ముంబై ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఘటన : రెడ్ సిగ్నల్ చాలామందిని కాపాడింది

ముంబైలోని ఛత్రపతి శివాజి టర్మనస్ రైల్వే స్టేషన్‌ కు సమీపంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి కొంత భాగం కూలిపోయిన ఘటనలో చాలావరకు ప్రాణనష్టం తప్పింది.   ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 36 మంది దాకా గాయపడ్డారు. అయితే.. బ్రిడ్జి కూలిపోవడానికి కొన్ని సెకన్ల ముందే ఆ బ్రిడ్జికి కొంచెం దూరంలో ఉన్న చౌరస్తా దగ్గర రెడ్ సిగ్నల్ పడింది. దీంతో ఆ బ్రిడ్జి కింది నుంచి వెళ్లాల్సిన వాహనాలన్నీ సిగ్నల్ దగ్గర ఆగిపోయాయి. అదే సమయంలో బ్రిడ్జి కూలిపోవడంతో వాహనదారులకు పెద్ద ముప్పు తగ్గింది. సిగ్నల్ పడటం కొన్ని క్షణాలు ఆలస్యమైనా.. ఆ రూట్‌ లో వెళ్లే వాహనదారులంతా బ్రిడ్జి కింద నలిగిపోయేవారని స్థానికులు చెబుతున్నారు.

“రెడ్ సిగ్నల్ పడగానే అసహనంగా వేచి చూస్తున్నా. గ్రీన్ సిగ్నల్ పడిందో లేదో.. ఇంతలోనే బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అంతే.. ఒక్క క్షణం ముందు గ్రీన్ సిగ్నల్ పడినా పరిస్థితి వేరే రకంగా ఉండేది” అని ఓ వాహనదారుడు తెలిపాడు. “అది చాలా రష్ ఉంటే సమయం. ఎందుకంటే.. ఆఫీసుల నుంచి చాలామంది అప్పుడే ఇంటికి తిరిగి వెళ్తుంటారు. సీఎస్‌ఎంటీలో ఆ టైమ్‌ లో చాలా రష్ ఉంటుంది. నేను కూడా ఇంటికి తొందరగా వెళ్లాలనుకున్నా. రెడ్ సిగ్నల్ పడటంతో గ్రీన్ కోసం ఎదురు చూస్తున్నా. ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. లేకపోతే నేను కూడా ఆ ఘటనలో గాయపడేవాడిని.. అని” మరో వాహనదారుడు తెలిపాడు.

Latest Updates