రిసెప్షన్ లో గన్ తో ఫోజులిచ్చిన ఓ పార్టీ నేత కొడుకు, కోడలు

ఓ రాజకీయ  పార్టీ నేత కుమారుడు పెళ్లి రిసెప్షన్ లో హల్ చల్ చేశాడు. బుల్లెట్లు లోడ్ చేసిన రైఫిల్ గన్ తో ఫోజులిచ్చాడు. ఇప్పుడా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ యునైటెడ్ (ఎన్ఎస్సిఎన్-యు) నాయకుడు బోహోటో కిబా కుమారుడి వివాహం నవంబర్ 9న జరిగింది. వివాహం అనంతరం ఏర్పాటు చేసిన రిసెప్షన్ లో నూతన దంపతులు అతిథుల్ని భయాందోళనకు గురిచేశారు.  వధువు,వరుడు  ఆటోమేటిక్ అటాక్ రైఫిల్స్, ఎకె 56, ఎం16 గన్ తో ఫోజులిచ్చారు. ఈ ఫోజులతో రిసెప్షన్ కు వచ్చిన బంధువులు లోడ్ చేసిన గన్ ఎక్కడ పేలుతుందోనని ప్రాణభయంతో బిక్కజచ్చిపోయారు. అయితే ఈ బంధువుల్లో ఔత్సాహికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు హాట్ టాపిగ్గా మారాయి.

వీడియోలపై స్పందించిన  నాగాలాండ్ పోలీస్ చీఫ్ టి.జాన్ లాంగ్కుమెర్ సోషల్ మీడియాలో ఫోటోల్ని చూడలేదని,  అయితే  ఆయుధాల చట్టం 1959 ప్రకారం నిషేధించబడిన అక్రమ ఆయుధాలను ప్రదర్శించినందుకు వధూవరులను అరెస్టు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.

కేసు నమోదు చేసి,  ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని నాగాలాండ్ గవర్నర్ ఆర్‌ఎన్ రవి రాష్ట్ర డీజీపీ ని ఆదేశించారు.

Latest Updates