30 కిలో మీటర్లు… 650గుంతలు

నేషనల్​ హైవే-161 దుస్థితి

అధ్వానంగా సంగారెడ్డి టూ జోగిపేట అన్నాసాగర్ రోడ్డు

ప్రమాదకరంగా మారుతున్న ప్రయాణం

ముప్పై కిలో మీటర్లు… 650 గుంతలు… ఇది చాలు ఆ రోడ్డుపై ప్రయాణం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో చెప్పడానికి. ఎంత ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ ఉన్న డ్రైవర్‌‌‌‌కైనా ఛాలెంజ్‌‌‌‌ విసిరే ఈ రోడ్డు ఏ మారుమూల కొండ ప్రాంతాల్లోనిది కాదు. నాందేడ్-–అకోలా నేషనల్ హైవే-161 దుస్థితి ఇది. సంగారెడ్డి నుంచి జోగిపేట దాటి అన్నాసాగర్‌‌‌‌ చెరువుకట్ట వరకు 30 కిలోమీటర్ల దూరం ఇలా అధ్వానంగా ఉంది. తరచూ ప్రమాదాలు జరగడం, అధ్వానంగా ఉందని ప్రజల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ‘వెలుగు’ టీమ్‌‌‌‌ ఈ రూట్‌‌‌‌లో 30 కిలో మీటర్లు ప్రయాణించి పరిశీలించింది. ఇందులో అన్నసాగర్​ చెరువు కట్ట చివరి భాగం వరకు 650 గుంతలు కనిపించాయి. పేరుకు నాందేడ్-–అకోలా నేషనల్ హైవే అయినప్పటికీ అధ్వానంగా ఉండడంతో ఈ దారిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మూడేళ్లుగా ఈ రోడ్డుకు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. గడిచిన ఏడాది కాలంలో సంగారెడ్డి-–జోగిపేట మధ్యలో సుమారు 15 మంది చనిపోగా, అనేక మంది క్షతగాత్రులయ్యారు. ఇటీవల గజ్వేల్–ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గుంతలను తప్పించబోయి అదుపు తప్పి అన్నాసాగర్​ చెరువు కట్టకు ఒరిగిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా మరో 20 మంది స్వల్పంగా గాయపడ్డారు.

ఆఫీసర్లు పట్టించుకుంట లేరని
నేషనల్ హైవే అథారిటీ అధికారులు రోడ్డు పరిస్థితి పట్టించుకోవడం లేదని శివంపేట పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు స్వయంగా రోడ్డుపై గుంతలు పూడ్చుకున్నారు. నాందేడ్-అకోలా జాతీయ రహదారిపై ఏర్పడ్డ గోతులను గ్రామ సర్పంచ్ పట్లోళ్ల రాజిరెడ్డి, ఉప సర్పంచ్ నత్తి దశరథ్, ఎంపీటీసీ కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో రోడ్డు బాగు చేసుకున్రు. శివంపేట నుంచి మంజీర నదిపై నిర్మించిన వంతెన నాలుగు కిలో మీటర్ల పొడవున ఏర్పడిన గుంతలను పూడ్చివేశారు.

2018లో గుర్తింపు…

161వ నాందేడ్-అకోలా జాతీయ రహదారికి 2018లో కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించింది. హోదా పెరిగిందే తప్ప రహదారి ఏమాత్రం డెవలప్‌‌‌‌ కాలేదు. 140 కిలోమీటర్ల పొడవున్న ఈ రూట్‌‌‌‌ను నాలుగు లేన్లుగా మార్చేందుకు కేంద్రం రూ.25వేల కోట్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన సర్వే పనులు ఏడాది క్రితమే పుర్తయ్యాయి. ప్రతినిధులు, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లే ఫోర్​లైన్ పనులు ఇప్పటికీ మొదలుపెట్టలేదు. జిల్లాలో ఇటీవల కురిసిన వానలకు అంతంత మాత్రంగా ఉన్న ఈ నేషనల్ హైవే కాస్తా గుంతల మయంగా మారి ప్రమాదకర స్థితికి చేరింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి విస్తరణ పనులు త్వరగా ప్రారంభించాలని ప్రయాణికులు కోరుతున్నరు.

రోడ్డు బాగు చేయాలి
నేషనల్ హైవే-161కి సంబంధించిన జోగిపేట రోడ్డును బాగు చేయాలి. ఈ రూట్లో పోవాలంటే చాలా కష్టమైతుంది. రోడ్డు బాగు గురించి ఆలోచించే వారు లేకుండా పోయారు. పైసలున్నా పనులు చేస్తలేరు. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టి వెంటనే మరమ్మతులు చేయాలి.
-కిష్టారెడ్డి, చక్రియాల్ సర్పంచ్

ఎన్నో ప్రమాదాలు జరిగినయ్
పేరుకు నేషనల్ హైవే గానీ అంతర్గత రోడ్డు కన్నా అధ్వానంగా ఉంది. ఒక గుంతను తప్పించబోతే ఇంకో గుంత ఎదురవుతుంది. అంతలా ఉన్న ఈ రోడ్డులో ఏడాది పాటు ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అయినా ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మత్తులతో పాటు రోడ్డు విస్తరణ పనులు చేయాలె.
-బాగయ్య, పెద్దరెడ్డిపేట

 

 

Latest Updates