
ముంబై: పీఎంసీ బ్యాంక్ కుంభకోణంలో ఇద్దరు ఆడిటర్లను ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం(ఈఓడబ్ల్యూ) అరెస్ట్ చేసింది. రూ.4,355 కోట్ల బ్యాంక్ స్కామ్ విచారణలో భాగంగా వీరిని అదుపులోకి తీసుకుంది. జయేష్ సంఘాని, కేతన్ లక్డవాలాలను మంగళవారం స్థానిక కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసింది. ఇప్పటివరకు పీఎంసీ బ్యాంక్ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు రాకేష్, సారంగ్ వాధ్వాన్లు, బ్యాంక్ టాప్ మేనేజ్మెంట్ ఉన్నారు. ‘ముంబైలోని ఈఓడబ్ల్యూ ఆఫీసుకు జయేష్, కేతన్‌లను ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచాం. హెచ్‌డీఐఎల్‌తో వారికున్న అసోసియేషన్‌పై ప్రశ్నించగా, వీరు సరియైన వివరణ ఇవ్వలేదు. దీంతో మరింత విచారణ కోసం వీరిని అరెస్ట్ చేశాం’ అని ఈఓడబ్ల్యూ తన ప్రకటనలో పేర్కొంది. పీఎంసీ బ్యాంక్ నియమించుకున్న ఆడిట్ సంస్థకు చెందిన వీరు, బ్యాంక్‌లో జరిగే అక్రమాలపై రిపోర్ట్ చేయాలి. అయితే వీరు ఈ కుంభకోణాన్ని బయటికి తేలేకపోయారు. ఆర్థిక అవకతవకలు బయటికి పొక్కకుండా ఉండేందుకు వీరు ఏమైన ముడుపులు తీసుకున్నారనే విషయంపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.