రూ.10వేలు ఇస్తాం…రాష్ట్రానికి రావద్దు: నాగాలాండ్ ఆఫర్

లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లను ప్రారంభించింది. వేలాది మంది వలస కూలీలు ఈ రైళ్ల ద్వారా సొంత రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో నాగాలాండ్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన నాగాలాండ్ ప్రజలు ఇప్పుడప్పుడే రావొద్దని, వారందరికీ రూ. 10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది.

వలస కార్మికుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నకారణంగా నాగాలాండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నాగాలాండ్ కరోనా రహిత రాష్ట్రంగా ఉంది. ఈ టైంలో వలస కూలీలు తిరిగి వస్తే కరోనా ఎక్కడ వ్యాప్తి చెందుతుందోనన్న ఆందోళనతో ఎక్కడి వారు అక్కడే ఉండేలా ఖర్చులు, ఇతర అవసరాల కోసం రూ. 10 వేల ఆర్థిక సాయం ప్రకటించింది.

వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన దాదాపు 18 వేల మంది నాగాలు స్వరాష్ట్రానికి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నట్టు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి టెంజెన్ టోయ్ తెలిపారు. అయితే, వారెవరూ ఇప్పుడే రావాల్సిన అవసరం లేదని, ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వృద్ధులు, చికిత్స తీసుకుంటున్న రోగుల ఖర్చుల కోసం రూ. 10వేలు డిపాజిట్ ఆయన తెలిపారు. వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ మొత్తాన్ని జమచేస్తున్నట్టు తెలిపారు.

Latest Updates