అడవినీ కబ్జా పెడతరా?

చేపకు చెరువు, పిట్టకు  చెట్టు ఎట్లనో గిరిజనులకు అడవి అట్ల! చెరువులోంచి చేపను ఒడ్డున పడేస్తే ఎట్లా గిలగిలా కొట్టుకొని చచ్చిపోద్దో, అడవిలోంచి బయటకొస్తే అరుదైన ఆదిమవాసులు, వారి కల్చర్​ కూడా అట్లాగే అంతరిస్తవి. కానీ కొన్ని ఏండ్లుగా పులుల కోసం కావచ్చు,  బొగ్గు, వజ్రాలు, యురేనియం, బాక్సైట్​, ఇతరత్రా ఖనిజాల కోసం కావచ్చు,  నక్సల్స్​ అణచివేత  పేరిట కావచ్చు,  ఆదివాసులను అడవుల నుంచి తరిమే కుట్ర రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్నది. కవ్వాల అడవుల్లోని​ గోండులు, కొల్లాంలు, నల్లమలలోని చెంచులు, భద్రాచలం ఏజెన్సీలోని సవరలు, గదబలు, కొండరెడ్లు,  తోటి, తదితర తెగలు నేడు దినమొక గండంగా బతుకుతున్నరు.

నల్లమల నుంచి గెంటేయడానికి యత్నాలు

సరిగ్గా పదేళ్ల క్రితం వజ్రాల వెలికితీత పేరుతో నల్లమలను డిబీర్స్ అనే కంపెనీకి అప్పగించేందుకు, ఇందుకోసం అక్కడి చెంచులను అడవి నుంచి తరలించేందుకు అప్పటి  కాంగ్రెస్​ సర్కారు కుట్ర పన్నింది. అప్పట్లో ప్రజాసంఘాల ఉద్యమంతో వెనక్కి తగ్గింది. ఇన్నేళ్ల తర్వాత యురేనియం తవ్వకాల పేరిట నల్లమల చెంచు పెంటల్లో మరోసారి మంటలు రేగుతున్నయి. యురేనియం తవ్వకాల కారణంగా వెలువడే రేడియేషన్​తో  చెంచు జాతితో పాటు అరుదైన జంతువులు, చెట్లు, అంతరించిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నా సర్కారు తన పని తాను చేసుకుపోతున్నది. ఈ విషయంలో నాటి ఇంగ్లీష్  పాలకులకున్న సోయి  నేటి ప్రభుత్వాలకు లేదనే వాదన వినిపిస్తున్నది. 1920–-30 ప్రాంతంలో నల్లమలను టైగర్‌జోన్‌గా ఏర్పాటు చేయాలని అప్పటి బ్రిటిష్​ సర్కారు సంకల్పించింది. బలవంతంగా చెంచుల తరలింపు మొదలుపెట్టింది. కానీ మైదాన ప్రాంతాలకు చేరగానే చెంచులు పిట్టల్లా రాలిపోవడాన్ని చూసి కలవరం చెందింది.

అప్పటికప్పుడు సుందరన్ అనే సివిల్​ సర్వీసెస్​ ఆఫీసర్  ఆధ్వర్యం లో ఓ టీంను  నల్లమలకు పంపి, చెంచుల జీవన విధానంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయించింది. ఆ నివేదిక చూసి బ్రిటిష్​ ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. చెంచులు ఒక అరుదైన ఆదిమ జాతి అనీ, పులుల కన్నా అపురూపమైన వారని తేల్చడంతో  టైగర్‌జోన్ అనే ఆలోచనను విరమించి ‘చెంచు రిజర్వ్’ ఏర్పాటు చేసింది.  వారి ని కాపాడటంలో  భాగంగా1930 లో మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట ప్రాంతంలోని అప్పాపూర్‌లో ఓ ఆసుపత్రిని కూడా నిర్మించింది. కానీ ఇప్పుడు  కార్పొరేట్​ సంస్థల ప్రయోజనాల కోసం పాలకులు ఇలాంటి అనేక ఆదిమ జాతుల మనుగడను ప్రమాదంలో పడేస్తున్నారు.  ఉదాహరణకు ఆదిలాబాద్‌లో కవ్వాల టైగర్ జోన్ పేరిట పెద్ద సంఖ్యలో గోండుగూడాలను తరలించే ప్రక్రియలో  కేంద్ర, రాష్ట్రాలు దాదాపు విజయం సాధించినయి. తాజాగా టీఆర్​ఎస్​ సర్కారు హరితహారం పేరిట గిరిజనుల చేతుల్లోని లక్షలాది ఎకరాల పోడు భూములను స్వాధీనం చేసుకొని, వారిని చెట్టుకొకరు.. పుట్టకొకరుగా చెల్లాచెదురు చేస్తున్నది.

