రెండూళ్ల కథ : అటు నీళ్లు .. ఇటు కన్నీళ్లు

అవి రెండూళ్లు.. ఒకే జిల్లా.. ఒకే మండలం.. రెండింటి మధ్య దూరం రోడ్డు మార్గంలో ఏడు కిలోమీటర్లు. పిల్ల బాటైతే నాలుగు కిలోమీటర్లు. ఈ ఊర్లో మైక్ పెడితే ఆ ఊర్లో స్పష్టంగా వినిపిస్తుంది. రెండూళ్లకు సాగే ఆధారం. పదేళ్ల కింద రెండూ కరువు, కష్టాలు, కన్నీళ్లతో సహజీవనం చేశాయి. కానీ ఇప్పుడు ఈ రెండింటి బతుకు దెరువులో, బతుకు తీరులో ఎంతో తేడా. ఒకటి అప్పులతో ఆగమైతుంటే.. మరోటి ఆదా చేసుకుంటున్నది. ఒకటి పొట్టచేతబట్టుకొని వలస పోతుంటే.. మరొకటి వేరే ఊళ్లకు కూడా బతుకుదెరువు చూపుతున్నది. ఈ తేడాకు కారణం నీళ్లు! ఆ రెండూళ్లు నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని వొద్దిరెడ్డి గూడెం, పోచంపల్లి. ఈ గ్రామాల్లో వీ6, వెలుగు బృందం పర్యటించింది. అక్కడి వారితో మాట్లాడింది.

ఇదీ పోచంపల్లి కథ..

పోచంపల్లి.. సుమారు 3 వేల వరకు జనాభా ఉంటుంది. బత్తాయి తోటలకు పెట్టింది పేరు. బత్తాయి దిగుబడిలో పదేళ్ల కింద నల్గొండ జిల్లాలోనే టాప్. తొలి నాళ్లలో బత్తాయి పంట కొందరికి గిట్టుబాటు అయింది. దాంతో అందరూ అదే దారిలో వెళ్లారు. ఊర్లోని1,800 ఎకరాల్లో నాలుగు వందల ఎకరాలకు పైగా బత్తాయి సాగు చేశారు. మిగిలిన దాంట్లో పత్తి. బత్తాయిని కాపాడుకునేందుకు బోర్లు వేయక తప్పని పరిస్థితి. పుట్టిన చోటల్లా అప్పులు తెచ్చారు. బోర్లు వేశారు.  నీళ్లే పడనివి కొన్ని. పడినా కొన్నాళ్లే నడిచి ఆగేవి ఇంకొన్ని. ఆ తర్వాత ట్యాంకర్‌‌‌‌కు వెయ్యి రూపాయల చొప్పున నీళ్లు కొన్నారు. అదీ చాలక గ్రామానికి 7 కిలోమీటర్ల నుంచి పైపులు వేసుకుని తోటలకు నీళ్లు పెట్టారు. అయినా ఫలితం లేదు. పంట రాలేదు. అప్పులు మిగిలాయి. వాటిని తీర్చేందుకు కొందరు భూములమ్ముకున్నారు. కొందరు ఇళ్లు అమ్ముకున్నారు. ఇంకొందరు ఊరినే విడిచి పెట్టారు. పదెకరాల భూమి ఉన్న వారు సైతం హైదరాబాద్​ లో పాచి పనులు చేసుకునేందుకు వెళ్లారు.

అప్పుల బాధకు తాళ లేక కొందరు భూములు అమ్ముకున్నారు. కొందరు గుండెపోటుతో చనిపోయారు. పోచంపల్లిలో ఏ ఇంట్లో చూసినా బాధే. ఇప్పుడక్కడ ఇళ్ల వద్ద ముసలివాళ్లే కన్పిస్తున్నారు. ఊరు బతుకునిస్తుందనే భరోసా ఎవ్వరిలో కన్పించడం లేదు.  చాలా మంది రైతులు పొద్దూమాపు ఎండిన బత్తాయి తోటల వద్దకు వెళ్లి వస్తున్నారు. ఖర్చులు మరింత పెరుగుతాయని, అందుకే పిల్లలకు కుదిరిన  వెంటనే పెళ్లిళ్లు చేస్తున్నామని గ్రామానికి చెందిన సత్యనారాయణ చెప్పారు. గ్రామంలో అప్పులిచ్చిన వారు రైతుల ఇళ్లకు తాళలేస్తున్నారు. జల్లా రాంగోపాల్ అలాంటి బాధితుడే. ఈయన ఇల్లుతో సహా తనకున్న పన్నెండెకరాల భూమి అమ్ముకుని అప్పు తీర్చారు. ఇప్పుడు ఊళ్లోనే సైకిల్ ఫంక్చర్ దుక్నం పెట్టుకొని పొట్ట పోసుకుంటున్నడు. గ్రామంలో పుట్టిన  ప్రతీ పిల్లాడిపైన లక్ష అప్పు ఉందని సర్పంచ్ తిరుమల్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.

వొద్దిరెడ్డి గూడెం కథ ఇదీ..

పదేళ్ల కింద వొద్దిరెడ్డి గూడెం కూడా పోచంపల్లి లాంటిదే. ఎస్ఎల్బీసీ కెనాల్ రావడంతో ఊరు బతుకు మారింది.  ఈ ఊళ్లో 103  ఇండ్లు ఉంటాయి. 300 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఎండాకాలంలో కూడా ఊరి చుట్టూ పచ్చగానే ఉంది. రకరకాల తోటలున్నాయి. రోజూ అక్కడి వారికి  ఏదో పని దొరుకుతున్నది. ఏడాదికి ఒకసారి కాల్వ పారుతుంది. రెండు కార్ల పంటలకు నీళ్లు దొరుకుతాయి. పదేళ్ల కింద బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు కూడా మళ్లీ గ్రామానికి చేరుకున్నారు. వ్యవసాయంలో కుదురుకున్నారు. బువ్వ కోసం ఎక్కడెక్కడికి వెళ్లిన తామంతా ఇప్పుడు సొంతూళ్లో హాయిగా బతుకుతున్నామని గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి అన్నారు. ‘కాల్వ వచ్చిన తర్వాత పంటలు పెరిగాయి. దిగుబడి పెరిగింది. తొలి ఐదేళ్లు అప్పులు తీర్చడానికి సరిపోయింది.

ఇప్పుడు  అంతో ఇంతో మిగులుతున్నది’ అని ఆయన చెప్పారు. గతంలో ఈ ఊళ్లో జొన్నలు,  సజ్జలు, పత్తి, ఆముదాలు సాగుచేసే వారు. ఇవే వారికి ప్రధాన పంటలు. నీటి వసతి వచ్చిన తర్వాత  వరి, పత్తి, బత్తాయి, దానిమ్మ, కందులు, శనగలు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తున్నారు. గ్రామంలో బెల్ట్ షాపు లేదు. ప్రతీ  ఇంటి నుంచి పీజీ వరకు చదువుకున్న వారున్నారు. మార్కెట్, సీజన్ బట్టి పంటలు సాగు చేస్తున్నారు.