చదువులో పోటీ పడుతుండని కొట్టి చంపేసిండు

    గత నెలలో మృతిచెందిన 8వ తరగతి స్టూడెంట్​

    హార్ట్​ప్రాబ్లం ఉండడంతో గుండెపోటుగా నమ్మించిన్రు

    ఫ్రెండ్స్​చెప్పడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి..

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: చదువులో పోటీ పడుతుండడంతో తట్టుకోలేక ప్లాన్​ప్రకారం తోటి స్టూడెంట్​ను కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, మృతుడి తండ్రి వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ పట్టణంలోని ప్రైవేట్​స్కూల్లో అక్షయ్, మరో స్టూడెంట్​పోటాపోటీగా చదువుతుండేవారు. అక్షయ్ పై మరో స్టూడెంట్​కు అసూయ కలిగింది. ఫిబ్రవరి మొదటివారం హైదరాబాద్ టూర్ కు పిల్లలను తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయినప్పటికీ టీచర్లు ఆ సంఘటన గురించి పట్టించుకోలేదు. అక్షయ్​కూడా ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే అక్షయ్ ను హత మార్చాలని ప్లాన్​చేసిన స్టూడెంట్​తోటి ఫ్రెండ్స్​తో విషయం చెప్పాడు.

అక్షయ్ కి  హార్ట్ ప్రాబ్లం ఉందని, గుండె దగ్గర బలంగా కొడితే  చనిపోతాడని వాళ్లంతా చర్చించుకున్నారు. గత నెల 7వ తేదీన అక్షయ్, మరో స్టూడెంట్​మధ్య మాటా మాటా పెరిగింది. గుండె వద్ద బలంగా కొట్టడంతో అక్షయ్​అక్కడికక్కడే పడిపోయాడు. అతనికి హార్ట్ ఎటాక్ వచ్చిందని, చనిపోయాడని స్కూల్​యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు నరేందర్, అనిత వాస్తవమే అనుకుని అక్షయ్ శవాన్ని సొంత ఊరైన తాడూరు మండల కేంద్రం తీసుకెళ్లి పొలంలో అంత్యక్రియలు జరిపారు. ఇటీవల అక్షయ్ ఫ్రెండ్స్​కొందరు వచ్చి అక్షయ్​తండ్రి నరేందర్ కు జరిగిన విషయం వివరించారు. దీంతో బుధవారం సాయంత్రం నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాడూరులో అక్షయ్ శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని  నాగర్ కర్నూల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Latest Updates