మార్స్​కు పోదాం చలోచలో..

   ఇండియన్​ సహా 11 మంది ఆస్ట్రోనాట్లను ఎంపిక చేసిన నాసా

    ఐఎస్​ఎస్​, ఆర్టిమిస్​, మార్స్​ మిషన్ల కోసం రెండేళ్ల ట్రైనింగ్​

    కెనడా స్పేస్​ ఏజెన్సీ కోసం

    మరో ఇద్దరికీ శిక్షణ

    తొలిసారి గ్రాడ్యుయేషన్​ సెర్మనీ.. 11 మందికి సిల్వర్​ పిన్​లు

నాసా.. ఆకాశంలో ఆస్ట్రోనాట్ల కోసం ఐఎస్​ఎస్ అనే ఇంటిని కట్టింది. చందమామపై అడుగు పెట్టించింది. అక్కడితోనే అయిపోయిందా..? లేదు.. ఇంకా మిగిలే ఉంది! భూమికి అల్లంత దూరాన ఉన్న మార్స్​ను అందుకోవాలనుకుంటోంది. దాని మీదా కాలుపెట్టాలని తహతహలాడుతోంది. తెలియని ఎన్నెన్నో వింతలు, విషయాలను ప్రపంచానికి తెలియజెప్పాలని ప్రయత్నిస్తోంది. అదొక్కటే కాదు, ఎన్నెన్నిసార్లు అందుకున్నా, ఇంకా ఇంకా చందమామ దగ్గరకు పోవాలి.. తన కడుపులోని  మరిన్ని రహస్యాలను ఛేదించాలి.. అందుకే 2024లో ఆర్టిమిస్​ అనే మరో కార్యాన్నీ భుజంపై వేసుకుంది. తొలిసారి మహిళను పంపించబోతోంది. మరి, ఆ ప్రయోగాలకు ఆస్ట్రోనాట్లు కావాలి కదా. అందుకే జల్లెడ పట్టి మరీ 13 మంది ఆస్ట్రోనాట్లను ఎంపిక చేసింది. రెండేళ్ల పాటు వారికి ట్రైనింగ్​ ఇచ్చి ‘గ్రాడ్యుయేట్​’ పట్టాలు ఇచ్చింది. వచ్చిన 18 వేల దరఖాస్తులను వడబోసి 13 మందిని ఎంపిక చేసింది. 2017లో మొదలైన ఆ ట్రైనింగ్​ శుక్రవారంతో పూర్తయింది. ఎంపికైన ఆ ఆస్ట్రోనాట్లలో ఓ ఇండియన్​ ఉన్నారు. ఆయన పేరు రాజా జాన్​ వూర్పుతూర్​  చారి (రాజా చారి).

మొదటిసారి గ్రాడ్యుయేషన్​ సెర్మనీ

ఎంతో మంది ఆస్ట్రోనాట్లకు నాసా ట్రైనింగ్​ ఇచ్చినా ఇప్పటిదాకా ఎప్పుడూ గ్రాడ్యుయేషన్​ సెర్మనీని చేయలేదు. కానీ, మొదటిసారి శుక్రవారం గ్రాడ్యుయేషన్​ సెర్మనీ చేసింది. అమెరికాలోని హ్యూస్టన్​లో ఉన్న జాన్సన్​ స్పేస్​ సెంటర్​లో ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. నిజానికి 13 మంది ఆస్ట్రోనాట్లకు గ్రాడ్యుయేట్​ పట్టాలు ఇచ్చినా, అందులో నాసా కోసం పనిచేసేది మాత్రం 11 మందే. మిగతా ఇద్దరు కెనడియన్​ స్పేస్​ ఏజెన్సీ ఆస్ట్రోనాట్లుగా పనిచేస్తారు. కొత్తగా వచ్చిన ఆస్ట్రోనాట్లతో నాసాలోని మొత్తం యాక్టివ్​ ఆస్ట్రోనాట్ల సంఖ్య 48కి చేరింది. ఆర్టిమిస్​ ప్రోగ్రామ్​ను ప్రకటించినప్పటి నుంచి వాళ్లకు ఇలా గ్రాడ్యుయేషన్​ ట్రైనింగ్​ ఇవ్వడమూ ఇదే మొదటి సారి. ఎంపికైన వాళ్ల సేవలను వివిధ ప్రయోగాల కోసం వాడుకుంటారు. ఇంటర్నేషనల్​ స్పేస్​ స్టేషన్​ (ఐఎస్​ఎస్​), ఆర్టిమిస్​, 2030లో చేపట్టనున్న మార్స్​ మిషన్​లలో భాగంగా వాళ్లను అంతరిక్షంలోకి పంపిస్తారు.

సిల్వర్​ పిన్​.. స్పేస్​లోకి పోతే గోల్డ్​పిన్​

11 మంది ఆస్ట్రోనాట్లకు సిల్వర్​ పిన్​లను నాసా అందించింది. ఇలా సిల్వర్​ పిన్​లను ఇచ్చే సంప్రదాయం నాసాలో ఎప్పటి నుంచో ఉంది. 1959లో తొలిసారిగా మెర్క్యురీ 7 ప్రయోగంలో భాగస్వాములైన ఆస్ట్రోనాట్లకు సిల్వర్​ పిన్​లను అందించింది. ఇప్పుడు ఎంపికైన ఆస్ట్రోనాట్లు మొదటి స్పేస్​ ఫ్లైట్​ను పూర్తి చేస్తే ‘గోల్డ్​ పిన్​’ ఇస్తారు. ఇప్పటిదాకా స్పేస్​లోకి వెళ్లిన 500 మంది జాబితాలో ఈ 13 మందీ చేరే గౌరవం దక్కించుకున్నారు.

