కేసీఆర్.. జగన్‌తో ‌‌‌కుమ్మక్కయ్యావా?

చిత్తశుద్ధి ఉంటే నీళ్ల దోపిడీపై సుప్రీంలో పిటిషన్‌‌‌‌ వేయి
సీఎం కేసీఆర్‌‌‌‌కు నాగం లెటర్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: కృష్ణా నదీ జలాలను ఏపీకి తరలించే విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మధ్య చీకటి ఒప్పందం ఉన్నదని పీపీసీ కృష్ణా నదీ జలాల పరిరక్షణ కమిటీ చైర్మన్‌నాగం జనార్దన్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు సోమవారం లెటర్‌ రాశారు. తెలంగాణ ప్రజలకు నష్టం కలిగేంచే, ఇక్కడి రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టే హక్కు కేసీఆర్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన తర్వాతే ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు కెపాసిటీని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచిందని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు కెపాసీటి పెంపుపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేసేలా తెలంగాణ పభుత్వం తరుఫున సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసి కేసీఆర్‌ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘ ఏపీ చేస్తున్న నీటి దోపిడీ ఇప్పటికైనా ఆపాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ నీటి చట్టాలను ఉల్లంఘించి కృష్ణా నది జలాలను పెన్నా నది బేసిన్‌లోని తెలుగు గంగ, సోమశిల, కండలేరు, గాలేరు–నగరి, వెలిగొండ వంటి ప్రాజెక్టులకు తరలించేలా చేయడం తప్పు కాదా? 326 టీఎంసీల కెపాసిటీతో అక్రమంగా రిజర్వాయర్లుకట్టి నీటిని దోచుకుంటున్నది వాస్తవం కాదా? ఈ ప్రాజెక్టుల్లో అక్రమాలు చాలవన్నట్లు ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌మోహన్‌‌‌‌రెడ్డి ప్రభుత్వం మళ్లీకృష్ణా నది నీటిని రాయలసీమకు తరలించేందుకు ప్రయత్నిస్తుంటే మీరు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. దీనిపై ఎందుకు నోరుమెదపడంలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో కృష్ణా బేసిన్‌లో లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందడం లేదన్నది వాస్తవం కాదా?

నీటి చట్టాల నిబంధనల ప్రకారం…
ఒక బేసిన్‌లో సాగునీరు, తాగునీరు పూర్తి స్థాయిలో సరిపోయిన తర్వాతే మరో బేసిన్‌లోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఏపీ సీఎం జగన్‌ మోహన్‌‌‌‌రెడ్డి మీ కళ్ళముందే మన నీటిని అక్రమంగా ఆ రాష్ట్రంలోని పెన్నార్‌ బేసిన్‌ కు తరలించుకుపోతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇందులో రాజకీయ కుట్ర ఉన్నట్లు స్పష్టంగా కనపడుతున్నది. మీ రాజకీయం వల్ల నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఎండిపోవా? వాటిమీద ఆధారపడిన కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్‌ఎల్‌‌‌‌బీసీ, ఏఎంఆర్‌పీ ప్రాజెక్టులు నిరర్దకం కావా? మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలు సాగు–తాగునీరులేక ఎడారులుగా మారవా? దీనికి మీకు బాధ్యత లేదా? ఏపీ సీఎం జగన్‌ చేసే ఈ నీటి దోపిడీ వెనుక మీ మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఏమిటి? నేను పంపిన లెటర్‌ను పూర్తిగా చదివి నా ఈ ప్రశ్నలకు బదులివ్వండి’ అని పేర్కొన్నారు.

For More News..

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మృతి

నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్.. ఇద్దరికి వ్యాక్సిన్

ఆక్స్‌‌‌‌ఫర్డ్‌‌‌‌ వ్యాక్సిన్ సేఫ్‌.. ఫేజ్ 1 ట్రయల్స్ సక్సెస్

Latest Updates