ముంబై హ్యాట్రిక్.. 57 రన్స్ తో రాజస్థాన్ పై గ్రాండ్ విక్టరీ

 

  • చెలరేగిన సూర్యకుమార్‌‌
  • సత్తా చాటిన బుమ్రా, బౌల్ట్‌‌
  • బట్లర్‌‌ పోరాటం వృథా
  • రాయల్స్‌‌కు మూడో ఓటమి

ప్రతి సీజన్‌‌ ఆరంభంలో తడబడే ముంబై పదమూడో ఎడిషన్‌‌లో మాత్రం అదరగొడుతోంది. పదునైన బ్యాటింగ్‌‌, తిరుగులేని బౌలింగ్‌‌తో ఎదురైన ప్రతి జట్టుపై పంజా విసురుతోంది. సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ (47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో  79 నాటౌట్‌‌) అద్భుత బ్యాటింగ్‌‌కు  జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా (4/20), ట్రెంట్‌‌ బౌల్ట్‌‌ (2/26) బౌలింగ్‌‌ మెరుపులు తోవడంతో తాజాగా రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ను చిత్తుగా ఓడించింది. వరుసగా మూడో మ్యాచ్‌‌లోనూ నెగ్గి  హ్యాట్రిక్‌‌ కొట్టిన ఆ జట్టు ఓవరాల్‌‌గా నాలుగో విజయంతో ఢిల్లీని వెనక్కునెట్టి టాప్‌‌ ప్లేస్‌‌కు చేరుకుంది. మరోవైపు చెత్త బ్యాటింగ్‌‌ కొనసాగించిన రాయల్స్‌‌ హ్యాట్రిక్‌‌ ఓటమి మూటగట్టుకుంది. టాపార్డర్‌‌ మళ్లీ చేతులెత్తేయగా.. జోస్‌‌ బట్లర్‌‌ (44 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 70) ఒంటరి పోరాటం ఆ జట్టు రాత మార్చలేకపోయింది. 

అబుదాబి:ముంబై ఇండియన్స్‌‌ జోరు తగ్గలేదు. రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ రాత మారలేదు.  మంగళవారం పూర్తి ఏకపక్షంగా సాగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ముంబై   57 పరుగుల  తేడాతో రాయల్స్‌‌పై ఘన విజయం సాధించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసింది. సూర్యతో పాటు రోహిత్‌‌ శర్మ ( 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35), హార్దిక్‌‌ పాండ్యా (19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 30 నాటౌట్‌‌) సత్తా చాటారు. అనంతరం భారీ  టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో రాజస్తాన్‌‌ 18.1 ఓవర్లలో 136 రన్స్‌‌కే కుప్పకూలి చిత్తుగా ఓడింది. సూర్యకుమార్‌‌కు మ్యాన్‌‌ ఆఫ్‌‌  ద మ్యాచ్‌‌ అవార్డు లభించింది.

