మరికొద్ది నిమిషాల్లో పెళ్లి… పెళ్ళికొడుకు అరెస్ట్

పెళ్లి పీటలెక్కబోతున్న పెళ్లి కొడుకును అరెస్ట్  చేశారు కర్నూలు జిల్లా నంధ్యాల వన్ టౌన్ పోలీసులు. మరి కాసేపట్లో వధువు మెడలో తాళి కడతాడు అనుకుంటుండగా..  సీన్ లోకి ఎంటరైన పోలీసులు జరగబోయే తతంగాన్ని ఆపేశారు. అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు. అచ్చం సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన నంధ్యాలలోని ఓ పెళ్లి మండపంలో జరిగింది.

తిరుపతి SBI బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న మోహన కృష్ణ  అనే వ్యక్తి గతంలోనే  ఓ అమ్మాయి తో నిశ్చితార్ధం జరిగింది. నిశ్చితార్థం తర్వాత కట్నకానుకలుగా 12 లక్షల నగదు,6 తులాల బంగారం తీసుకున్నట్టు సమాచారం. తర్వాత ఏమైందో తెలియదు గానీ.. ఆ సంబంధం వద్దనుకొని మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడు మోహన కృష్ణ. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఆదివారం మధ్యాహ్నం నంధ్యాలలో పెళ్లి ముహుర్తం కూడా సెట్ చేశాడు.  పెళ్లి పీటలు ఎక్కి మరికాసేపట్లో వధువు మెడలో తాళి కట్టడమే తరువాయి. అంతలోనే..  ఇంతకు ముందు అతనితో నిశ్చితార్థం జరుపుకున్న యువతి ఫిర్యాదు మేరకు  పోలీసులు రంగప్రవేశం చేశారు. బంధువులు అందరూ చూస్తుండగానే.. పెళ్లి తంతుని ఆపేసి .. పీటల మీద ఉన్న పెళ్ళికొడుకును అరెస్ట్ చేశారు. దీంతో పీటల మీదే పెళ్లి ఆగిపోయింది.

Latest Updates