ముత్తూట్‌‌ ఫిన్​కార్ప్​..తెలుగు రాష్ట్రాల్లో 60 కొత్త బ్రాంచ్ లు

హైదరాబాద్‌‌, వెలుగు : రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్తగా 60 బ్రాంచ్‌‌లు పెట్టాలని బంగారంపై అప్పులిచ్చే ముత్తూట్‌‌ ఫిన్‌‌కార్ప్‌‌ నిర్ణయించుకుంది. తెలంగాణలో 265, ఆంధ్ర ప్రదేశ్‌‌లో 371 బ్రాంచ్‌‌లు ఇప్పటికే ఉన్నాయని ముత్తూట్‌‌ ఫిన్‌‌కార్ప్‌‌ సీఓఓ వాసుదేవన్‌‌ రామస్వామి వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలలో ఈ రెండూ తమకు ముఖ్యమైన మార్కెట్లని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌‌లలో కలిపి తమ వ్యాపారం రూ. 2,060 కోట్లని చెప్పారు. ఏటా 200 కొత్త బ్రాంచ్‌‌లు తెరుస్తున్నామని, ఇటీవలి కాలంలో ఉత్తర, తూర్పు, పశ్చిమ ప్రాంతాలలో విస్తరణకు పెద్ద పీట వేస్తున్నామని అన్నారు. పది, పదిహేను నిముషాలలోనే బంగారం అప్పులను అందిస్తుండటంతో కస్టమర్లు తమను ఇష్టపడుతున్నారని చెప్పారు. ముత్తూట్‌‌ ఫిన్‌‌ కార్ప్‌‌ ఇచ్చిన అప్పుల మొత్తం రూ. 27 వేల కోట్ల దాకా ఉంటుందని తెలిపారు. 130 ఏళ్ల కిందట ఏర్పడిన ముత్తూట్‌‌ పప్పచన్‌‌ గ్రూప్‌‌ (ముత్తూట్‌‌ బ్లూ)లో ముత్తూట్‌‌ ఫిన్‌‌కార్ప్‌‌ భాగమని వాసుదేవన్‌‌ తెలిపారు. సక్రమంగా చెల్లింపులు జరిపే కస్టమర్లకు ఇన్సెంటివ్స్‌‌ అందించడం తమ కంపెనీ ప్రత్యేకతగా చెప్పారు. టూవీలర్‌‌ అప్పులు, ఇన్సూరెన్స్‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌, గోల్డ్‌‌ స్కీములు వంటి కార్యకలాపాలనూ ముత్తూట్‌‌ ఫిన్‌‌కార్ప్‌‌ నిర్వహిస్తోందని తెలిపారు. కామన్‌‌ మాన్‌‌, చిన్న వ్యాపారస్తులే ప్రధానంగా తమ కస్టమర్లని, దేశం మొత్తం మీద 19 లక్షల మందికి సేవలందిస్తున్నామని చెప్పారు.

 

Latest Updates