ఆదివాసీల వలసలపై ఉద్యమం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ‘ఆదివాసీల వలసలపై ఉద్యమం’ అనే నినాదాన్ని ఐక్యరాజ్యసమితి ముందుకుతెచ్చింది. ఆదివాసీల కల్చర్ ను, హక్కులను కాపాడాలని, చదువులోనూ, ఆస్పత్రి అవసరాలనూ దృష్టిలో పెట్టుకుని వారి అభివృద్ధికి తోడ్పడాలని సభ్య దేశాలను కోరింది. ప్రపంచ వ్యాప్తంగా గిరిజనుల స్థితిగతులపై స్టడీ  అనంతరం 1994 ఆగస్టు 9ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా యునైటెడ్ నేషన్స్  ప్రకటించింది. అడవుల్లో నివాసం ఆదివాసీల హక్కు అనీ, అటవీభూములతో వారి  అనుబంధాన్ని ఎవరూ విడదీయరాదని ఆరోజు తేల్చి చెప్పింది.

కానీ ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఇందుకు పూర్తి వ్యతిరేకంగా  ఉంది. అడవుల్లో ఖనిజ సంపద పేరిట కార్పొరేట్​ శక్తులకు రెడ్​కార్పెట్​ పరుస్తూ, ఆదివాసులను అడవులకు దూరం చేసే కుట్రలు అమలవుతున్నాయనిపిస్తోంది. దేశవ్యాప్తంగా అడవిబిడ్డల పోరాట ఫలితంగా 2006 డిసెంబర్‌ 15న అటవీ హక్కుల గుర్తింపు చట్టం పార్లమెంట్​ ఆమోదం పొందింది. గిరిజనులు కానివారు ఏజెన్సీలో భూములు కొనకుండా అడ్డుకునే 1/70 చట్టం అక్కడి వారికి కవచంలా ఉంటోంది.

అడవిగా నిర్వచించిన, గుర్తించిన, ప్రకటించిన ఏదైనా ప్రదేశం, రక్షిత అడవులు, రిజర్వ్‌ ఫారెస్ట్​లు, అభయారణ్యాలు, జాతీయ పార్కుల పరిధిలో డిసెంబర్‌ 13, 2005 కన్నా ముందు నివసిస్తున్న, సాగుచేసుకుంటున్న ప్రజలకు వ్యక్తిగత, సామూహిక హక్కులు  కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. కానీ  ఏజెన్సీల్లో  పరిస్థితి ఇందుకు పూర్తి వ్యతిరేకంగా  ఉంది.1967 అటవీచట్టంలోని సెక్షన్‍–4 ప్రకారం రాష్ట్రానికి రిజర్వ్ ఫారెస్ట్​లను ప్రకటించే అధికారం ఉంది. ఈ నెపంతో తెలంగాణలోని 7 లక్షల ఎకరాలను లాక్కునేందుకు టీఆర్​ఎస్​ సర్కారు గిరిజనులకు నోటీసులు అందజేసింది. 1967 చట్టం ప్రకారం పోడు సాగు చట్టవిరుద్ధమంటూ వారి సాగుభూముల్లోంచి బలవంతంగా తరలిస్తోంది. గత ప్రభుత్వాలు ఇచ్చిన అటవీహక్కు పత్రాలు చూపినప్పటికీ ఖాతరు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదే కాదు, 2006 అటవీహక్కుల చట్టం ప్రకారం ఆదివాసులు అటవీ ఉత్పత్తులు సేకరిం చి,  అమ్ముకునే వీలుండేది. కానీ తాజాగా కేంద్రప్రభుత్వం 1927నాటి అటవీ హక్కుల చట్టానికి సవరణ చేసే పనిలో పడింది.

కొత్త చట్టంపై అనుమానాలు

కొత్త చట్టంలో అటవీ ఉత్పత్తుల సేకరణ, రవాణా నేరంగా పరిగణిస్తారనే వార్తలు అడవిబిడ్డలను కలవరపరుస్తున్నయి. కానీ నేటికీ అనేక మంది గిరిజనులకు అటవీ ఉత్పత్తుల బతుకుబండి నడిపిస్తోంది. ఇప్పపువ్వు, తునికాకు, జిగురు, తేనె, వనమూలికలు, వెదురు సేకరించి, అమ్మడం  ద్వారా వచ్చే కొద్దో, గొప్పో ఆదాయమే అనేక కుటుంబాలకు కొండంత ఆధారంగా ఉన్నది.  కానీ కొత్త చట్టం అమల్లోకి వస్తే ఆ అతి చిన్న సంపాదన కూడా ఆదివాసుల నుంచి దూరం కానుంది. ఇప్పటికే అభయారణ్యాల పేరిట అడవుల్లో ఆదివాసుల సంచారాన్ని అటవీ అధికారులు అడ్డుకుంటున్నరు. పోడు వ్యవసాయాన్ని అడ్డుకునే పేరిట చట్టాలను కఠినతరం చేస్తున్నరు.నిజానికి  అడవులతో ఆదివాసులకు విడదీయరాని అనుబంధం ఉన్నది. వాటితోనే వారి జీవితం ముడిపడి ఉంటుంది. అడవుల్లో ఉన్నంతకాలమే తమదైన భాష, కల్చర్ ను  కాపాడుకునే వీలు కలుగుతుంది. కానీ అభివృద్ధి పేరిట ఆదివాసులను అడవుల నుంచి తరిమే ప్రయత్నాలు కరెక్టేనా ?

Latest Updates