ఆరెస్సెస్​ స్కూళ్లలో 30% పెరిగిన ముస్లిం స్టూడెంట్స్

  • క్రిస్టియన్లు సైతం చదువుకుంటున్నరు 
  • యూపీ మొత్తం 12వేల మంది స్టూడెంట్లు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్​) అంటేనే హిందూత్వ భావజాలమనే భావన ఉంటుంది. పేరుకు తగ్గట్టే హిందూ ధర్మాలను బోధిస్తుంటుంది. సనాతన సంప్రదాయాలను ప్రోత్సహిస్తుంటుంది. దీనికి అనుబంధంగా ఉండే స్కూళ్లలోనూ బోధన ఇలాగే జరుగుతుంది. అలాంటి ఆరెస్సెస్​ స్కూళ్లలోనూ ముస్లింలు, క్రిస్టియన్లు చదువుకుంటున్నారు. యూపీలో ఆరెస్సెస్​ ఎడ్యుకేషనల్ వింగ్ ‘విద్యాభారతి’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూళ్లలో వీరి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ముఖ్యంగా ముస్లిం స్టూడెంట్ల సంఖ్య అయితే మూడేళ్లలోనే 30 శాతం పెరిగింది. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో దాదాపు 12 వేల మంది ముస్లిం, క్రిస్టియన్ స్టూడెంట్లు చదువుకుంటున్నారు. తూర్పు యూపీలోని 1,194 స్కూళ్లలో 9,037 మంది ముస్లింలు, 10 మంది క్రిస్టియన్లు చదువుకుంటుండగా… మిగతా స్టూడెంట్లు పశ్చిమ యూపీలో ఉన్నారు” అని విద్యాభారతి అడిషనల్ సెక్రటరీ చింతామణి సింగ్ తెలిపారు. మంచి చదువును చెబుతున్నామన్న కారణం వల్లే  తమ స్కూళ్లలో చేరుతున్న ముస్లింల సంఖ్య పెరుగుతోందని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాభారతి స్కూళ్లలో మొత్తం 6లక్షల మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారని, వారిలో ఎక్కువ మంది రూరల్ ఏరియాలకు చెందిన వారేనని వెల్లడించారు.

స్టడీ, స్పోర్ట్స్ లోనూ ప్రతిభ… 

ఈస్ట్ యూపీలో 2016లో 6,890 మంది ముస్లిం స్టూడెంట్లు ఉండగా 2019 నాటికి ఆ సంఖ్య 9,037కు పెరిగిందని చింతామణి తెలిపారు. శ్లోకాలు, భోజన మంత్రాలు కూడా నేర్చుకుంటున్నారు. అదే విధంగా స్కూళ్లలో నిర్వహించే ఆటల్లోనూ రాణిస్తున్నారు. సరస్వతీ శిశుమందిర్, సరస్వతీ విద్యామందిర్ స్కూళ్లలో చదువుకుంటున్న ముస్లిం బాలురు, బాలికలు ఆటల్లో తమ స్కూళ్లకు  పేరు తీసుకొచ్చారని చింతామణి చెప్పారు. ‘‘మా స్టూడెంట్స్ మహ్మద్ అఫ్సర్, మహమ్మద్ సుభాన్… ఇటీవల జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండర్–17 కేటగిరీలో గోల్డ్ మెడల్స్ సాధించారు” అని జ్వాలా దేవి సరస్వతీ విద్యామందిర్ ప్రిన్సిపాల్ చెప్పారు.

Latest Updates