లింగాయత్ మఠాధిపతిగా ముస్లిం యువకుడు

కర్ణాటకలోని లింగాయత్ మఠానికి అధిపతిగా ఓ ముస్లిం యువకుడు బాధ్యతలు తీసుకోబోతున్నారు. గడగ్ జిల్లాలో ఉన్న మురుగ రాజేంద్ర మఠం ఉత్తరాధికారిగా దివాన్ షరీఫ్ ముల్లా (33)ను మఠాధిపతి  శ్రీమురుగరాజేంద్ర కరణేశ్వర స్వామి ప్రకటించారు. ఈ నెల 26న ఆయన మఠంలో బాధ్యతలు తీసుకుంటారని తెలిపారు. ఈ బాధ్యతలు తీసుకోవాలని తనను ఎవరూ అడగలేదని, దేవుడు తన కలలోకి వచ్చి చెప్పడంతోనే మఠానికి వచ్చానని అన్నారు షరీఫ్ ముల్లా. మఠంలో తనకు ఇష్ట లింగం ఇచ్చి గౌరవించారని చెప్పారు. ఆత్మలింగ దర్శనంతో ధర్మం, ప్రేమ, శాంతి మార్గంలో నడవాలన్న సందేశం అందిందన్నారు. దీనిని సమాజానికి తాను అందజేస్తానని చెప్పారు.

మనుషులు పెట్టుకున్న అడ్డుగోడలతో సంబంధం లేదు

మురుగ రాజేంద్ర మఠానికి 350 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పారు ప్రస్తుత మఠాధిపతి మురుగ రాజేంద్ర కరణేశ్వర స్వామి. కులం, మతానికి సంబంధం లేకుండా మనుషులంతా ఒక్కటేనని లింగాయత్ లకు ఆధ్యుడైన బసవేశ్వరుడు ప్రభోదించారని చెప్పారు. దేవుడు చూపిన మంచి బాటలో నడవడానికి కులం, మతం ఏమిటన్నదానితో సంబంధం లేదని అన్నారు. మన పుట్టుక ఏమిటన్న దాన్నిపై మనిషి పెట్టుకున్న అడ్డుగోడలు దేవుడి ముందు ఉండవని చెప్పారు.

కలలో దైవ దర్శనం

తనకు కలలో దైవ దర్శనం జరిగిందని షరీఫ్ ముల్లా చెప్పారు. బసవేశ్వరుడు ప్రబోధనలు తనను చాలా ప్రభావితం చేశాయని అన్నారు. మఠానికి సమీపంలోని గ్రామంలో పిండి మిల్లు నడుపుతూ తాను జీవనం సాగిస్తుంటానని తెలిపారు. ఖాళీ సమయం దొరికినప్పుడు బసవేశ్వరుడి బోధనలను నలుగురికీ చెప్పేవాడినన్నారు.

తండ్రి కూడా..

షరీఫ్ తండ్రి రహ్మాన్ సాబ్ ముల్లా కూడా బసవేశ్వరుడి బోధనలను అనుసరించేవారు. మురుగ రాజేంద్ర మఠం అభివృద్ధి కోసం ఆయన రెండెకరాల భూమిని దానం చేశారు.

Latest Updates