బండి పక్కన పెట్టమన్నందుకు.. జొమోటో డెలివరీ బాయ్‌ని కత్తితో పొడిచి హత్య

చిన్న గొడవ.. మటామాటా పెరిగి హత్య దాకా వెళ్లింది. హోటల్ ముందు ఉన్న బండిని పక్కన పెట్టమన్నందుకు జొమోటో డెలివరీ బాయ్‌ని కత్తితో పొడిచి చంపాడు పండ్ల బండి ఓనర్. ఈ ఘటన బుధవారం ముంబైలోని పొవాయ్ ప్రాంతంలో జరిగింది.

పోవాయ్ ప్రాంతంలోని ఇందిరా నగర్‌కు చెందిన అమోల్ భాస్కర్ సురత్కార్ (30) జొమోటో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అతడు ఆ ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఫుడ్ పికప్ చేసుకునేందుకు వెళ్లాడు. ఆ హోటల్ ముందు ఫ్రూట్స్ బండి పెట్టుకుని వ్యాపారం చేసేవాడు సచిన్ దినేశ్ సింగ్ (20). అయితే అతడి బండి హోటల్‌ ఎంట్రీ పక్కనే ఉండడంతో ఫ్రూట్స్ కొనడానికి వచ్చేవాళ్లతో దారి బ్లాక్ అయిపోతోందని, బైక్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందని కొంచెం పక్కకి జరిపి పెట్టుకోవాలని కోరాడు భాస్కర్. దీనిపై సచిన్ దురుసుగా సమాధానం చెప్పడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. గొడవ కాస్తా పెద్దది కావడంతో భాస్కర్‌పై సచిన్, అతడి దగ్గర పని చేసే జితేంద్ర రాయకర్ కలిసి కత్తితో దాడి చేశారు. అతడికి గుండె, కడుపులో కత్తిగాట్లు దిగడంతో రక్తం కారుతూ కుప్పకూలిపోయాడు. దీంతో దాడి చేసిన ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. భాస్కర్‌ను అక్కడ ఉన్న వాళ్లు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కొద్ది గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. యూపీలోని తన స్వస్థలానికి పారిపోయేందుకు కుర్లా రైల్వే స్టేషన్‌కు వెళ్లిన సచిన్‌ను బుధవారం మధ్యాహ్నమే అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతడి దగ్గర పని చేసే జితేంద్రను కూడా పట్టుకున్నారు. గతంలోనూ పలుమార్లు సచిన్, భాస్కర్ మధ్య అక్కడ బండి పెట్టడంపై తరచూ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

Latest Updates