ఓపెనర్ల ఆరంభం.. ‘సూర్య’ ప్రతాపం      

మెరుపు ఆరంభం.. మధ్యలో కాస్త నిదానం.. చివర్లో మళ్లీ విధ్వంసం. ఈ సీజన్‌‌లో  ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లు కొనసాగుతున్న ఫార్ములా. ఈ మ్యాచ్‌‌లో ముంబై కూడా అదే బాటలో నడించింది. ఓపెనర్లు డికాక్‌‌ (15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 23), రోహిత్‌‌ మంచి పునాది వేస్తే.. చివరి దాకా పోరాడిన సూర్యకుమార్‌‌ జట్టుకు భారీ స్కోరు అందించి హీరోగా నిలిచాడు.  టాస్‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌ ఎంచుకున్న రోహిత్​ ఫామ్‌‌లో ఉన్న డికాక్‌‌తో కలిసి దంచికొట్టాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌‌కు మెరుపు వేగంతో 49 రన్స్‌‌ జోడించారు.  ఫస్ట్‌‌ ఓవర్లోనే చెరో ఫోర్‌‌తో అంకిత్‌‌ (0/42)కు వెల్‌‌కమ్‌‌ చెప్పారు. అతని బౌలింగ్‌‌లోనే హిట్‌‌మ్యాన్‌‌ 6, 4 బాదగా.. జోఫ్రా ఆర్చర్‌‌  (1/34)బౌలింగ్‌‌లో క్వింటన్‌‌ 4, 6తో జోరు చూపాడు. ఐదో ఓవర్లో డెబ్యూ బౌలర్‌‌ కార్తీక్‌‌ త్యాగి (1/36)కి  ఓ షార్ట్‌‌ బాల్‌‌తో డికాక్‌‌ను ఔట్‌‌ చేసిరాయల్స్‌‌కు ఫస్ట్‌‌ బ్రేక్‌‌ ఇచ్చాడు.  అయినా రోహిత్‌‌తో పాటు వన్‌‌డౌన్‌‌లో సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ ధాటిగా ఆడడంతో ముంబై  స్కోరు బోర్డు ఉరకలెత్తింది. అయితే  పదో ఓవర్లో వరుస బాల్స్‌‌లో రోహిత్‌‌, ఇషాన్‌‌ కిషన్‌‌ (0)లను ఔట్‌‌ చేసిన స్పిన్నర్‌‌ శ్రేయస్‌‌ గోపాల్‌‌ (2/28) ఆ జట్టుకు డబుల్‌‌ స్ట్రోక్‌‌ ఇచ్చాడు.. అక్కడి నుంచి రాయల్స్‌‌ బౌలర్లు పుంజుకున్నారు. స్పిన్నర్లు  గోపాల్‌‌, తెవాటియా (0/13)తో పాటు ఆర్చర్‌‌, టామ్‌‌ కరన్‌‌ (0/33) కట్టడి చేశారు. 10 నుంచి 16 ఓవర్ల మధ్య 45 పరుగులే చేసిన ముంబై   క్రునాల్‌‌(12) వికెట్​ కూడా కోల్పోయింది.  ఈ లెక్కన 170 రన్స్‌‌ చేసినా గొప్పే అనిపించింది. కానీ, మరో ఎండ్‌‌లో సూర్యకుమార్‌‌ ఏ మాత్రం వెనక్కుతగ్గలేదు.  33 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. హార్దిక్‌‌ తొలుత నెమ్మదిగా ఆడినా అతను మాత్రం  ఓవర్‌‌కో బౌండ్రీ కొడుతూ 18వ ఓవర్లో స్కోరు 150 దాటించాడు. ఆ ఓవర్లో హార్దిక్‌‌ ఇచ్చిన రిటర్న్‌‌ క్యాచ్‌‌ను టామ్‌‌ కరన్‌‌ వదిలేయగా.. తర్వాతి రెండు బాల్స్‌‌కు 6, 4 కొట్టిన సూర్య ఇన్నింగ్స్‌‌కు మళ్లీ ఊపు తెచ్చాడు. ఇక 19వ ఓవర్లో  జోఫ్రా ప్రమాదకర బంతులు వేశాడు.  ఓ బీమర్‌‌ హార్దిక్‌‌ తలపై నుంచి దూసుకెళ్లి  కీపర్‌‌ కు కూడా దొరక్కుండా బౌండ్రీ దాటింది. ఆపై  ఓ బౌన్సర్‌‌ సూర్య హెల్మెట్‌‌కు బలంగా తగిలింది. ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకున్న అతను  నెక్ట్స్‌‌ బాల్‌‌కే  సిక్సర్‌‌ కొట్టాడు. ఫుల్‌‌లెంగ్త్‌‌ బాల్‌‌ను లెగ్‌‌ సైడ్‌‌కు వంగి రివర్స్‌‌ ల్యాప్‌‌ షాట్‌‌ ఆడిన సూర్య  ఫస్ట్‌‌ స్లిప్‌‌ మీదుగా రోప్‌‌ దాటించి మెస్మరైజ్‌‌ చేశాడు. రాజ్‌‌పుత్‌‌ వేసిన లాస్ట్‌‌ ఓవర్లో సూర్య ఫోర్‌‌, హార్దిక్‌‌ సిక్సర్‌‌ బాదడంతో వరుసగా నాలుగో మ్యాచ్‌‌లోనూ ముంబై190 ప్లస్‌‌ స్కోరు చేసింది.