ఇదీ ట్రైనింగ్​

రెండేళ్ల ట్రైనింగ్​లో ఆస్ట్రోనాట్లకు స్పేస్​వాక్​లో ఇన్​స్ట్రక్షన్​, ప్రాక్టీస్​, టెస్టింగ్​పై క్లాసులు చెప్పారు. వాటితో పాటు రోబోటిక్స్​, ఐఎస్​ఎస్​లోని సిస్టమ్స్​, టీ38 జెట్​ప్రొఫిషియెన్సీ క్లాసులు నిర్వహించారు. అంతేగాకుండా రష్యా ఆస్ట్రోనాట్లు, రష్యా స్పేస్​ ప్రయోగాల గురించి తెలుసుకునేలా రష్యన్​ లాంగ్వేజ్​ను ట్రైనింగ్​లో భాగం చేశారు. అంతేగాకుండా స్పేస్​క్రాఫ్ట్​ తయారీలోనూ వారికి ట్రైనింగ్​ ఇచ్చారు. ఇక, స్ప్రింగ్​ (వసంత కాలం) సీజన్​లో మరో బ్యాచ్​ ఆస్ట్రోనాట్లకు ట్రైనింగ్​ ఇచ్చేందుకు నాసా కసరత్తులు చేస్తోంది.

వీళ్లే ఆ 13 మంది

రాజా చారి, కైలా బారన్​, జీనా కార్డ్​మన్​, మాథ్యూ డొమినిక్​, బాబ్​ హైన్స్​, వారెన్​ హోబర్గ్​, డాక్టర్​ జానీ కిమ్​, జాస్మిన్​ మోఘ్​బెలి, లోరల్​ ఒహారా, డాక్టర్​ ఫ్రాన్సిస్కో ఫ్రాంక్​ రూబియో, జెస్సికా వాట్కిన్స్​, జోషువా కుత్రిక్​ (కెనడా స్పేస్​ ఏజెన్సీ), జెన్నిఫర్​ సైడీ గిబ్బన్స్​ (కెనడా స్పేస్​ ఏజెన్సీ). ‘‘అమెరికాలోని ఉత్తమ వ్యక్తుల్లో వీళ్లూ ఉంటారు. నాసా ఆస్ట్రోనాట్​కార్ప్స్​లో చేరడం వాళ్లకు మరువలేని అనుభూతి. అమెరికా గడ్డ మీది నుంచి అమెరికా రాకెట్లలో అమెరికా ఆస్ట్రోనాట్లను పంపించేందుకు 2020 గట్టి పునాది వేస్తుంది. ఆర్టిమిస్​ ప్రోగ్రామ్​, అంతకుమించిన ప్రోగ్రామ్​లకూ ఈ ఏడాది చాలా ముఖ్యమైనది’’ అని నాసా చీఫ్​ జిమ్​ బ్రైడెన్​స్టైన్​ అన్నారు.

చదువు ఓ వరం

చదువు ఓ వరం అని అంటున్నారు రాజా చారి. ‘‘చదువు ఓ వరం అన్న ఆలోచనలతోనే నేను పెరిగాను. అయితే, ఆ చదువును ఇష్టమొచ్చినట్టు వాడుకోకూడదు’’ అని ఆయన అన్నారు. అమెరికాలోని అయోవాలో ఉంటున్న రాజా, యూఎస్​ ఎయిర్​ఫోర్స్​ అకాడమీ నుంచి 1999లో ఆస్ట్రోనాటికల్​ ఇంజనీరింగ్​, ఇంజనీరింగ్​ సైన్సెస్​లో డిగ్రీ పట్టా పొందారు. యూఎస్​ నేవల్​ టెస్ట్​ పైలట్​ స్కూల్​లో గ్రాడ్యుయేషన్​ చేసిన ఆయన, మసాచుసెట్స్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి ఏరోనాటిక్స్​ అండ్​ ఆస్ట్రోనాటిక్స్​లో మాస్టర్స్​ చదివారు. తర్వాత అమెరికా ఎయిర్​ఫోర్స్​లో వివిధ హోదాల్లో పనిచేశారు. 461వ ఫ్లైట్​ టెస్ట్​ స్క్వాడ్రన్​లో కమాండర్​గా విధులు నిర్వర్తించారు. ఎఫ్​35 ఇంటిగ్రేటెడ్​ టెస్ట్​ఫోర్స్​ డైరెక్టర్​గా ఉన్నారు. ఎఫ్​35, ఎఫ్​15, ఎఫ్​16, ఎఫ్​18 వంటి యుద్ధవిమానాలను 2 వేల గంటల పాటు నడిపిన అనుభవం రాజా సొంతం. అంతేగాకుండా ఇరాక్​ ఫ్రీడమ్​లో భాగంగా ఎఫ్​15ఈ కంబాట్​ మిషన్​లోనూ పాల్గొన్నారు.

Latest Updates