స్వార్థంలేని మాస్టార్లు :ఆలస్యమైనా పాఠాలు చెప్తారు..జీతం తీసుకోరు!

ఆలస్యంగా వచ్చిన విద్యార్థికి హాజరు వెయ్యం అనే టీచర్లు స్కూల్‌ కి ఆలస్యం గా వచ్చి జీతాలు తీసుకోవచ్చా? ‘విద్యార్థికీ, ఉపాధ్యాయుడికీ ఒకే న్యాయం ఉండాలి. అందుకే పరీక్ష రాయని విద్యార్థికి మార్కులు, పాఠాలు చెప్పని పంతుళ్లకు జీతాలు వద్దు.’ ఈ మాట అంటున్నది గవర్నమెంట్‌ టీచర్ల మీద కోపం ఉన్నవాళ్లు కాదు. గవర్నమెంట్‌ స్కూల్‌ టీచరే. ఆయన పేరు గడగోజు సతీష్‌. ‘పిల్లలకు పాఠాలు చెప్పడం మా బాధ్యత. మీ పిల్లల్ని మాకు అప్పగించండి. వాళ్లని తీర్చిదిద్దడంమా వంతు’ అని తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నాడు ఈ ప్రధానోపాధ్యాయుడు.

ప్రభుత్వ పాఠశాలల ముందు చదవాలి. అందరూ ఎదగాలి’ అనే వాక్యాలు కనిపిస్తాయి. ఆ లక్ష్యానికి చేరుకోవాలంటే ఏంచేయాలో ఈ పాఠశాల ముందు కనిపిస్తుంది. ఇది నల్లగొండ జిల్లాలోని అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. టీచర్లు ఇటీవలే ఒక ఫ్లెక్సీని ఈ పాఠశాల ముందు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ మీద రాతలు ఆ ఊరి జనాన్నే కాదు సోషల్‌ మీడియాలో సామాన్య జనాన్నీ ఆలోచింపజేశాయి. ‘ప్రభుత్వ బడిలో చదువులు సక్కంగ చెప్పరు. ఆలస్యంగా రావచ్చు.. తొందరగ పోవచ్చు’ అనే అపవాదు అక్షరాలా తప్పు అని నిరూపిస్తోందీ బోర్డు. ‘బడికి ఆలస్యంగ వచ్చినా, ముందుగా ఇంటికి పోయినా జీతం తీసుకోను, ఆ రోజు వేతనం గ్రామ పంచాయతీకి, విద్యార్థుల తల్లిదండ్రులకే ఇస్తాను’ అని హెడ్‌ మాస్టర్‌ సతీష్‌ ప్రకటించిండు. ఇది ప్రచార గిమ్మిక్‌ కాదు. నాలుగేళ్లుగా డ్రాపవుట్స్‌‌ (బడిమానేసిన) పిల్లలను మళ్లీ బడిబాట పట్టించిన విజయ గర్వంతో ఆ స్కూల్‌ టీచర్లు చేసిన ప్రకటన ఇది.

వెలుగు వచ్చిన వసంతం

చిట్యాల ప్రభుత్వ పాఠశాలకు 2010లో గడగోజు సతీష్‌ కి పోస్టింగ్‌ వచ్చింది. ఆయన ఉద్యోగంలో చేరే నాటికి ఆ బడిలో అయిదు తరగతుల్లో కలిపి ఉన్నది 21 మంది విద్యార్థులే. ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతుండటం చూసిన ఆ గ్రామస్తులు రెండు మూడేళ్లకు ఈ బడి మూతపడుతుందేమోనని అనుకునేవాళ్లు. సతీష్‌ తొమ్మిదేళ్లుగా అదే బడిలో పనిచేస్తున్నాడు. కానీ బడి మూతపడలేదు. మారుమూల పల్లెల్లోని పేద పిల్లలకు అక్షర జ్ఞానం అందిస్తున్న ఈ బడిని కాపాడుకునేందుకు టీచర్లు శాయశక్తులా పనిచేశారు. తమ బాధ్యతగా పిల్లలకు పాఠాలు చెప్పారు. అదనపు బాధ్యతగా ఊళ్లోని ప్రజలందరికీ చదువు ప్రాధాన్యతను తెలియజేసి బడి మానేసిన పిల్లల్ని మళ్లీ బడిబాట పట్టించారు. ఇలా నాలుగేళ్ల నుంచి ఆ బడిలో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఏటా పది నుంచి పదిహేను మంది పిల్లలు కొత్తగా చేరుతున్నారు. ఇప్పుడు చిట్యాలలోని ఆ బడిలో 63 మంది పిల్లలు చదువుకుంటున్నారు.

