మున్సిపోల్స్’పై సర్కారువి అబద్ధాలే: బీజేపీ

  •                ఎన్నికల ప్రక్రియ పూర్తి కాలే.. చేశామనడం నిజం కాదు 
  •                 ప్రక్రియ పూర్తయ్యాకే ఎలక్షన్స్ పెట్టాలె
  •                 హైకోర్టులో సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్ పిటిషన్లు

మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన సమయాన్ని చట్ట వ్యతిరేకంగా కుదించారని, చట్ట నిబంధనల మేరకు ప్రక్రియను పూర్తి చేశాకే ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ మరో ఇద్దరు బీజేపీ ఎంపీలు హైకోర్టులో అనుబంధ పిటిషన్లు వేశారు. ఈ విషయంపై ఇప్పటికే కరీంనగర్‌ బీజేపీ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన భువనగిరి, మల్కాజిగిరి ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డిలు గత నెల 27న ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా ఇదే అంశంపై పిటిషన్లు వేశారు. ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశామని చెప్పడం నిజం కాదని, మున్సిపల్‌ అధికారులు హైకోర్టుకు తప్పుగా చెప్పారని వీరు తమ అఫిడవిట్లలో ఆరోపించారు. వార్డుల రిజర్వేషన్ల విధానంపై తమ అభిప్రాయాన్ని తీసుకున్నట్లుగా కోర్టుకు చెప్పడం అసత్యమన్నారు. అధికారులు తన సంతకాన్నే ఫోర్జరీ చేశారని బండి సంజయ్‌ ఇది వరకే ఆరోపించారు.

1,373 అబ్జెక్షన్లను రాత్రికి రాత్రే పరిష్కరించారా? 

‘‘రాష్ట్రంలో123 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని, ఇందుకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు109 రోజుల సమయం కావాలని సింగిల్‌ జడ్జి దగ్గర ప్రభుత్వం చెప్పింది. అయితే ఎన్నికల ప్రక్రియను ఏకపక్షంగా తగ్గించేశారు. అనేక మున్సిపాలిటీలపై హైకోర్టు సింగిల్‌ జడ్జి స్టేలు ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియను ఎందుకు కుదించారో ఏ చట్ట నిబంధనలకు లోబడి చేశారో చెప్పలేదు. ప్రజాభిప్రాయాల్ని సేకరించామని చెప్పడం పూర్తిగా అసత్యం. రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీల్లో1,373 అభ్యంతరాలు వస్తే వాటిని రాత్రికి రాత్రి ఎట్లా పరిష్కరించారో తెలియదు” అని ఇద్దరు ఎంపీలు బాపూరావు, అర్వింద్ తమ అఫిడవిట్లల్లో పేర్కొన్నారు.

Latest Updates