంలోని పంచాయతీ కార్యాలయంలో మాట్లాడారు. కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం ప్రాజెక్ట్​ ద్వారా స్థానిక రైతులకు సాగునీరందించకుండా ప్రాజెక్టుకు దేవుడి పేరు పెడితే ‘సమ్మక్క బ్యారేజీ మాకు అన్యాయం చేసింది’ అని రైతులు అనే పరిస్థితి వస్తుందన్నారు. నీళ్లిచ్చిన తర్వాతే సమ్మక్క పేరు పెట్టాలన్నారు. టీఆర్ఎస్​వల్ల స్థానికంగా ఉన్న ఇసుక వనరులు తరలిపోతున్నాయని, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, బ్యారేజ్ ద్వారా కూడా స్థానిక మండలాలకు నీరందే పరిస్థితి లేదన్నారు. అలాగే ఈ మధ్య అకాల వర్షాలకు మిర్చి రైతులు నష్టపోతే అధికారులు వచ్చి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను గ్రామాల్లోకి పంపించి సర్వే చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా పైసలు చెల్లించడం లేదన్నారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ములుగు జిల్లాతో పాటు జిల్లాలోని గిరిజన యూనివర్సిటీకి సమ్మక్క సారక్కల పేర్లు పెట్టాలని కోరారు.

Latest Updates