జగన్నాథ రథయాత్రను ఆపొద్దు: ముస్లిం యువకుడి పిటిషన్‌

  • పిటిషన్‌ వేసిన 21 మందిలో ఒకడు
  • విచారణకు అంగీకరించిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: ఒడిశాలో ఏటా వైభవంగా జరిగే పూరీ జగన్నాథ రథ యాత్రను నిలిపేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలని 19 ఏళ్ల ముస్లిం యువకుడు సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశాడు. రథయాత్రపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ 21 మంది పిటిషన్లు దాఖలు చేయగా.. వారిలో నయాగర్‌‌ జిల్లాకు చెందిన అఫ్తాబ్‌ హోసన్‌ కూడా ఉన్నాడు. చిన్ననాటి నుంచి తాను జగన్నాథుని పూజిస్తున్నానని ఆయనకు చెందిన చాలా పుస్తకాలు కూడా చదివానని హోసన్‌ అన్నాడు. తన తాత ముల్తాబ్‌ ఖాన్‌ కూడా పూరీ జగన్నాథుని భక్తుడని చెప్పాడు. 1960లో ఇటమాటీలో తన తాత ముల్తాబ్‌ ఖాన్‌ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆలయాన్ని నిర్మించాడని గుర్తు చేసుకున్నాడు. “ నేను జగన్నాథుడిని పూజిస్తే మా కుటుంబసభ్యులు కూడా అడ్డుచెప్పేవారు కాదు. నేను ఎప్పుడూ గుడికి వెళ్లలేదు. ఎందుకంటే వెళ్లేందుకు అనుమతి లేదు కాబట్టి” అని అన్నారు. సుప్రీం కోర్టు తమ అభ్యర్థనను స్వీకరించి కచ్చితంగా రథయాత్రను కొనసాగించేందుకు అనుమతిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూరీ జగన్నాథుడికి సాలాబెగా అనే గొప్ప ముస్లిం భక్తుడు ఉండేవాడు. ఆయన మొఘల్‌ సుబేదార్‌‌. ఏటా మూడు కిలోమీటర్ల పాటు జరిగే ఈ రథ యాత్ర గ్రాండ్‌ రోడ్‌ సమీపంలోని సాలేబేగ్‌ సమాధి దగ్గర కొంచెంసేపు ఆగుతుంది. ఆయనకు గౌరవార్థం అలా చేస్తారని నిర్వాహకులు చెప్పారు. కాగా.. తీర్పును పునరుద్ధరించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు దీనిపై తీర్పు వెలువరించనుంది. కరోనా వ్యాప్తి కారణంగా లక్షలాది మంది పాల్గొనే ఈ రథయాత్రను నిలిపేయాలని, ప్రజల క్షేమం కోరి ఈ నిర్ణయం తీసుకున్నామని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఇలాంటి టైంలో రథయాత్ర నిర్వహిస్తే పూరి జగన్నాథుడు క్షమించడని కామెంట్‌ చేసింది. ఈ నెల 23న రథయాత్ర జరగాల్సి ఉంది.

Latest Updates