అయోధ్య కేసు: మనం గెలిచినా.. హిందువులకు గిఫ్ట్ గా ఇచ్చేద్దాం

‘ఇండియన్ ముస్లిమ్స్ ఫర్ పీస్’ అనే సంస్థ పిలుపు

లక్నో: అయోధ్య రామ జన్మభూమి వివాదం కేసు కొలిక్కి వస్తోంది. అక్టోబరు 18 కల్లా వాదనలు ముగించేయాలని సుప్రీం కోర్టు ఇప్పటికే డెడ్ లైన్ పెట్టుకుని ఉంది. ఈ నెలాఖరు కల్లా తుది తీర్పు కూడా ఇవ్వాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో ముస్లిం మేధావుల గ్రూప్ ఒకటి.. ఈ కేసులో ముస్లిమ్స్ గెలిచినా ఆ భూమిని హిందువులకు గిఫ్ట్ గా ఇచ్చేయాలని పిలుపునిచ్చింది. అలీగఢ్ ముస్లిం వర్సిటీ మాజీ వీసీ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఈ గ్రూప్ పేరు ‘ఇండియన్ ముస్లిమ్స్ ఫర్ పీస్’.

రియాలిటీలోకి వచ్చి మాట్లాడుకుందాం

ఇండియన్ ముస్లిమ్స్ ఫర్ పీస్ సంస్థ ప్రతినిధులు గురువారం లక్నోలో సమావేశమయ్యారు. ఆయోధ్య వివాదంపై వారంతా చర్చించారు. ఈ భేటీ తర్వాత జమీరుద్దీన్ మాట్లాడుతూ ప్రస్తుతం రియాలిటీలోకి వచ్చి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘నేనొక వాస్తవికవాదిని. మనం రియాలిటీలోకి వచ్చి మాట్లాడుకుందాం. ఒక వేళ అయోధ్య కేసులో ముస్లిమ్స్ కు అనుకూలంగా తీర్పు వచ్చినా అక్కడ మసీదు కట్టగలిగే పరిస్థితి ఉందా? అది అసాధ్యమని నా భావన. దేశంలోప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది కలగానే మిగిలిపోతుంది. ఒకవేళ సుప్రీం కోర్టులో గెలిచినా.. వివాదాస్పద భూమిని హిందువులకు కానుకగా ఇవ్వడమే మంచి ఆప్షన్. దానికి బదులుగా ప్రార్థనా మందిరాల సవరణ చట్టాన్ని బలోపేతం చేయాలని కోరడం మేలు. దేశం మొత్తానికి మేలు చేసే ప్రతిపాదన ఇది’’ అని లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ అన్నారు.

కాగా, లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ గతంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా పని చేశారు.

ఆయోధ్య రామ జన్మభూమి అని చెబుతున్న ప్రాంతం మొత్తం 67 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో 2.77 ఎకరాలు మాత్రమే వివాదాస్పద భూమిగా కోర్టులో కేసు నడుస్తోంది.

Latest Updates