జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు.. మనోడే.!

మన డైరెక్టర్లు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా తమ సత్తా చాటుతున్నారు. మన వాళ్లు రూపొందిస్తోన్న సినిమాలు బాలీవుడ్ లో కూడా రీమేక్ అవుతుండడం మన వాళ్ల క్రియేటివిటికి నిదర్శనం. రోటీన్ కు భిన్నంగా వినూత్నంగా కొత్త కొత్త ప్రయోగాత్మక చిత్రాలతో  తెలుగులోనే కాకుండా మరో భాషలోనూ ఆకట్టుకున్నారు. అందులో ఒకరు  సుధాకర్ రెడ్డి యక్కంటి. తొలి చిత్రంతోనే జాతీయ అవార్డు గెలుచుకొని మన తెలుగువాళ్ల ప్రతిష్టను పెంచాడు.

ఈ శుక్రవారం ఢిల్లీలో 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. ఇందులో ఉత్తమ నూతన దర్శకుడి అవార్డు కోసం పలు చిత్రాలను పరిశీలించిన జ్యూరీ.. మరాఠీ చిత్రం ‘నాల్’ చిత్రానికి ఆ అవార్డుకు ఎంపిక చేసింది. ఆ సినిమా డైరెక్టర్ మన తెలుగు వాడు సుధాకర్ రెడ్డి యక్కంటి. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరాఠీ చిత్రం ‘సైరాట్’కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సుధాకర్ రెడ్డి.. ఆ అనుభవంతో తల్లీ కొడుకుల మధ్య సంబంధాన్ని చూపేలా ఈ ‘నాల్’ సినిమాను తీశాడు.

బాల్యంతో పెనువేసుకున్న అనుభవాలను, ముఖ్యంగా తల్లితో కొడుకుకు ఉండే అనుబంధాన్ని సుధాకరెడ్డి ఈ చిత్రంలో ఉద్వేగభరితంగా చూపాడు.  ప్రతి మనిషినీ నాల్(బొడ్డుతాడు) తన బాల్యంలోకి, గ్రామంలోకి, తన చేదు, తీపి అనుభూతుల్లోకి వెళ్లే వైనాన్ని దృశ్యకావ్యంగా మలిచాడు. దర్శకుడుకి కెమెరాపై గట్టి పట్టు ఉండడంతో ప్రతి దృశ్యం వెండితెరపై అబ్బురంగా పరచుకుంది. పల్లెపట్టు అందాలు, పిల్లల అల్లరి, సామాన్యుల బతుకు పోరాటాలను కొత్తగా పరిచయం చేశారు.

గుంటూరుకు చెందిన సుధాకర్ రెడ్డి యక్కంటి జేఎన్టీయూలో డిగ్రీ పూర్తి చేశాడు. పుణేలోని ప్రఖ్యాత ఎఫ్టీఐఐలో పీజీ పట్టా పుచ్చుకున్నాడు. ‘మధుమాసం’, ‘పౌరుడు’, ‘దళం’ తదితర టాలీవుడ్ చిత్రాలకు పరిచేశాక ముంబైలో స్థిరపడ్డాడు.  హిందీ, మరాఠీ చిత్రాల్లో బిజీగా ఉంటూనే ‘నాల్’ చిత్రాన్ని తెరకెక్కించాడు.