మన తెలంగాణ నర్సుకి నేషనల్‌‌ ఫ్లోరెన్స్‌‌​ నైటింగేల్ అవార్డ్‌‌

వాళ్ల నాయిన ఫ్రీడం ఫైటర్‌‌‌‌. ఆడపిల్లకు చదువెందుకు? అన్న రోజుల్లోనే శుక్రను బడికి పంపిండు. ఆయనిచ్చిన ధైర్యంతో  మంచిగా చదువుకొని,  నర్సింగ్ కంప్లీట్ చేసింది. ఎంత దూరమైనా సరే.. లెక్క చేయకుండా నడిచిపోయి మారుమూల పల్లెల్లో నర్సుగా సేవలు అందించింది. అడుగడుగునా ఆదర్శంగా నిలిచిన ఈ తెలంగాణ బిడ్డ సేవా ప్రయాణాన్ని గుర్తించిన ప్రభుత్వం… నేషనల్‌‌ ఫ్లోరెన్స్‌‌​ నైటింగేల్ అవార్డ్‌‌కి సెలక్ట్‌‌ చేసింది.

భీమదేవరపల్లి,వెలుగు: వెనకటి కరీంనగర్, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగాంకు చెందిన ఫ్రీడమ్​ ఫైటర్​ మహమ్మద్​ లాల్, కైరున్నీసాల కూతురు శుక్ర. ఆడపిల్ల కూడా చదుకోవాలని అప్పట్లోనే శుక్రను కరీంనగర్‌‌‌‌, బాలసదన్‌‌లోని బడికి పంపాడు. స్కూల్‌‌ చదువు కంప్లీట్ అయ్యాక ఆమెకు  భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన  సెరికల్చర్​ ఆఫీసర్​ ఎండి. రషీద్‌‌తో ​పెళ్లయ్యింది. రషీద్‌‌ ప్రోత్సాహంతో నర్సింగ్​ పూర్తి చేసింది. 1993లో హుస్నాబాద్​లోని రామారం సబ్​సెంటర్​లో ఎఎన్​ఎంగా చేరింది.

నడుచుకుంటూ వెళ్లి..

ఆ రోజుల్లో రామారం పరిధిలోని గిరిజన గ్రామాలకు రోడ్డు, రవాణా సౌకర్యం ఉండేది కాదు. కానీ, అక్కడ ఉన్న మనుషులకు ట్రీట్‌‌మెంట్‌‌ అందించకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి, శుక్ర వాళ్లందరికీ సేవలు అందించాలని నిర్ణయించుకుంది. అంతకముందు ఎవరూ చేయని సాహసం చేసింది. రెగ్యులర్‌‌‌‌గా పది కిలోమీటర్లకు పైగా కాలి నడకనే వెళ్లి.. గిరిజన తండాల్లో సేవలు అందించేది. ఇలా చేయడం ఆమెకు ఎంతో సంతృప్తినిచ్చేదని చెప్తుంది శుక్ర.

వాళ్ల భాష నేర్చుకుని..

మన భాష తెలియనివాళ్లకు దగ్గర కావడం చాలా కష్టం. అందుకే శుక్ర గిరిజనుల, లంబాడీ భాష నేర్చుకుంది. వాళ్ల సంప్రదాయ నృత్యం కూడా నేర్చుకుంది. వాళ్లలో ఒకరిగా ఉంటూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా ఉన్న సంచార జాతులు, లంబాడీలను హెల్త్​ సెంటర్ల వైపు నడిపించింది. రామారం, ధర్మారం, గండిపల్లి, కుందాన్​వాన్​ పల్లి, పోతారం జె… ఊళ్లలో పదహరేండ్లపాటు.. రెండు వందలకు పైగా డెలివరీలు చేసింది. ఆమె సేవలకు గుర్తింపుగా కలెక్టర్‌‌‌‌ ‘డిస్ట్రిక్ట్​ బెస్ట్  ఎఎన్ఎం అవార్డ్’ ఇచ్చారు. 2009లో  భీమదేవరపల్లికి ట్రాన్స్‌‌ఫర్ అయింది. ఇక్కడ  కుటుంబ నియంత్రణ, టీకాల నిర్వహణపై  పాటలతో అవగాహన కలిగించినందుకు..  2011లో  కలెక్టర్​ స్మితా సబర్వాల్​అవార్డ్ అందించారు.  కేరళలోని నేషనల్‌‌ లెవల్ బాబు జగ్జీవన్​రావు సాహిత్య సంస్థ అవార్డ్​, జాతీయ మహిళా దినోత్సవం నాడు ఉత్తమ పురస్కారం కూడా అందుకుంది శుక్ర.

ఇప్పుడు ఫ్లోరెన్స్​ నైటింగేల్​ అవార్డ్​

అత్యున్నతమైన సేవలందించిన నర్సులకు ‘నేషనల్‌‌  ఫ్లోరెన్స్​ నైటింగేల్​ అవార్డ్ ఇస్తారు.  2020 సంవత్సరానికి  తెలంగాణ నుంచి ఈ అవార్డుకు ఇద్దరు నర్సులు సెలక్ట్ అయ్యారు. శుక్రతో పాటు మెహదీపట్నంలో పని చేస్తున్న అనపర్తి అరుణకుమారి అవార్డు అందుకోనుంది. శుక్ర ఇప్పుడు  ఎల్కతుర్తి మండలం కేశవాపూర్​ సబ్​సెంటర్​లో ఎఎన్ఎంగా పని చేస్తోంది. మే 12న ఢిల్లీలో రాష్ర్టపతి చేతుల మీదుగా ఈ​ అవార్డ్​తో పాటు యాభై వేల నగదు అందుకోనుంది. ‘‘ఈ అవార్డ్‌‌ రావడం మరింత బాధ్యత పెంచింద’’ని అంటోంది మహమ్మద్ శుక్ర.

పాటలు రాసి

చాలామంది తమకు అనారోగ్య సమస్య ఉన్నా బయటకు చెప్పుకోరు. ఇంకొంతమంది ట్రీట్‌‌మెంట్ చేయించుకోవడానికి ముందుకు రారు. ఇలాంటి వాళ్లకు ఆరోగ్యం మీద అవగాహన కలిగించాలి. దీన్ని మాటలతో చెప్తే.. చెవికి పెట్టడం లేదని శుక్రకు అర్థమైంది. దాంతో కొంచెం కొత్తగా ఆలోచించి.. ఆరోగ్యం మీద  జానపదాలు వినిపిస్తే బాగుంటుందనుకుంది. శుక్ర చిన్నప్పుడు తన తల్లి దగ్గర జానపదాలు నేర్చుకున్నది.
అది ఆరోగ్యం మీద జానపదాలు రాయడానికి దారులు వేసింది. ఇంటి దగ్గరే డెలివరీలు చేస్తూ… ట్రీట్‌‌మెంట్‌‌ కోసం ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహాలు, మందులు తీసుకోవాలని పాటల ద్వారా చెప్పింది. ఇలా ఆమె చాలా పాటలు రాసి.. ప్రజలకు ఆరోగ్యం మీద అవగాహన కల్పించడానికి ప్రయత్నించింది.

Latest Updates