ముంబైని ముంచెత్తనున్న ‘నిసర్గ’ సైక్లోన్

  • పెను తుపాన్​గా ‘నిసర్గ’
  • 2 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న కెరటాలు
  • మధ్యాహ్నం తీరం దాటే చాన్స్
  • తీరప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్​ టీమ్​లు
  • గుజరాత్​లో 20 వేల మంది తరలింపు

ముంబై, అహ్మదాబాద్, న్యూఢిల్లీ: కరోనాతో అతలాకుతలమవుతున్న ముంబై సిటీని ‘నిసర్గ’ తుపాన్ ​వణికిస్తోంది. వారం, పది రోజుల గ్యాప్​లో దేశం ఎదుర్కొంటున్న రెండో తుపాన్​ ఇది. అంపన్​ తుపాన్​ బెంగాల్​ను అతలాకుతలం చేసింది. తాజాగా అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను మంగళవారం రాత్రి పెను తుపాన్​గా మారింది. మధ్యాహ్నం నుంచే సముద్రం కల్లోలంగా మారింది. అలలు సుమారు 2 మీటర్లు, అంతకంటే పైకి ఎగిసిపడుతున్నాయి. స్థానికులను అత్యసరమైతే తప్ప బయటికి రావొద్దని నేషనల్​ డిజాస్టర్​ ఫోర్స్ తెలిపింది. చేపల వేటకు సముద్రంపైకి వెళ్లొద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్న వాళ్లు వెంటనే తీరానికి రావాలని ఆదేశించారు. తుపాన్​ ప్రభావంతో బుధవారం ముంబైలో భారీ వర్షం పడనుందని చెప్పారు. ముంబైలో ఇప్పటికే రెడ్ అలర్ట్​ ప్రకటించిన అధికారులు సిటీ చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ హై అలర్ట్​ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలు, తుపాన్​ ప్రభావం ఎక్కువగా ఉండే చోట్ల నుంచి జనాలను రిలీఫ్​ సెంటర్లకు తరలించారు. దాదాపు వందేళ్ల తర్వాత ముంబైని తాకుతున్న భారీ తుపాన్​ ఇదేనని చెప్పారు. గుజరాత్​లోని తీర ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు. బుధవారం నార్త్​ మహారాష్ట్ర మీదుగా గుజరాత్​లోని హరిహరేశ్వర్, డామన్​ మధ్యలో బుధవారం తుపాన్​ తీరం దాటుతుందని వాతావరణ శాఖ చెప్పింది. తీరాన్ని తాకే టైమ్​లో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని ఐఎండీ ఓ ప్రకటనలో పేర్కొంది.

రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు

మహారాష్ట్ర, గుజరాత్​రాష్ట్రాలకు ఇప్పటికే 33 ఎన్డీఆర్​ఎఫ్ టీంలను పంపించినట్లు కేంద్రం తెలిపింది. ఆయా రాష్ట్రాలు కోరితే పరిస్థితిని బట్టి మరిన్ని బలగాలను పంపిస్తామని తెలిపింది. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సోమవారమే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ థాక్రేతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. తుపాన్ కారణంగా ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుజరాత్​ తీర ప్రాంత జిల్లాలు వల్సాద్, నవ్​శారీ జిల్లాల్లోని 47 గ్రామాలకు చెందిన దాదాపు 20 వేల మందిని ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. గాలుల వల్ల కరెంట్​ తీగలు తెగిపడి, సరఫరాకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

150 మంది కరోనా పేషెంట్లు షిఫ్ట్​

నిసర్గ తుపాను కారణంగా ముంబై మెట్రోపాలిటన్​ రీజినల్​ డెవలప్​మెంట్​ అథారిటీ(ఎంఎంఆర్డీఏ)లో ట్రీట్​మెంట్ తీసుకుంటున్న 150మంది కరోనా పేషెంట్లను అధికారులు వర్లికి తరలించారు. జర్మన్​ టెక్నాలజీతో తయారుచేసిన ఇక్కడి టెంట్లు పెనుగాలులకు తట్టుకోలేవని, అందుకే పేషెంట్లను తరలించామని ఎంఎంఆర్డీఏ కమిషర్ ఆర్​ ఏ రాజీవ్​ చెప్పారు.

మోడీ ట్వీట్

నిసర్గ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ట్వీట్​చేశారు. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు.

Latest Updates