మండుటెండలో పనిచేసినా రూ.50 కూడా వస్తలేవు

సిద్దిపేట/కొండపాక, వెలుగు: ఉపాధి హామీ డబ్బుల చెల్లింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయని, దీనికి గ్రామ కార్యదర్శి కారణమని ఆరోపిస్తూ  కూలీలు ఆందోళనకు దిగి అధికారులను నిర్బంధించారు. ఈ ఘటన శనివారం కొండపాక మండలం బందారం గ్రామంలో జరిగింది.  మండుటెండల్లో పనులు చేస్తున్నా తమకు సరైన కూలి లభించడం లేదని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కూలీలు ఉదయం ఏడు గంటలకు ఆందోళనకు దిగారు. బందారం గ్రామపంచాయతీకి చేరుకుని ధర్నాకు దిగారు. 9 గంటల సమయంలో ఎంపీడీవో రాంరెడ్డి, ఎంపీవో నరసింహారావు, ఏపీవో శ్యాంసుందర్​రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రజనీకర్​రెడ్డి కూలీలకు సర్దిచెప్పేందుకు అక్కడకు వచ్చారు. వారందరినీ ఉపాధి కూలీలు పంచాయతీ ఆఫీస్​లో నిర్బంధించారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ మండుటెండలో  కష్టపడి పని చేస్తే కనీసం 50 రూపాయలు కూడా తమ అకౌంట్లో జమ కావడం లేదని అన్నారు. స్థానికేతరుల అకౌంట్లలో వేలాది రూపాయలు జమ చేస్తూ గ్రామ కార్యదర్శి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి రజనీకర్ రెడ్డి ఇష్టానుసారంగా ఉపాధి హామీ చెల్లింపులు చేస్తూ పనిచేస్తున్నవారి పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్  జోక్యం చేసుకుని తమకు  న్యాయం చేయాలని డిమాండ్  చేశారు. విషయం తెలుసుకున్న  కుకునూరుపల్లి ఎస్సై పరమేశ్వర్ గ్రామానికి చేరుకుని కూలీలతో మాట్లాడారు. ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తానని, వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కూలీలు ఆందోళన విరమించారు. అధికారులను వదిలేశారు.

 

కూతురి పెండ్లి సంబంధాలు చెడగొడుతున్నడని చంపేసిండు

Latest Updates