ఛాయ్ అమ్ముతున్న జాతీయ స్థాయి ఆటగాడు.. టీ స్టాల్ పేరేంటో తెలిస్తే..

జాతీయ స్థాయిలో ఒకప్పుడు ఎన్నో మెడల్స్ సాధించిన ఆటగాడు.. ఇప్పుడు రొడ్డు పక్కన టీ అమ్ముకుంటున్నాడు. బీహార్‌లో ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. కోల్‌కత్తాలో 1987లో జరిగిన జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలలో గోపాల్ మొదటిసారి బీహార్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 1988 మరియు 1989లో కేరళలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో కూడా పాల్గొన్నాడు. ధన్‌పూర్‌లో 1988లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో గోపాల్ 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్‌లో ప్రథమ విజేతగా కూడా నిలిచాడు. ఆ తర్వాత కొంత కాలానికి 1990లో గోపాల్ స్పోర్ట్స్ కోటాలో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లాడు, కానీ ఉద్యోగాన్ని మాత్రం పొందలేకపోయాడు.

దాంతో కుటుంబ పోషణ బరువై గోపాల్ పాట్నాలోని ఖాజీపూర్‌లో రోడ్డు పక్కన టీ స్టాల్ నడుపుతున్నాడు. ఆ టీ స్టాల్‌కి గోపాల్ ‘నేషనల్ స్విమ్మర్ టీ స్టాల్’ అని పేరు పెట్టాడు. ఆ పేరే ఎందుకు పెట్టావని ఆయన్ని అడగగా.. బీహార్‌లో క్రీడాకారుల పరిస్థితి ఎలా ఉందో చెప్పడంతో పాటూ.. కుటుంబ పోషణ కోసం ఒక జాతీయ స్థాయి క్రీడాకారుడు టీ అమ్మడానికైనా సిద్ధమని ప్రజలకు తెలియడం కోసమని ఆయన చెప్పారు. ప్రస్తుతం గోపాల్ తనకు క్రీడల పట్ల ఉన్న అభిమానాన్ని చంపుకోలేక కొంతమందికి స్విమ్మింగ్‌లో శిక్షణ ఇస్తున్నాడు. ఇది ఇలా ఉండగా.. స్విమ్మింగ్‌‌లో మంచి ప్రావిణ్యం ఉన్న ఆయన కుమారులు మాత్రం జాతీయ స్థాయి క్రీడాకారుడైన తన తండ్రి పరిస్థితిని చూసి, తమ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందేమోనని భావించి వారు స్విమ్మింగ్‌ను వదిలేశారు.

Latest Updates