నలుగురు హీరోల్లో కార్తికేయను ఓకే చేశాం : నాని

‘నటుడిగా పరిచయమై పదకొండేళ్లు అయినా ఇంకా ఓ సాధారణ ప్రేక్షకుడిగానే సినిమా చూస్తున్నాను. ఎందుకంటే నాలోని ప్రేక్షకుడింకా అలాగే ఉన్నాడు. మారుతున్న ప్రేక్షకులందరితో పాటు ఆ ప్రేక్షకుడూ మారుతున్నాడు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలను ఎంచుకుంటున్నాను’ అని అంటున్నాడు నాని. విక్రమ్‌‌ కె.కుమార్‌‌ దర్శకత్వంలో తాను నటించిన ‘గ్యాంగ్ లీడర్’ ఈనెల 13న విడుదల కానున్న సందర్భంగా నాని చెప్పిన విశేషాలు..

సక్సెస్ రేట్ అనే కాన్సెప్టే పట్టించుకోను. పది సినిమాల తర్వాత ఒక్క సినిమా ఆడకున్నా నాని కష్టాల్లో ఉన్నాడంటారు. పైగా వర్కవుట్ అవుతుందా లేదా? అని ఎక్కువగా ఆలోచించడం వల్ల వర్క్ చేయలేం. అందుకే అవేవి ఆలోచించకుండా నన్ను ఎగ్జయిట్ చేసిన వాటికే ప్రయారిటీ ఇస్తున్నాను.

