అనగనగా ఒక చక్రవర్తి

Naruhito: Japan's new emperor pledges to be symbol of unity

జపాన్ కు 59 ఏళ్ల నరుహితో కొత్త చక్రవర్తి అయ్యారు. చక్రవర్తి అకిహితో కొడుకైన నరుహితో వంశపారంపర్యంగా జపాన్ కు చక్రవర్తి అయ్యారు. సంప్రదనరుహితో  పట్టాభిషేకంతో  జపాన్ లో కొత్త శకం మొదలైంది. జపాన్ లో కొత్త చక్రవర్తి పాలనను ‘రీవా శకం’ అంటారు.  నరుహితో అంగరంగ వైభవంగా  కొత్త చక్రవర్తిగా  సింహాసనాన్ని అధిష్టించారు. మన టైం ప్రకారం బుధవారం ఉదయం 6.45కు  ఎంపరర్ ప్యాలెస్ లో ఈ వేడుక జరిగింది.

జపాన్ లో ఇప్పటికీ  రాజరిక వ్యవస్థ

జపాన్ ప్రపంచంలోని  అనేక దేశాలతో పోలిస్తే చాలా ఆధునికమైనది. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా జపాన్ బోలెడంత అభివృద్ది  సాధించింది. అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ ఉంటుంది. అంత ఆధునిక పోకడలున్న జపాన్ లో ఇప్పటికీ రాజవంశాలు కొనసాగడం, చక్రవర్తులు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ప్రపంచంలోనే  వంశపారంపర్యంగా కొనసాగుతున్న అత్యంత ప్రాచీన రాచరిక వ్యవస్థ జపాన్ లోనే ఉంది. నరుహితో పూర్వీకులు క్రీస్తు పూర్వం 600 నుంచి చక్రవర్తులుగా ఉన్నారు. సహజంగా రాజులు, చక్రవర్తులంటే ప్రజాస్వామ్యదేశాల్లో  చాలా ఏవగింపు ఉంటుంది. మెజారిటీ రాజులు విలాసాల్లో మునిగి తేలి సామాన్య ప్రజలను, వారి బాగోగులను పట్టించుకోని కథలే అందరం ఎక్కువగా విన్నాం. అయితే జపాన్ చక్రవర్తులు దీనికి పూర్తి విరుద్ధం. జపాన్ చక్రవర్తులను అక్కడి ప్రజలు దేవుళ్లుగా  చూస్తారు. చక్రవర్తులకు కొన్ని శక్తులు ఉన్నాయని ప్రజలు నమ్ముతారు.

చక్రవర్తి అధికారాలు నామమాత్రమే

జపాన్ రాజ్యాంగం ప్రకారం అక్కడి చక్రవర్తి ‘ రాజ్యాధినేత’. జపాన్ రాజ్యానికి చక్రవర్తిని ఒక ప్రతీక గా భావిస్తారు. రాజ్యాధినేత పేరుకు ముందు గౌరవంగా ‘ఎంపరర్ ’ అనే  పదాన్ని ఉపయోగిస్తారు. అయితే జపాన్ చక్రవర్తుల అధికారాలు నామమాత్రమే. విదేశాల నుంచి ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు వస్తే మర్యాదపూర్వకంగా కలుసుకుంటుంటారు. ప్రజలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతుంటారు. మత పరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం చక్రవర్తి బాధ్యతల్లో ఒకటి.
రాజ్యాధినేత హోదాలో  పార్లమెంటు సమావేశాలను ప్రారంభిస్తారు.పేరుకు చక్రవర్తి అయినా విశేషాధికారాలను వినియోగించుకున్న సందర్భాలు చాలా అరుదు. 1947లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత చక్రవర్తి పదవి మరీ అలంకారంగానే మిగిలింది.దేశంలోని రాజకీయ పార్టీలే అసలైన అధికారాన్ని చెలాయిస్తున్నాయి.

సింహాసనాన్ని పరిత్యజించిన అకిహితో

నిన్నటి దాకా చక్రవర్తిగా కొనసాగిన 85 ఏళ్ల అకిహితో సింహాసనాన్ని పరిత్యజించారు. రాజరిక వ్యవస్థ ప్రకారం కొన్ని సంప్రదాయలు, పద్దతులు పాటించిన తర్వాత ఆయన సింహాసనాన్ని పరిత్య జించారు. రెండు వందల ఏళ్ల జపాన్ చరిత్రలో సింహాసనాన్ని పరిత్యజించిన తొలి చక్రవర్తిగా అకిహితో చరిత్రలో పేరు నమోదు చేసుకున్నాడు. చక్రవర్తి హోదాలో ఉన్నా  సింహాసనాన్ని పరిత్యజించడానికి అవసరమైన న్యాయపరమైన అనుమతి తీసుకున్నారు. వయసు మీద పడటం అలాగే ఆరోగ్యం సహకరించకపోవడంతో చక్రవర్తి సింహాసనం నుంచి అకిహితో తనంతట తాను దిగిపోయారు.

