ఈ వృద్ధుడి ఆయుష్షు పెద్దది.. రైలు కిందపడినా బతికాడు

ఈ వృద్ధుడి ఆయుష్షు పెద్దది.. రైలు కిందపడినా బతికాడు

ముంబయి: రైలు కింద పడి బతకాలంటే చాలా అదృష్టం ఉండాలి. కోటికొకరికి మాత్రమే ఇలాంటి అదృష్టం వరిస్తుందేమో. ఇదే కోవలో ఓ వృద్ధుడు రైలు కిందపడి సజీవంగా బయటకొచ్చాడు. ముంబయి మహానగరంలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ లో  జరిగిందీ ఘటన. రైల్వే  సీసీ ఫుటేజీలో రికార్డయిన వీడియో చూసిన వారంతా  ఔరా అని ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. రైల్వే డ్రైవర్ సమయస్ఫూర్తితో ఓ నిండు ప్రాణం కాపాడేందుకు చేసిన ప్రయత్నాన్ని భేష్ అంటూ మెచ్చుకుంటున్నారు. 
ఇంతకూ ఎలా జరిగిందంటే...
ముంబయి రైల్వే స్టేషన్ల వద్ద పాదచారులకు వంతెన ఉన్నా.. చాలా మంది పట్టాలపై నడుచుకుంటూ ఆవతలివైపునకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా ఫుట్ బ్రిడ్జి ఎక్కలేని వృద్ధులు, మహిళలు ఇలా రైల్వే ట్రాక్ దాటే ప్రయత్నం చేస్తుంటారు. ఇదే కోవలో ఓ వృద్ధుడు బ్రిడ్జి ఎక్కే శక్తి లేక పట్టాలు దాటే ప్రయత్నం చేస్తూ జారి పట్టాల మీద పడిపోయాడు. అదే సమయంలో అదే ట్రాక్ పై రైలు వస్తోంది. స్టేషన్లోకి ఎంటరవుతుండడంతో డ్రైవర్ వేగాన్ని చాలా తగ్గించాడు. వృద్ధుడు పడిపోవడం చూసి అతడి వద్దకు రైలు చేరుకోకుండా ఆపేందుకు సడెన్ బ్రేక్ వేసి ఆపే ప్రయత్నం చేశాడు. అయితే రైలు వృద్ధుడిపై వరకు వచ్చి ఆగిపోయింది. వృద్ధుడు ప్రాణభయంతో కేకలు వేయడం అక్కడున్న వారు చూసి వెంటనే పరిగెత్తుకుంటూ అతడిని రైలు ఇంజన్ ముందు భాగం నుండి లాగి బయటకు తీసుకొచ్చారు. వృద్ధుడు ఎలాంటి గాయాలు లేకుండా ప్రాణాలతో ఉండడం చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైలు డ్రైవర్ చేసిన ప్రయత్నాన్ని అందరూ శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.