100కి కాల్ చేసిన యువతి : తీరిక లేదన్నపోలీసులు

ఎవరైనా ఆపదలో ఉంటే 100కాల్ చేస్తే పోలీసులు కాపాడతారనే మాటల్లో వాస్తవం లేదంటూ నల్గొండ జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.

వెటర్నరీ డాక్టర్  పై జరిగిన ఘోరం మన రాష్ట్రంతో పాటు దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది. సాయం చేస్తామని చెప్పి.. అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి హతమార్చిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. దాదాపు మూడు గంటలపైగా ఆమెను హింసపెట్టి.. హత్య చేసి.. ఆనవాలు దొరక్కుండా చేయాలని పెట్రోల్ పోసి తగలబెట్టారు. తోటి వారిని నమ్మాలంటే భయపేడేలా చేసిన ఈ అమానవీయ ఘటన ఒక్కసారిగా ఆడబిడ్డలున్న కుటుంబాల్లో వణుకు పుట్టించింది.

వెటర్నరీ డాక్టర్ దారుణంపై తెలంగాణ హోం మినిస్టర్ మహమూద్ అలీ మాట్లాడుతూ..ఘటనలోనూ ఆమె తన చెల్లెలికి ఫోన్ చేసిన సమయంలో వెంటనే పోలీసులకు సమాచారం అందించి, వారు స్పందించేవారని అన్నారు. అయితే హోం మినిస్టర్ వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 100కాల్ చేస్తే పోలీసులు స్పందిస్తారనే గ్యారెంటీ లేదని అంటున్నారు నల్గొండ జిల్లా ప్రజలు.

 అందుకు ఊతం ఇచ్చేలా నల్గొండ జిల్లాకు గుండ్లపల్లి క్రాస్ రోడ్, ఇందిరమ్మ కాలనీకి చెందిన విజయలక్ష్మీ కుటుంబసభ్యుల్ని పక్కింటి వారు వేధింపులకు గురిచేస్తున్నారు.  ప్రశ్నిస్తే దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో తక్షణ సాయం కోసం విజయలక్ష్మీ 100కి కాల్ చేసింది.    

 కాల్ చేస్తే అటునుంచి  మిమ్మల్ని వన్ టౌన్ పోలీసులు సంప్రదిస్తారంటూ ఓ టెక్ట్స్ మెసేజ్ వచ్చింది. కొద్దిసేపటికి వన్ టౌన్ పోలీసులు బాధితురాలికి ఫోన్ చేసి ఏం చెప్పారో తెలుసా..? మేం లంచ్ చేస్తున్నాం. మీదగ్గరకు వచ్చే తీరిక లేదు. మీరే స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయండి. తరువాత దాడి చేసిన వారిని పట్టుకుంటాం అనే  సమాధానం వచ్చింది. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు యువతి తనకు జరిగిన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అయితే విజయలక్ష్మీ పోస్ట్ పై ఎస్పీ రంగనాధ్ స్పందించారు. బాధితురాలి పట్ల నిర్లక్ష్యం వ్యవహరించిన పోలీసుల్ని, దాడికి పాల్పడ్డ నిందితులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు.

Latest Updates