స్వార్థంలేని జీవిత పాఠం

బడిలో పాఠాలు చెప్పడం టీచర్ల డ్యూటీ. అదొక్కటే కాదు! ఆ బడిని కాపాడుకోవడం కూడా నా బాధ్యత అనుకున్నడు సతీష్‌ . బడి మానేసిన పిల్లల్ని మళ్లీ బడికి రప్పించేందుకు ఇల్లిల్లూ తిరిగిండు. ఆ ఊరి సర్పంచ్‌ బొమ్మరబోయిన రామారావు, ఊరి జనం సహకారంతో ప్రైవేటు బడులకు పోతున్న పేద పిల్లల్ని కూడా ప్రభుత్వ బడికి రప్పించిండు. ప్రైవేటు బడులు ప్రభుత్వ బడులకు సాటిరావని నిరూపించేందుకు ఆ బడిలో టీచర్ల కొరత ఉన్నా అదనపు క్లాసులతో పిల్లల చదువుకు ఇబ్బందులు రాకుండా కష్టపడ్డడు. ఆయన కష్టానికి తగ్గట్లే ఇతర టీచర్లు కూడా సహకరించారు. ఇదంతా స్వార్థంతో చేసి ఉంటారనుకునే వాళ్లూ లేకపోలేదు. ప్రభుత్వ బడిలో 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ని నియమిస్తారు. విద్యార్థులు లేకపోతే టీచర్లను మరో ఊరికి ట్రాన్స్‌‌ఫర్‌ చేస్తారు. పట్టణానికి దూరంగా ట్రాన్స్‌‌ఫర్‌ అయితే పిల్లల చదువులు, ప్రయాణాలు కష్టం. ట్రాన్స్‌‌ఫర్‌ కష్టాలు తప్పించుకునేందుకు బడిబాట పట్టమని బ్రతిమాలే టీచర్లూ ఉన్నారు.

కానీ సతీష్‌ సార్‌ లో అలాంటి స్వార్థం లేదు. ఆయన ఉండేది ర్యాలగూడెంలో. పని చేసేది మారుమూల పల్లెటూరిలో. రోజూ వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయాలి. గుంటూరు జిల్లా సరిహద్దులో ఉన్న పల్లెటూరిలో పని చేస్తున్నడు. ఆయనకు మూడు సార్లు  ట్రాన్స్‌‌ఫర్‌ చేయించుకునే అవకాశం వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని వాడుకోలేదు. ఎందుకంటే..‘ఈ బడిని ఎలాగైనా బాగుచేయాలనుకున్న. నేను అక్షరాభ్యాసం చేసింది, ప్రాథమిక విద్యను చదివింది ప్రభుత్వ పాఠశాలలోనే. నాకు మా టీచర్లు చక్కగా పాఠాలు చెప్పారు. నేను బాగా చదువుకున్నాను. ఇప్పుడు సంతోషంగా బతుకుతున్నాను. నా టీచర్లు నన్ను నిర్లక్ష్యం చేస్తే నేను ఈ స్థితిలో ఉండేవాడినా? నా టీచర్లలాగే నేనూ నలుగురిని ప్రయోజకుల్ని చేస్తాను.’ అంటున్నా డు సతీష్‌ సార్‌ . తనతోపాటు పనిచేసిన టీచర్లు ఈ తొమ్ మిదేళ్లలో ముగ్గురు మారిపోయారు. తాను మాత్రం ఆ మారుమూల పల్లె ప్రేమలోనే ఉండిపోయిండు.

రేపటి వెలుగు కోసం.. రాత్రి బడి

బడిని బాగు చేసే ప్రయత్నానికి సతీష్‌ సార్‌ తో పనిచేసే టీచర్లు సహకరించారు. బడి మానిన పిల్లల్ని బడికి తిరిగి తీసుకురావడం ఒక ఎత్తయితే వాళ్లను మళ్లీ చదువుబాట పట్టించడం మరో ఎత్తు. వాళ్లకు నచ్చేలా చదువు చెప్పాలి. అప్పుడే పాఠాలకు అలవాటు పడతారు. అందుకని పిల్లలకు ఆటపాటలతో చదువులు చెప్పడం మొదలుపెట్టారు. పాఠాలపై ఆసక్తి పెంచేందుకు టీచింగ్‌ ఎయిడ్స్‌‌తో నెమ్మదిగా పిల్లల్ని దారికి తెచ్చారు. పరిశుభ్రత కోసం బడిలో మూత్రశాలల్ని ఊరి ప్రజల సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ మధ్యనే గురుకుల విద్యా సంస్థలు నూతన విద్యార్థుల ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. ఈ పేద పిల్లల్ని అక్కడికి చేరిస్తే వాళ్ల బతుకు చక్కబడుతుందని సతీష్‌ సార్‌ అనుకున్నారు. ఆ బడిలో మరో ఉపాధ్యాయుడు నాతాల వెంకటరెడ్డి తో కలిసి మరో ప్రయోగం చేసిండు. సాయంత్రం క్లాసు లు అయిపోయిన తర్వాత గురుకులాలకు దరఖాస్తు చేసిన పిల్లలకు ప్రత్యేకంగా కోచింగ్‌ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నా రు.

ఈ కోచింగ్‌ కు కావాల్సిన పుస్తకాలను ఆ పేద పిల్లలు కొనలేరు. దానికి కొంత ఖర్చవుతుంది. దాతల సాయం కావాలని సర్పంచ్‌ ని అడిగారు. ఆ సర్పంచ్‌ సొంత డబ్బులతో కోచింగ్‌ మెటీరియల్‌ పిల్లలందరికీ కొనిచ్చిండు. పిల్లల చదువు పట్ల టీచర్ల బాధ్యతను చూసిన మండల విద్యాధికారి ఆ పాఠశాలకు ఒక విద్యా వాలంటీర్‌ ని మంజూరు చేసిండు. అదే గ్రామానికి చెందిన పల్లవి అనే యువతి ఆ పాఠశాలలో టీచర్‌ గా చేరింది. ఈ ముగ్గు రి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలను ఆదర్శపాఠశాలగా తీర్చిదిద్దే ప్రయత్నం నడుస్తోంది. తమ సేవలు ఎక్కువ మంది విద్యార్థులు ఉపయోగించుకోవాలనేది ఈ టీచర్ల పట్టుదల. పిల్లల సంఖ్యను పెంచేందుకు ఇప్పుడిలా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

Latest Updates