చంద్రబాబు భల్లాలదేవలా మారిపోయారు: మోడీ

రాజమహేంద్రవరం : చంద్రబాబు బాహుబలిలో భల్లాలదేవలాగా మారిపోయారన్నారు ప్రధాని మోడీ. సోమవారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడారు. ఏం చేసైనా సరే.. అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ట్రై చేస్తున్నారన్నారు. పోలవరం పూర్తి చేసే చిత్తశుద్ధి టీడీపీ సర్కార్ కు లేదన్న మోడీ.. ప్రాజెక్ట్ చంద్రబాబుకు ఏటీఎం లాంటిదని ఆరోపించారు. బీజేపీ ఏపీ హెరిటేజ్ ను కాపాడాలనుకుంటుంటే.. బాబు మాత్రం ఆయన హెరిటేజ్ ను కాపాడుకునే పనిలో ఉన్నారని విమర్శించారు. సేవామిత్ర పేరుతో.. ఏపీ ప్రజల డేటా చోరీ చేస్తున్నారని మోడీ అన్నారు.

బాబు పాలన అధర్మంగా, అన్యాయంగా ఉందన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారన్న మోడీ.. బాబు మాటలను ఆంధ్రా ప్రజలు ఎప్పటికీ నమ్మరన్నారు. ఇక్కడి ప్రజలు నీతిగా జీవిస్తారని.. చంద్రబాబు మాత్రం వారిని మోసం చేస్తుంటారన్నారు. సేవా మిత్ర యాప్‌ ద్వారా ప్రజలకు టీడీపీ సేవ చేయడం లేదని.. ‘సేవ లేదు.. మిత్రులు కాదు.. ప్రజల వివరాలు దొంగిలించారు’ అన్నారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ లకు ప్రజల సంక్షేమం పట్టదన్నారు. వాళ్ల కుటుంబాల వికాసం కోసమే ఆ పార్టీలు పనిచేస్తుంటాయన్నారు. ఉగ్రవాదులను వాళ్ల గడ్డపైకి వెళ్లి మరీ దాడి చేశామని.. కొందరు నేతలు మాత్రం పొరుగు దేశానికి మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు ప్రధాని మోడీ.

Latest Updates