చెట్టును పట్టుకుంటే రోగాలు మటుమాయం

రోగమొస్తే ఏం చేస్తం? ఆస్పత్రికి వెళ్లి ట్రీట్​మెంట్​ తీసుకుంటం. కానీ, మధ్యప్రదేశ్​ జనం మాత్రం ఆస్పత్రి నుంచి ఓ అడవికి పోతున్నరు. ఆ అడవిలో ఓ చెట్టును ముట్టుకుంటున్నరు. మామూలు పేషెంట్లు కూడా కాదు. ఆక్సిజన్​ సిలిండర్లు పెట్టుకుని సీరియస్​గా ఉన్న రోగులూ దాని దగ్గరకు వెళుతున్నరు. పట్టుకుని రోగం నయం చేసుకుందామనుకుంటున్నరు. ఆ చెట్టుకు అంత మహిమ ఉందని నమ్ముతున్నరు వాళ్లు. ఆ చెట్టు ఇప్ప చెట్టు. అవును, మొన్నమొన్నటి వరకు చెట్ల మధ్యలో ఓ చెట్టుగానే ఉన్న ఆ ఇప్ప చెట్టు, ఇప్పుడు రోజూ 25 వేల నుంచి 30 వేల మంది జనాన్ని రప్పించుకుంటోంది. ఇప్పటికే రెండు నెలల్లో 10 లక్షల మందిదాకా అక్కడికి పోయిన్రు. మరి, నిజంగా దానికి ఆ మహిమ ఉందో లేదో తెలియదు గానీ, దానికి ఆ క్రేజ్​ ఎట్ల వచ్చింది? ఆ చెట్టు ఎక్కడుంది?

ఆ ఒక్క పుకారుతోనే

మధ్యప్రదేశ్​లోని నయాగావ్​కు సమీపంలోని సాత్పురా టైగర్​ రిజర్వ్​ (ఎస్​టీఆర్​)లో ఉంది ఆ ఇప్ప చెట్టు. అసలు ఈ చెట్టుకు ఎందుకింత క్రేజ్​ వచ్చిందో తెలుసుకునే పనిలో పడిన ఎస్​టీఆర్​ రేంజర్లకు ఓ పుకారు వల్లే ఇదంతా అని తెలిసింది. రూప్​ సింగ్​ ఠాకూర్​ అనే ఓ రైతు ‘అడవిలోని ఇప్ప చెట్టుకు రోగాల్ని తగ్గించే మహిమలున్నాయి’ అని జనానికి చెప్పాడట. దీంతో అప్పటి నుంచి ఆ నోటా ఈ నోటా ఆ మాట పాకి ఇంతలా జనం అక్కడికి వెళ్లేలా చేస్తోందట.  ముసలి వాళ్లు, వయసోళ్లు అన్న తేడా లేకుండా అక్కడికి జనాలు వెళుతున్నారని అధికారులు చెబుతున్నారు. చేతికి సెలైన్​ బాటిళ్లు, ఆక్సిజన్​ సిలిండర్లు పెట్టుకుని రోగులను తీసుకుని వస్తున్నారంటున్నారు.  ఇటీవల ఓ వ్యక్తి ఆ ఇప్ప చెట్టును తాకి రోగం నయం చేసుకునేందుకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ చేయించుకుని మరీ వెళ్లాడట. డాక్టర్లు వద్దని మొత్తుకున్నా వినలేదట. చివరకు ఆ చెట్టును తాకిన కొద్ది గంటలకే ఆ వ్యక్తి చనిపోయాడని అధికారులు చెప్పారు.

కొట్లు పెట్టిన్రు

రద్దీ ఎక్కువవడంతో నయాగావ్​ ఊరోళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఆ చెట్టు దగ్గర కొట్లు పెట్టేశారు. కొబ్బరి కాయలు, అగరబత్తులు, అక్కడికి వచ్చిపోయే వారికి అవసరమయ్యే స్నాక్స్​, నీళ్లు వంటివి అమ్ముతున్నారు. ఈజీ మనీ కోసమే ఆ ఊర్లోని కొందరు జనం ఈ కట్టుకథను ప్రచారం చేశారని అధికారులు చెబుతున్నారు. ఎప్పుడూ శుభ్రంగా ఉండే ఆ ఏరియా ఇప్పుడు కొట్లు, రద్దీతో చెత్త మయంగా మారిందని అంటున్నారు. ప్రొటెక్టెడ్​ జోన్​లో రద్దీ ఎక్కువ కావడంతో తలలు పట్టుకుంటున్నారు. తొక్కిసలాట జరగకుండా పోలీసులు, రేంజర్లు చర్యలు తీసుకుంటున్నారు. జనాల వల్ల అక్కడి జంతువుల మనుగడ కష్టమవుతుందని అంటున్నారు. ఇక, ఇంతటి రద్దీకి కారణమైన రూప్​సింగ్​ మాత్రం కనిపించకుండా పోయాడని అధికారులు చెబుతున్నారు. అయితే, అంతకుముందు ఓ బీట్​గార్డ్​తో రూప్​ సింగ్​ మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ‘‘నేను ఇంటికి వెళుతుంటే ఈ చెట్టు నన్ను తన దగ్గరకు లాక్కుంది. దాదాపు పది నిమిషాలు దానికి అతుక్కుపోయా. ఆ తర్వాత అదే నన్ను వదిలేసింది. తర్వాత నాలో చాలా పెద్ద మార్పే వచ్చింది. నాకు రోగం మాటే తెలియదు. అందుకే ప్రతి ఆది, బుధవారాల్లో చెట్టు దగ్గరకు వచ్చి మొక్కుకుంటూ ఉంటా” అని బీట్​గార్డ్​తో రూప్​ సింగ్​ చెప్పాడు.

Latest Updates