 •                 ‘జెర్సీ’ షూటింగ్ ప్రారంభంలో విక్రమ్ ఈ స్టోరీ లైన్ చెప్పారు. బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను. ‘వి’ కూడా అప్పటికే ప్లానింగ్​లో ఉండడంతో జెర్సీ పూర్తయ్యేలోపు ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసేశాడు విక్రమ్. దాంతో ‘గ్యాంగ్ లీడర్’ వెంటనే మొదలైంది.
 •                 ‘జెర్సీ’ కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుండగా ఓ రోజు వచ్చి ఈ టైటిల్ చెప్పాడు విక్రమ్. చాలా ఎగ్జైటింగ్​గా అనిపించి ఓకే అన్నాను. విక్రమ్‌‌ గత సినిమాలన్నింటిలో లెస్‌‌ కాంప్లికేటెడ్‌‌ సినిమా ఇదే. ట్విస్ట్​లు, టర్న్​లు ఉంటాయి కానీ కాంప్లికేటెడ్‌‌ అంశాలుండవు. అతని సినిమాలన్నింటిలో మోస్ట్ ఎంటర్​టైనింగ్ సినిమా కూడా ఇదే.
 •                 పెన్సిల్‌‌ పార్థసారథి అనే పాత్ర నాది. పెన్సిల్‌‌ అనేది పెన్‌‌ నేమ్‌‌. పాపులర్ సినిమాల్ని కాపీ కొట్టి ఇరవై ఎనిమిది పుస్తకాలు రాస్తాడు. అవి అమ్ముడవ్వవు. కానీ తానో పెద్ద రైటర్ అని ఫీలింగ్. ఇరవై తొమ్మిదో రచనని ఒరిజినల్ గా ప్రయత్నిస్తాడు. అదే సినిమా కథ.
 •                 రివెంజ్ డ్రామా అనగానే పంచ్ డైలాగ్స్, భారీ ఫైట్స్ ఊహిస్తాం. కానీ రివెంజ్ అనే కాన్సెప్ట్ నే వినోదాత్మకంగా చూపిస్తే ఎలా ఉంటుందనేది నన్ను ఎగ్జయిట్ చేసింది. పైగా ఐదుగురు ఆడవాళ్లు, రివెంజ్ స్టోరీ రైటర్ లాంటివి ఇంకా ఆసక్తి రేపాయి. ట్రైలర్​లో చూపించిన దానికి మించిన వినోదం సినిమాలో ఉంటుంది.
 •                 విక్రమ్  టెక్నికల్​గా సౌండ్ కాదు. అతని బలం వినూత్నమైన ఆలోచనలు. తను సీన్స్​ నేరేట్​ చేసే విధానం కామెడీగా ఉంటుంది. నేను నవ్వాపుకోలేకపోయేవాడిని.  అతనిలోని కామెడీని ట్యాప్ చేసిన సినిమా ఇంతవరకూ లేదు. పైగా అంతా సిట్యువేషనల్ కామెడీ. అందరూ అనుకుంటున్నట్టు బన్నీతో విక్రమ్ చేయాలనుకున్న కథ ఇది కాదు.
 •                 లక్ష్మి గారిని కృష్ణవంశీ తప్ప ఎవరూ గొప్పగా చూపించలేరు అనుకునేవాణ్ణి. కానీ ఈ సినిమా సమయంలో అది కృష్ణవంశీ గొప్పతనం కాదు లక్ష్మి గారిదే అని అర్థమైంది. లక్ష్మీగారు, శరణ్యగారు అదిరిపోయే కామెడీ టైమింగ్‌‌తో ఎంటర్టైన్‌‌ చేస్తారు. ఈ సినిమాలో వాళ్లే నా బలం. ఆ సీన్స్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.
 •                 కార్తికేయది ఆసక్తికరమైన పాత్ర. ఆ పాత్ర ఎవరైనా హీరో చేస్తేనే బాగుంటుందనిపించింది. అందుకే నలుగురు హీరోల్ని అనుకున్నాం. అందులో మొదటివాడైన కార్తికేయ స్క్రిప్ట్ వినగానే ఓకే చెప్పాడు. రిలీజ్‌‌ తరువాత కచ్చితంగా ఆ క్యారెక్టర్‌‌ గురించి మాట్లాడతారు.
 •                 అనిరుధ్ మ్యూజిక్​లో ఒక ఎనర్జీ ఉంటుంది. ‘జెర్సీ’కి తను కరక్టేనా అని కొంత ఆలోచించాం కానీ ఈ సినిమాకి డిస్కస్‌‌ చేయకుండానే ఫైనల్ చేశాం.
 • ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ వల్ల కంపేర్ చేస్తారని తెలుసు. కానీ ఇది వేరే జానర్ కనుక ఆ ఇబ్బంది లేదు. గ్యాంగ్ లీడర్ టైటిల్​కి ట్రిబ్యూట్​గా ఒక షాట్ ఉంటుందంతే. ఫన్, ఎమోషన్ ఎక్కువ, రొమాన్స్ చాలా తక్కువ. ఉన్న కొద్ది సీన్స్ క్యూట్​గా ఉంటాయి.
 •                 ‘ఎంసిఏ’ సమయంలో కమర్షియల్​గా హిట్. కానీ, ‘నాని మంచి సినిమాలు చేయడా ’ అన్నారు. ‘జెర్సీ’ చేస్తే మంచి సినిమా కానీ కమర్షియల్​గా ప్రాఫిట్ కాదన్నారు. తెలుగు సినిమా పరిధులు దాటి ’జెర్సీ’ చేశాం. థియేట్రికల్​గా ముప్పై కోట్లు వచ్చాయి. రీమేక్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఇప్పుడు చైనా రిలీజ్ లాంటివి కలుపుకుని నిర్మాతలకు చక్కని ప్రాఫిట్ వచ్చింది. అందుకే ‘జెర్సీ’ విషయంలో నేను ఫుల్ హ్యాపీ.
 •                 గతంలో బైలింగ్వల్ చేసినప్పుడు సమయం చాలా వృథా అయింది. అందుకే కేవలం కలెక్షన్స్ కోసం బైలింగ్వల్​ చేయడం కరెక్ట్‌‌ కాదని నా ఫీలింగ్‌‌. మంచి స్క్రిప్ట్ తో రెండు భాషలకు కుదిరే సబ్జెక్ట్ అయితే తప్పకుండా చేస్తాను.
 •                 బ్రేక్ తీసుకోవడం టార్చర్. షూటింగ్ సమయంలో రోజులు ఎలా గడిచిపోతాయో తెలీదు. కానీ రిలీజ్​కి ముందు ప్రచారం కోసం తీసుకునే పదిహేను రోజుల బ్రేక్ నాకు నరకంలా ఉంటుంది. ‘వి’ సినిమా రెండో షెడ్యుల్‌‌ ఈ నెల 15 నుండి థాయిలాండ్‌‌లో మొదలవుతుంది. నెక్స్ట్‌‌ మూడు సినిమాలు పైప్‌‌లైన్‌‌లో ఉన్నాయి.

Latest Updates