2014 ఎన్నికల్లో టీడీపీ వల్లే మోడీ గెలిచారు : లోకేశ్

 తిరుపతి : ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన విమర్శలను తిప్పికొట్టారు ఏపీ మంత్రి లోకేశ్. ఏపీలో ఉనికి కోల్పోయిన బీజేపీ…. టీడీపీ సహాయంతోనే తన బలం పెంచుకుందని చెప్పారు. 2014 ఎన్నికల్లో టీడీపీ బలంతోనే మోడీ గెలిచారని లోకేశ్ చెప్పారు. నరేంద్ర మోడీ శ్రీవారి పాదాల చెంత అనేక హామీలు ఇచ్చారనీ.. వాటిని నెరవేర్చకుండా ఏపీ ముఖం ఎలా చూస్తారని అన్నారు లోకేష్. ఏపీకి ప్రత్యేక హోదా,  18 అంశాలను నెరవేరుస్తామని ప్రగల్భాలు పలికారనీ.. వెనుకబడిన మండలాలకు రూ.350 కోట్లు ఇచ్చి, వెనక్కి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు నారా లోకేష్.

ఏపీలో ప్రధాని పర్యటనకు ముందురోజు.. నామమాత్రపు పిలుపులు పిలిచారని లోకేష్ అన్నారు. “ప్రధానమంత్రి పై మాకు గౌరవం ఉంది, కానీ ఏపీకి అన్యాయం చేసిన కారణంగా ఇవాళ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. ప్రధాని చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే, ఆ పార్టీలపై అసత్య ఆరోపణలు, అక్రమ కేసులు పెడుతున్నారు. వైసీపీ మోడీకి అనుకూలంగా పనిచేస్తోంది. జగన్ మోహన్ రెడ్డి తన పేరును.. జగన్ మోడీ రెడ్డిగా మార్చుకున్నారు” అని లోకేష్ తిరుపతిలో అన్నారు.

ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందనీ.. ఏపీ బీజేపీ నాయకులకు విశ్వాసం లేదని అన్నారు మంత్రి లోకేష్.

Latest Updates