బట్లర్‌‌ మినహా

194 టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో రాజస్తాన్‌‌ తీవ్రంగా నిరాశ పరిచింది. బట్లర్‌‌ మినహా టాపార్డర్‌‌ మరోసారి ఫెయిలవడం జట్టును దెబ్బకొట్టింది.  పేసర్లు  బౌల్ట్‌‌, బుమ్రా దెబ్బకు మూడు ఓవర్లలోనే  మూడు వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలు పెట్టింది. ఇన్నింగ్స్‌‌ సెకండ్‌‌ బాల్‌‌కే  యంగ్‌‌ ఓపెనర్‌‌ యశస్వి జైస్వాల్‌‌ (0) ను కాట్‌‌ బిహైండ్‌‌ చేసిన బౌల్ట్‌‌ ప్రత్యర్థికి షాకిచ్చాడు. కెప్టెన్‌‌ స్టీవ్‌‌ స్మిత్‌‌ (6)  వరుసగా మూడో ఇన్నింగ్స్‌‌లోనూ ఫెయిలయ్యాడు. తర్వాతి ఓవర్లో  బుమ్రా ఆఫ్‌‌ స్టంప్‌‌కు దూరంగా వేసిన గుడ్‌‌ లెంగ్త్‌‌ బాల్‌‌ను లైన్‌‌కు అడ్డంగా ఆడి కీపర్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. సంజు శాంసన్‌‌ (0).. బౌల్ట్‌‌ వేసిన షార్ట్‌‌ బాల్‌‌కు పేలవ పుల్‌‌షాట్‌‌ ఆడి మిడాన్‌‌లో రోహిత్‌‌కు చిక్కాడు. దాంతో, 12/3తో కష్టాల్లో పడ్డ జట్టును బట్లర్‌‌, మహిపాల్‌‌ లామ్రోర్‌‌ (11) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఓవర్‌‌కో బౌండ్రీ కొట్టడంతో పవర్‌‌ ప్లేలో ఆ జట్టు 31/3తో నిలిచింది. అయితే, క్రీజులో కుదురుకున్న  లామ్రోర్‌‌.. ఎక్స్‌‌ట్రా కవర్‌‌లో సబ్‌‌స్టిట్యూట్‌‌ ఫీల్డర్‌‌ అనుకూల్‌‌ పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌‌కు వెనుదిరిగాడు. కానీ, తర్వాతి బాల్‌‌నే స్టాండ్స్‌‌కు పంపిన బట్లర్‌‌..అక్కడి నుంచి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఓవర్‌‌కో సిక్సర్‌‌ బాదేస్తూ 34 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ దాటాడు. అతని ధాటికి13 ఓవర్లకు 97/4తో  రేసులోకి వచ్చిన రాజస్తాన్‌‌ టార్గెట్‌‌ ఫినిష్‌‌ చేసేలా కనిపించి. కానీ, ప్యాటిన్సన్‌‌ (2/19) వేసిన తర్వాతి ఓవర్లో పొలార్డ్‌‌ పట్టిన అద్భుత క్యాచ్‌‌కు అతను  ఔటవడంతో ముంబై విజయం ఖాయమైంది. కాసేటికే కరన్‌‌ (15)ను పొలార్డ్‌‌ వెనక్కుపంపగా.. హార్డ్‌‌ హిట్టర్‌‌  రాహుల్‌‌ తెవాటియా (5)తో పాటు శ్రేయస్‌‌ గోపాల్‌‌ (1), జోఫ్రా ఆర్చర్‌‌ (24)ను బుమ్రా ఔట్‌‌ చేశాడు. ఆ వెంటనే రాజ్‌‌పుత్‌‌ (2)ను ప్యాటిన్సన్‌‌ పదో వికెట్‌‌గా పెవిలియన్‌‌ చేర్చాడు.

స్కోరుబోర్డు

ముంబై:  డికాక్‌‌  (సి) బట్లర్‌‌ (బి) త్యాగి 23, రోహిత్‌‌ (సి) తెవాటియా (బి) గోపాల్‌‌ 35, సూర్యకుమార్‌‌ (నాటౌట్‌‌) 79, ఇషాన్‌‌ (సి) శాంసన్‌‌ (బి) గోపాల్‌‌ 0, క్రునాల్ (సి) గోపాల్‌‌ (బి) ఆర్చర్‌‌ 12, హార్దిక్‌‌ (నాటౌట్‌‌) 30;  ఎక్స్‌‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 193/4; వికెట్ల పతనం: 1–49, 2–88, 3–88, 4–117;  బౌలింగ్‌‌:  అంకిత్‌‌ 3–0–42–0, గౌతమ్‌‌ 4–0–28–2, ఆర్చర్‌‌ 4–0–34–1, త్యాగి 4–0–36–1, టామ్‌‌ కరన్‌‌ 3–0–33–0, తెవాటియా 2–0–13–0.

రాజస్తాన్‌‌: యశస్వి (సి) డికాక్‌‌ (బి) బౌల్ట్‌‌ 0, బట్లర్‌‌ (సి) పొలార్డ్ (బి) ప్యాటిన్సన్‌‌ 70, స్మిత్‌‌ (సి) డికాక్‌‌ (బి) బుమ్రా 6, శాంసన్‌‌ (సి) రోహిత్‌‌ (బి) బౌల్ట్‌‌ 0, లామ్రోర్‌‌ (సి) సబ్‌‌/ అనుకూల్‌‌ (బి) చహర్‌‌ 11, కరన్‌‌ (సి) హార్దిక్‌‌ (బి) పొలార్డ్‌‌ 15, తెవాటియా (బి) బుమ్రా 5, ఆర్చర్‌‌ (సి) పొలార్డ్‌‌ (బి) బుమ్రా 24, గోపాల్‌‌ (సి) డికాక్‌‌ (బి) బుమ్రా 1, రాజ్‌‌పుత్‌‌(సి) రోహిత్‌‌ (బి) ప్యాటిన్సన్‌‌ 2, త్యాగి (నాటౌట్‌‌) 0; ఎక్స్‌‌ట్రాలు: 2; మొత్తం: 18.1 ఓవర్లలో 136 ఆలౌట్‌‌; వికెట్ల పతనం: 1–0, 2–7, 3–12, 4–42, 5–98, 6–108, 7–113, 8–115, 9–136, 10–136;

బౌలింగ్‌‌: బౌల్ట్‌‌ 4–0–26–2, బుమ్రా 4–0–20–4, ప్యాటిన్సన్‌‌ 3.1–0–19–2, చహర్‌‌ 3–0–24–1, క్రునాల్‌‌ 2–0–22–0, పొలార్డ్‌‌ 2–0–24–1.

Latest Updates