పైసల లొల్లి ప్రాణం తీసింది

దుండిగల్,వెలుగు: పైసల విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ తమ్ముడి ప్రాణం తీసింది. ఆవేశంలో రాడ్ తో తమ్ముడిని కొట్టి చంపిన ఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో తల్లి ఇచ్చిన కంప్లయింట్ తో  వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా  గుమ్మడిదల మండలం అన్నారం గ్రామానికి చెందిన జానకీరాం,భార్య అరుణ, కుమారులు వినయ్​కుమార్(23), కార్తీక్ కుమార్(19) తో కలిసి ఉంటున్నాడు.  వినయ్, కార్తీక్ మెకానిక్ లు గా పనిచేస్తున్నారు. ఈ నెల 9న వినయ్, కార్తీక్ ఇద్దరు హోండా సిటీ కారులో గండిమైసమ్మ ప్రాంతానికి వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో అన్నదమ్ములిద్దరికీ పైసల విషయంలో గొడవ జరిగింది.

ఆవేశానికి లోనైన అన్న వినయ్ తమ్ముడు కార్తీక్ ను కారులోని జాకీ  రాడ్ తో తలపై కొట్టి చంపాడు. అదే రోజు ఇంటికి వెళ్లిన వినయ్..తాను,తమ్ముడు కార్తీక్ కారులో వెళ్తుంటే దుండిగల్ ఓఆర్ఆర్ వద్ద యాక్సిడెంట్ అయ్యిందని తల్లిదండ్రులతో చెప్పాడు. ఈ  ప్రమాదంలో  తమ్ముడు గాయపడ్డాడని.. మల్లారెడ్డి హాస్పిటల్ లో ఉన్నాడని వారితో చెప్పాడు. జానకీరాం, అరుణ, వినయ్ తో కలిసి  మల్లారెడ్డి హాస్పిటల్ కు చేరుకున్నారు. అప్పటికే కార్తీక్ చనిపోయినట్టు అక్కడి డాక్టర్లు తెలిపారు.

కార్తీక్ తలపగిలి ఉండటంతో అనుమానం వచ్చిన తండ్రి జానకీరాం పెద్ద కొడుకు వినయ్ ను ఏం జరిగిందని నిలదీశాడు. తమ్ముడికి, తనకు మధ్య గొడవైందని..తానే కార్తీక్ ను చంపినట్టు వినయ్ కుమార్ తల్లిదండ్రులకు నిజం చెప్పాడు. తన చిన్న కుమారుడు కార్తీక్ ను చంపిన పెద్ద కుమారుడు వినయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని తల్లి అరుణ దుండిగల్ పోలీసులకు సోమవారం కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest Updates