బట్టతలను దాచిన భర్త.. చీటింగ్ కేసు పెట్టిన భార్య

ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన బాలా సినిమాలో బట్టతలతో ఉండే వారు పడుతున్న బాధలను బాగా చూపించారు. ఆ సినిమాలో అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఓ అబ్బాయి తన బట్టతల విషయాన్ని దాస్తాడు. విగ్‌‌తో కవర్ చేస్తాడు. పెళ్లయ్యాక విషయం బయటపడటంతో అతడికి భార్య విడాకులు ఇస్తుంది. దాదాపుగా ఇలాంటి ఘటనే ముంబైలో జరిగింది. పెళ్లి సమయంలో బట్టతలను దాచాడని.. తన భర్తపై భార్య చీటింగ్ కేసు పెట్టింది.

మీరా రోడ్‌‌‌లో ఉండే 29 ఏళ్ల ఓ వ్యక్తి, నయా నగర్‌‌లో ఉండే 27 ఏళ్ల ఒక అమ్మాయిని రీసెంట్‌‌గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అతడికి బట్టతల అనే విషయం భార్యకు తెలిసింది. దీంతో ఆమె అతడిపై కేసు పెట్టింది. ‘నిందితుడు ఓ చార్టెడ్ అకౌంటెంట్. ఫిర్యాదు చేసిన మహిళతో ఈ సెప్టెంబర్‌‌లో అతడికి వివాహం జరిగింది. పెళ్లయ్యిన కొన్ని రోజులకు అతడిది బట్టతల అని.. ఇన్నాళ్లూ విగ్ వేసుకునే వాడని భార్య గుర్తించింది. నిందితుడితోపాటు అతడి పేరెంట్స్‌‌పై సెక్షన్లు 498, 377, 500, 66 కింద కేసు నమోదు చేశాం’ అని నయా నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్‌‌పెక్టర్ కైలాశ్ బార్వే తెలిపారు. నిందితుడు పెట్టుకున్న బెయిల్ పిటషన్‌‌ను థానే కోర్టు కొట్టేసింది. రెండ్రోజుల్లోపు పోలీసుల ముందు లొంగిపోవాలని పేర్కొంది.

Latest Updates