తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థకు జాతీయ స్థాయి గుర్తింపు

అటవీ విద్య బోధన, పరిశోధనలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు గాను తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (FCRI)కు జాతీయ స్థాయి గుర్తింపు ల‌భించింది. కేంద్ర ప్రభుత్వంతో A+ (ఏ ప్లస్) కేటగిరీ విద్యా సంస్థగా గుర్తింపు పొందింది. అటవీ కాలేజీలు, ప్రమాణాలు, వసతులను అధ్యయనం చేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (Indian Council of Forestry Research and Education (ICFRE). తెలంగాణ కాలేజీకి అత్యంత ప్రాధాన్యత గుర్తింపును ఇచ్చింది.

దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కృషికి తగిన ఫలితం లభించిందన్నారు.అటవీశాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులకు సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు

అటవీ విద్యను ప్రోత్సహించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక అటవీ కళాశాల ఏర్పాటును ప్రోత్సహించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఈ నిర్ణయం జరిగింది. తమిళనాడు మెట్టుపలాయం అటవీ కాలేజీకి ధీటుగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతో 2015 లో కాలేజీ స్థాపన, 2016 లో బీ ఎస్సీ ఫారెస్ట్రీ మొదటి బ్యాచ్ నాలుగేళ్ల కోర్సుతో ప్రారంభమైంది. ఈ యేడాదే ఫైనల్ ఇయర్ విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసుకుంటున్నారు. ముందుగా దూలపల్లి ఫారెస్ట్ అకాడెమీలో మొదలైన కాలేజీ, గత సంవత్సరం డిసెంబర్ (11/12/2019) లో హైదరాబాద్ శివారు ములుగులో సొంత క్యాంపస్ లోకి మారింది.

విజయవంతంగా మొదటి బ్యాచ్ బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును పూర్తి చేసుకుంటున్న అటవీ కళాశాల ఈ యేడాది నుంచి రెండేళ్ల ఎం.ఎస్సీ ఫారెస్ట్రీ తో పాటు, మూడేళ్ల పీ.హెచ్ డీ ఫారెస్ట్రీ కోర్సులను కూడా ప్రారంభిస్తోంది. తొలి నాళ్లలో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా బీఎస్సీ అడ్మీషన్ల ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్ ఆధారంగా ప్రస్తుతం అడ్మీషన్లు జరుగుతున్నాయి. బోధనలో ఉన్నత ప్రమాణాలు పాటించటంతో పాటు బ్రిటిష్ కొలంబియా, అబర్న్ యూనివర్సిటీలతో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇటీవలే ఓ విద్యార్థినికి అబర్న్ యూనివర్సిటీ ఉచితంగా ఎంఎస్సీ సీటును ఆఫర్ చేసింది. తాజాగా ఏ ప్లస్ గుర్తింపు సాధించటతో తెలంగాణ ఫారెస్ట్ కాలేజీకి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు మరింతగా వచ్చే అవకాశముంది. ప్రభుత్వం, ఇతర సంస్థల సహకారంతో అటవీ కాలేజీ విద్య, పరిశోధనా రంగాల్లో అభివృద్దికి ఆస్కారం ఏర్పడుతుంది.

National Level Recognition to Telangana Forestry College and Research Institute

Latest Updates