ముంబై జనం మో‘నో’ అన్నరు

  • మోనో రైల్​ను పట్టించుకోని ప్యాసింజర్లు
  • రూ.2,700 కోట్లతో నిర్మిస్తే.. రోజుకు 7 వేల మందే ప్రయాణం
  • కొన్ని స్టేషన్లలో ప్రయాణికుల కంటే సెక్యూరిటీ సిబ్బందే ఎక్కువ
  • వెయిటింగ్ టైమ్,సర్వీసులో లోపాలే కారణం

‘స్ప్రింగ్ ఫీల్డ్ ప్రజలు చేసిన ఒకే ఒక మూర్ఖపు పని.. మోనో రైల్’…. ఓ యానిమేషన్ టీవీ సిరీస్​లో డైలాగ్ ఇది. ముంబైలో కూడా మోనో రైల్ సర్వీసులు నడుస్తున్నాయి. ఇక్కడ ముంబైకి, స్ప్రింగ్ ఫీల్డ్​కీ ఎలాంటి సంబంధం లేదు.. కానీ ఆ డైలాగ్ మాత్రం ముంబైకి కరెక్టుగా సరిపోతుంది. ఎందుకంటే మోనోరైలు వల్ల వస్తున్న నష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముంబైకర్లు లోకల్ రైళ్లు, మెట్రోను ఓన్ చేసుకున్నంత ఈజీగా మోనోను ఓన్ చేసుకోలేదు. సబర్బన్ రైళ్లలో రోజుకు 40 లక్షల మందికి పైగా ప్రయాణిస్తుంటే.. మోనోలో కనీసం 7 వేల మంది కూడా ట్రావెల్ చేయట్లేదు. ఇంతకీ ఏంటీ మోనో?

బాగా పని చేస్తదని..

ముంబైని దేశ ఆర్థిక రాజధానిగా పిలుస్తారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. దీంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు అక్కడ కొత్తకొత్త ప్రాజెక్టులు వస్తుంటాయి. ఇందులో భాగంగా ముంబైలో మోనో రైల్​ప్రాజెక్టును చేపట్టారు. లైట్ వెయిట్ ట్రాన్స్​పోర్ట్ సిస్టమ్​అని, రద్దీ కారిడార్లలో అనువుగా ఉంటుందని, ఇరుకైన ప్రాంతాల్లో కూడా ఈజీగా ప్రయాణిస్తుందని దీని రూపకర్తలు భావించారు. మోనో రైల్ ప్రాజెక్టు కోసం రూ.2,700 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రారంభంలో కాస్త ప్రయాణికుల తాకిడి కనిపించినా.. రానురాను మోనో అనే రైలు ఉందనే విషయం కూడా ప్రజలు పట్టించుకోని పరిస్థితి వచ్చింది. మొదట్లో జనాలు సెల్ఫీలు దిగేందుకే వచ్చే వాళ్లనే వాదనలు కూడా ఉన్నాయి. గత మార్చిలో 5.55 లక్షల మంది మోనోలో ప్రయాణించగా, ఆ సంఖ్య జులై నాటికి 2.13 లక్షలకు తగ్గిపోయింది. జులైలో సగటున రోజుకు కేవలం 7 వేల మంది మాత్రమే ప్రయాణించారు. ఒక సారి వడాలా డిపో స్టేషన్​కు వెళ్లి చూస్తే.. అక్కడ ప్యాసింజర్ల కంటే సెక్యూరిటీ సిబ్బందే ఎక్కువ మంది ఉంటారు.

ఎందుకు ఫెయిలైంది..

మోనోలో రోజూ 1.25 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేశారు. 28 వేల ట్యాక్సీ, ఆటోరిక్షా ట్రిప్పులు, 25 వేల కార్ల ట్రిప్పులను తగ్గించొచ్చని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్​మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) అంచనావేసింది. కానీ అంచనాలన్నీ తారుమారయ్యాయి. పనుల సమయంలో కాంట్రాక్టర్లు మార్పులు చేశారు. రూట్లు మార్చారు. దీంతో ఇరుకైన ప్రాంతాల్లో మోనోకు ఇబ్బందులు వచ్చాయి. 15 రైళ్లు అందజేస్తామన్న ‘స్కోమి’ సంస్థ కేవలం 10 మాత్రమే అందజేసింది. దీంతో ప్రారంభంలో ప్రయాణికుల సంఖ్య 15 వేల నుంచి 20 వేల లోపే ఉండేది. వీరిలో ఎక్కువ మంది ‘జాలీ రైడ్’ కోసం వచ్చిన వాళ్లే అని అధికారులు కూడా చెప్పేవారు. అదీకాక రైళ్లు చాలా ఆలస్యంగా వచ్చేవి. ప్రతి నిమిషం ఎంతో ముఖ్యంగా భావించే ముంబైలో మోనోలో వెళ్లేందుకు 30 నుంచి 45 నిమిషాలు పట్టేది. దీంతో మోనో వైపు వెళ్లేవారు తగ్గిపోయారు.

