బ్రహ్మంగారు చెప్పిన వింతలు ఇవేనేమో!

మున్సిపల్ ఎన్నికల్లో అపూర్వమైన విజయం అందించినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు సంపూర్ణ మద్దతు తెలియజేశారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్‌ను ఎదుర్కోలేక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ పార్టీలు పేరుకే జాతీయ పార్టీలని చేసేది సిల్లీ పనులని ఎద్దేవా చేశారు. రెండు పార్టీలు ఒకే తాను ముక్కలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనే తాము చెబుతూ వచ్చామని, ఇప్పుడు చైర్మన్ల ఎంపిక టైంలో ఆ పార్టీల అపవిత్ర పొత్తు బయటపడిందని అన్నారు. ఢిల్లీలో ఎప్పుడూ కొట్టుకునే ఆ పార్టీలు మున్సిపాలిటీల కోసం కలిసిపోయాయన్నారు. బ్రహ్మంగారు చెప్పిన వింతలు ఇవేనేమో అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

కొత్త మున్సిపల్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు కేటీఆర్. పనులు చేయకపోతే పదవులు పోతాయన్న మాటకు కట్టుబడి ఉన్నామని, గెలిచింది తమవారే అయినా ప్రజలకు మంచి చేయకపోతే చర్యలు తప్పవని అన్నారు. కొత్త మేయర్లు, చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామన్నారు. ఇంటిపన్ను విషయంలో కొత్త విధానం తీసుకుని వస్తామన్నారు. అలాగే అక్రమ కట్టడాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి కేటీఆర్. ఎక్స్ అఫిషియో ఓట్ల విషయంలో అక్రమాలు జరిగాయన్న వార్తలపై మీడియా ప్రశ్నించగా అలాంటిదేమీ లేదన్నారాయన. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని చెప్పారు. చట్టం ప్రకారం ఉన్న హక్కునే తాము వినియోగించుకున్నామని తెలిపారు.