టెంట్‌లో మంటలు చెలరేగడమే గల్వాన్ ఘర్షణకు కారణం

కేంద్ర మంత్రి వీకే సింగ్ వెల్లడి
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని గల్వాన్ వ్యాలీలో ఇండో–చైనా సైనికుల మధ్య ఘర్షణ జరగడానికి చైనీస్ టెంట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడమే కారణమని కేంద్ర మంత్రి వీకే సింగ్ తెలిపారు. ‘కార్ప్ కమాండర్ లెవల్ చర్చల సమయంలోనే ఎల్‌వోసీకి సమీపంలో ఇరు దేశాల సైనికులు ఎవరూ ఉండొద్దని నిర్ణయించారు. అయితే ఘర్షణ జరిగిన రోజు ఇండియా జవాన్లు తమ వైపునకు తనిఖీ చేయడానికి వెళ్లారు. ఆ టైమ్‌లో చైనా సైనికులు అక్కడే కొన్ని టెంట్‌లు వేసుకొని ఉండటాన్ని మన ఆర్మీ గుర్తించింది. దీంతో ఇండియా కమాండింగ్ ఆఫీసర్ అక్కడికి వెళ్లి ఆ టెంట్లను తొలగించాల్సిందిగా చైనా సైనికులను అడిగారు. వాళ్లు టెంట్లను తీసేస్తున్న టైమ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఇరు దళాల సైనికులు ఘర్షణకు దిగార’ని వీకే సింగ్ చెప్పారు. ఈ ఫేస్‌ ఆఫ్‌లో 20 మంది ఇండియా జవాన్లు చనిపోగా.. మరణించిన తమ సైనికుల సంఖ్యను డ్రాగన్ కంట్రీ బయటపెట్టలేదు. అయితే ఈ ఘర్షణలో 40 మంది వరకు చైనా జవాన్లు చనిపోయి ఉండొచ్చునని వీకే సింగ్ పేర్కొన్నారు.

Latest Updates