ప్రపంచంలో 70 మోనోలు

ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా మోనో రైల్ సిస్టమ్స్​ఉన్నాయి. చైనా, జపాన్, మలేసియా వంటి దేశాల్లో మాత్రమే సరైన రవాణా వ్యవస్థగా మోనోను ఉపయోగిస్తున్నారు. మిగతా దేశాల్లో అమ్యూజ్​మెంట్ పార్కులు, ఎయిర్​పోర్టులు, కన్వెన్షన్ సెంటర్లు తదితర ప్రాంతాల్లో మాత్రమే వాడుతున్నారు. గ్లోబల్ మోనోరైల్ మార్కెట్ ప్రస్తుతం కేవలం 2 శాతం వృద్ధి మాత్రమే సాధించింది. బ్రెజిల్, ఈజిప్టు మినహా మిగతా పెద్ద దేశాలేవీ మోనో రైల్ సిస్టమ్​ కోసం ప్లాన్ చేయడం లేదు.

మొత్తం ఎనిమిది లైన్లు

ముంబైలో ప్రయాణ బాధలకు మోనో రైల్ విరుగుడు అని ప్రభుత్వం భావించింది. దీంతో ఎంఎంఆర్డీఏ.. ‘లియా అసోసియేట్స్’ అనే ఫారిన్ కన్సల్టెన్సీని నియమించింది. ముంబై చుట్టూ కారిడార్లు నిర్మించేందుకు మాస్టర్ ప్లాన్​తో రావాలని సూచించింది. తర్వాత కన్సల్టెన్సీ రూపొందించిన మాస్టర్ ప్లాన్​కు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. మొత్తం ఎనిమిది లైన్ల మోనో రైల్ సిస్టమ్ నిర్మించాలని నిర్ణయించింది. 2021 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని గడువు విధించింది. దీనికి అయ్యే మొత్తం ఖర్చు రూ.20,296  కోట్లు.

పదేళ్లలో రూ.2.4 లక్షల కోట్లు

రూ.2.4 లక్షల కోట్లు.. ముంబైలో వచ్చే పదేళ్లలో పలు ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయనున్న డబ్బు. మెట్రో లైన్లు, సముద్రంపై బ్రిడ్జిలు, కోస్టల్ రోడ్లు వంటి వాటిని ఈ పైసలతో నిర్మించనున్నారు. అయితే ఇలా చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వాలు ఏకపక్షంగా వెళ్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం.. పరిస్థితిని అర్థం చేసుకుని, ముందు చూపుతో వెళ్లడం లేదని, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రజల కోసం చేపట్టే ప్రాజెక్టులు.. ఆ ప్రజలకే ఉపయోగపడనప్పుడు వాటిని నిర్మించడంలో అర్థమేంటి? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ‘‘మోనో రైల్ ప్రాజెక్టు మాదిరే జరగొచ్చు. వేల కోట్ల ప్రజా ధనం బూడిదలో పోసిన పన్నీరులా మారొచ్చు” అన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

మోనో కథ ఇదీ

ప్రాజెక్టు ఖర్చు     రూ.2,700 కోట్లు

ఎంత దూరం        19.54 కిలోమీటర్లు

ఎక్కడి నుంచి ఎక్కడికి   సంత్ గాడ్గె మహరాజ్ చౌక్ –    వడాలా – చెంబూర్

రోజువారీ ప్రయాణికుల అంచనా       1.25 లక్షలు

జులై నెలలో ప్రయాణికులు     2.13 లక్షల మంది

 

ముంబైలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య

సిటీ సబర్బన్ రైళ్లు:       78 లక్షలు

బెస్ట్ బస్‌‌:                25 లక్షలు

మెట్రో:                   4 లక్షలు

మోనో:                 7,000

 

ముంబైలో ప్రతి నిమిషం ఎంతో ముఖ్యం. అలాంటప్పుడు మోనో రైల్ కోసం 30 నిమిషాలు ఎందుకు ఎదురుచూడాలి. జనాలు చాలా బిజీగా ఉంటారు. మోనోపై ఆధారపడలేరు. ఖాళీ సమయం ఉన్న వాళ్లు మాత్రమే ఇందులో ప్రయాణించేందుకు ఇష్టపడుతారు.- ప్రమోద్ సావంత్, హెఆర్ ప్రొఫెషనల్

మోనో ప్రాజెక్టు కోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టిందని నేను విన్నా. ఇందులో ప్రయాణించాలంటే 30 నిమిషాలు పైనే ఎదురు చూడాల్సి వస్తోంది. అలాంటప్పుడు ఇది ఎఫిషియెంట్ ట్రాన్స్​పోర్టు సిస్టమ్ ఎలా అవుతుంది. ఇందులో వెళ్లేందుకు ఎవరు ఆసక్తి చూపుతారు.- 21 ఏళ్ల నితేశ్ షెల్కే

Latest Updates