మంచి చక్రవర్తి

పాత చక్రవర్తి అకిహితో కి సామాన్య ప్రజల్లో  గుడ్ విల్ ఉంది. మంచి మనిషిగా జనంలో పేరుంది. చక్రవర్తిగా ఉన్నా అకిహితో ఏనాడూ  ఆడంబరాలకు పోలేదంటారు అక్కడి ప్రజలు. సామాన్యుల్లో కలిసి పోయే వ్యక్తిగా ఆయనను అందరూ గుర్తు చేసుకుంటారు. జపాన్ లో తుపానులు వచ్చి ప్రజల జీవితాలు అల్లకల్లోలం అయినప్పుడు అకిహితో ఇంపీరియల్ ప్యాలెస్ దాటి నగరంలోకి వచ్చేవారు. జనంతో కలిసిపోయేవారు. వారి కష్టసుఖాలు వినేవారు. సర్కార్ నుంచి అందుతున్న సాయం గురించి అడిగి తెలుసుకునేవారు. ఇదొక్కటే కాదు మొండి రోగాలతో బాధపడేవారి పట్ల కూడా అకిహితో చాలా దయార్ద్ర  హృదయంతో ఉండేవారని పెద్దవారు చెబుతుంటారు. అవసరమైతే ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారిని కలిసేవారట. వైద్య సదుపాయాల గురించి ఆరా తీసేవారట. అందుకే జపాన్ ప్రజలకు అకిహితో  ప్రియతమ చక్రవర్తి అయ్యారు. అకిహితోను ఇప్పుడు ‘జోకో ’ అని పిలుస్తారు. ‘ జోకో ’ అంటే పెద్ద చక్రవర్తి అని అర్థం. దీనినే ఎంపరర్ ఎమెరిటస్ అంటారు. ఆయన భార్య మిచికోను ‘ ఎంప్రెస్ ఎమెరిటా ’ అని పిలుస్తారు.

నరుహితో చాలా మోడర్న్

​నరుహితో, జపాన్ కు 126వ చక్రవర్తి. ప్రతిష్టాత్మకమైన ఆక్స్ ఫర్ట్ లో ఉన్నత విద్యచదువుకున్నారు. ఆధునిక పోకడలు ఉన్నవ్యక్తిగా ఆయన గురించి తెలిసిన వారు చెబుతారు. సింహాసనం ఎక్కిన తర్వాత తొలిసారి చేసిన ప్రసంగంలో ఆయన ఆలోచనా విధానం వెల్లడైంది. చాదస్తానికి,కాలం చెల్లిన పద్ధతులకు ఆయన వ్యతిరేకి. ప్రతీదీ కొత్తగా ఆలోచిస్తారు. మాటల్లో ,చేతల్లో కొత్తదనానికే ప్రాధాన్యం ఇస్తారు. నరుహితో భార్య పేరు మనకో ఒవాడా. ఆక్స్ ఫర్డ్ లో హయ్యర్ స్టడీస్ చేశారు. అక్కడ చదువుకుం టున్నప్పుడే ఓ టీ పార్టీలోవారిద్దరూ కలుసుకున్నారు. ఏడేళ్ల తర్వాత1993 లో పెళ్లి చేసుకున్నారు. మొదట్లో రాజవంశానికి కోడలుగా వెళ్లడానికి ఒవాడా భయపడ్డారట. అయితే “నీకు జపాన్ రాజవంశంలో అడుగుపెట్టడం పై భయాలు ఉండొచ్చు. కానీ నిన్ను జీవితాంతం నేను ప్రాణంగా చూసుకుంటా ”అంటూ ధైర్యం చెప్పి ఆమెను నరుహితో పెళ్లికి ఒప్పిం చారట. ఈ దంపతులకు ఏకైక సంతానం.. యువరాణి ఐకో.

సామాన్యుడిని పెళ్లాడిన రాకుమారి

సయాకో.. పాత చక్రవర్తి అకిహితో, మహారాణి మిచికో దంపతుల ఒకే ఒక్క కూతురు . ప్రస్తుత,కొత్త చక్రవర్తి నరుహితో ముద్దుల చెల్లెలు.మహాసామ్రాజ్యాధినేత కుమార్తె అంటే ఆ దర్పం,ఆ గౌరవమే వేరు. 35వ ఏట వరకు ‘రాకుమార్తె నోరి’గా రాచరికపు హోదాను అనుభవించిన ఆమె 2005 నవంబర్ 15న యోషికి కురొడా అనే సామాన్యుణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.దీంతో చట్టం ప్రకారం తన రాజకుమారిహోదాను, రాజ కుటుం బాన్ని వీడాల్సి వచ్చింది.టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్ లో యోషికి కురొడా అర్బన్ డిజైనర్ .

రాజరికపు చిహ్నాలు

సిం హాసనం అధిష్టించినందుకు గుర్తుగా కొత్త చక్రవర్తి నరుహితో జపాన్ రాజరికపు చిహ్నాలైన ఖడ్గం , రత్నం , అద్దం అందుకున్నారు. వీటిలో ఖడ్గాన్ని పరాక్రమానికి, రత్నాన్ని ధర్మ గుణానికి, అద్దాన్ని తెలివితేటలకు  ప్రతీకగా భావిస్తారు. జపాన్ లో ఈ మూడు వస్తువులను రాజవంశం వారసత్వ సంపదగా, రాజచిహ్నాలుగా భావిస్తారు.ఎన్నో తరాలుగా ఈ రాజచిహ్నాలు వారసత్వం గా చక్రవర్తులకు అందుతున్నాయి. రాజచిహ్నాలను చాలా పవిత్రంగా భావిస్తారు చక్రవర్తులు. ‘ఇసే  గ్రాండ్ ’ అనే పవిత్ర ప్రదేశంలో వీటిని భద్రపరుస్తారు.

 

Latest Updates