నాసా జాబిలి స్టేషన్‌

  • ఫోర్డ్​ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి నాసా, ఈఎస్‌ఏ ప్లాన్
  • ఆస్ట్రో నాట్లు, సరుకుల రవాణా ఈజీ
  • 2024 నాటికి ప్రారంభం

భూమికి పొరుగునే ఉన్న చందమామపై మనిషి కాలు మోపి 50 ఏళ్లు అయిపోయినయి.  ఇప్పటికీ, ల్యాండర్లు, రోవర్లను పంపడమే కష్టంగా ఉంది..  మనుషులను పంపాలంటే మరెన్నో కష్టనష్టాలు తప్పవు. అందుకే.. చంద్రుడిపైకి 1960లలో జరిగిన అపోలో మిషన్ ల తర్వాత.. మళ్లీ మానవ సహిత యాత్రలు చేపట్టేందుకు ఏ దేశమూ సాహసించలేదు. అయితే, భూమికి, చంద్రుడికి మధ్య ఒక గేట్​ వేను నిర్మిస్తే.. ఈ పనులన్నీ ఈజీగా అయిపోతాయని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్​స్పేస్ ​ఏజెన్సీ (ఈఎస్‌ఏ) భావిస్తున్నాయి. చంద్రుడి చుట్టూ తిరిగే ఈ గేట్​వే మన భూమికీ.. అంతరిక్షానికీ మధ్య ఒక బస్​స్టాపు మాదిరిగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఏమిటీ గేట్​వే?

ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతున్న ఇంటర్నేషనల్​ స్పేస్ ​స్టేషన్​ (ఐఎస్‌ఎస్‌) లాగానే చంద్రుడి చుట్టూ కూడా ఒక స్పేస్​స్టేషన్​ నిర్మించాలన్నది ఆలోచన. ఇది చంద్రుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది. ఏడు రోజులకోసారి చంద్రుడిని చుట్టి వస్తుంటుంది. కక్ష్యలో సుమారు 70 వేల కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లే ఈ స్పేస్​ స్టేషన్​ వారం రోజులకు ఒకసారి  చంద్రుడికి 3 వేల కిలోమీటర్ల దగ్గరగా వస్తుంటుంది. సరిగ్గా ఈ సమయంలోనే ఇక్కడి నుంచి  చంద్రుడిపైకి ల్యాండర్లను, వ్యోమగాములను దింపాలని నాసా భావిస్తోంది. అక్కడి నుంచి వ్యోమగాములు తిరిగి రావడం ఈజీ అవుతుందని చెబుతోంది.  చంద్రుడి చుట్టూ గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువ ఉంటుంది. దీనివల్ల ఈ స్పేస్​ స్టేషన్​ అంతరిక్షంలో ఎటు పడితే అటు ఎగిరిపోయే ప్రమాదమూ ఉంది. అందుకే.. చంద్రుడు, భూమికి మధ్య గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉండే లాగ్రేంజియన్ పాయింట్​ ప్రదేశంలో, జాబిల్లి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలోనే తిరిగేలా దీనిని నియంత్రిస్తారు. తరచూ ఇంజన్లను స్టార్ట్​ చేసి, ఇది కక్ష్య నుంచి తప్పిపోకుండా చూస్తుంటారు. ఐఎస్​ఎస్​ మాదిరిగా పరిశోధనలకు మాత్రమే కాకుండా, ఈ స్పేస్​ స్టేషన్​ను చంద్రుడిపై వ్యోమగాములు దిగేందుకు, సరుకులు తరలించేందుకు, అక్కడి నుంచి భూమికి విలువైన లోహాలను తీసుకువచ్చేందుకు కూడా ఉపయోగించనున్నారు. వీటితోపాటు మార్స్ వద్దకు వెళ్లే మార్గంలో ఇది ఒక మజిలీగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. 2024 నాటికి ప్రారంభించేలా ప్లాన్‌ చేస్తున్నారు.  దాంతో పాటే చంద్రుడిపై లక్షల టన్నుల కొద్దీ ఉన్న ప్లాటినం, సిలికాన్, టైటానియం వంటి అత్యంత విలువైన లోహాలను వెలికి తీసేందుకూ ఒక ప్రాజెక్టును చేపట్టాలనీ నాసా శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. ఇందుకోసం 2028 నాటికి చంద్రుడిపై బేస్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.  లూనార్ ​స్పేస్​ స్టేషన్​ ప్రారంభమైతే.. అది కూడా ఈజీ అవుతుందంటున్నారు.

Latest Updates