కళ్లు జాగ్రత్త

natural-eye-care-tips

మారుతున్న వాతావరణంతో ఒంటికే కాదు… కంటికీ సమస్యలు తప్పవంటున్నారు డాక్టర్లు. బ్యాక్టీరియా, వైరస్​లు దాడిచేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అందుకే అతి సున్నితమైన అవయవాలైన కళ్లను ఈ టైంలో జాగ్రత్తగా కాపాడుకోవాలని చెబుతున్నారు. సమస్య చిన్నదేకదా అని పట్టించుకోకుండా ఉంటే చూపు కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు.

కంట్లో ఏదైనా పడితే..

పొద్దున ప్రశాంతమైన వాతావరణం… తొమ్మిది దాటితే దంచి కొడుతున్న ఎండ… సాయంత్రం కాకముందే మబ్బులతో నిండిపోతున్న ఆకాశం.. ఆ తర్వాత ఉరుములు మెరుపులతో జోరు వాన.
గత కొన్ని రోజులుగా మనమంతా అనుభవిస్తున్న వాతావరణ పరిస్థితి ఇది. మనకు ఇది ఇబ్బందికరంగా ఉన్నా.. బ్యాక్టీరియాలకు, వైరస్​లకు ఇది కలిసొచ్చే కాలం. అయితే  వీటివల్ల జ్వరం, జలుబు, తలనొప్పి, మలేరియా, టైఫాయిడ్​, డెంగీ వంటి ఆరోగ్య సమస్యలు​ వస్తాయని తెలుసు. కానీ ఇదే సమయంలో రకరకాల కంటి సమస్యలు కూడా తప్పవు. కళ్ల కలక, దురద పెట్టడం, పురుగులు కంట్లో పడడం వంటివి. అయితే వీటిని మనం పెద్దగా పట్టించుకోం. కానీ.. ఇవే పెద్ద సమస్యకు దారితీస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

పైకి కనిపించకపోవచ్చు…

ఒక్కోసారి కంట్లో ఏదో పడినట్లు అనిపిస్తుంది. కొద్దిసేపు నలుస్తాం. ఆ తర్వాత వదిలేస్తాం. అయితే కొన్ని సమస్యలు పైకి కనిపించవు. కొంత కాలానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సమస్య చిన్నదైనా ఇబ్బందికరంగా ఉంటే డాక్టర్​ దగ్గరకు వెళ్లడమే మేలు. ప్రతిఒక్కరూ సంవత్సరానికి ఒక్కసారైనా కంటి పరీక్షలు చేయించుకోవాలని చెప్తున్నారు ఆప్తమాలజిస్టులు.

కాంప్రహెన్సివ్ డైలేటెడ్ ఐ ఎగ్జామ్

చాలా వరకు కంటి సమస్యలు ఈ పరీక్ష ద్వారా బయటపడతాయి. చిన్న చిన్న సమస్యల దగ్గరి నుంచి గ్లకోమా, డయాబెటిక్, వయసును బట్టి వచ్చే మాలిక్యులర్ డీజనరేషన్ ఏఎండీ వంటి తీవ్రమైన  సమస్యలు కూడా ఈ పరీక్షతో తెలుస్తాయి.

ఫ్యామిలీ హిస్టరీ..

కుటుంబంలో కంటికి సంబంధించిన వ్యాధులున్నవారు జాగ్రత్తగా ఉండాలి. వైరస్​లు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే కంటి సమస్యలు.. ఇలాంటివారిలో త్వరగా ప్రభావం చూపుతాయి. అయితే డాక్టర్​ను కలిసినప్పుడు ఫ్యామిలీ హిస్టరీ క్లియర్​గా చెప్పడం మర్చిపోవద్దు.

సేఫ్టీ లెన్స్​ వాడాలి..

ఐ సైట్​ లేకపోయినా బయటకు వెళ్లినప్పుడు సేఫ్టీ లెన్స్​ వాడడం మంచిది. ఎందుకంటే.. వైరస్​ల ద్వారా స్ప్రెడ్​ అయ్యే కంటి జబ్బుల నుంచి ఈ సేఫ్టీ లెన్స్​ చాలావరకు మనల్ని కాపాడతాయి. అంతేకాదు.. సాయంత్రం పూట జర్నీ చేస్తున్నప్పుడు పురుగులు కంట్లో పడకుండా అడ్డుకుంటాయి.
కొందరు హెల్మెట్​ పెట్టుకున్నా… దానికున్న వైజర్​ను పైకి లేపి డ్రైవ్​ చేస్తారు. ఇలాంటప్పుడు సేఫ్టీ లెన్స్​ వాడడం బెస్ట్​.

న్యూట్రిషనల్​ ఫుడ్​..

కళ్లు ఆరోగ్యంగా ఉంటే.. వైరస్​లు, ఇతర సూక్ష్మజీవుల వల్ల తలెత్తే సమస్యలను సాధ్యమైనంత వరకు అవే పరిష్కరించుకుంటాయి. అయితే ఈ స్మార్ట్​ ప్రపంచంలో కళ్లు వీక్​ అవుతున్నాయి. చూపు మందగిస్తోందంటేనే .. మన కళ్లు బలహీనంగా మారిపోతున్నాయని అర్థం. ఇవి సూక్ష్మజీవుల దాడిని ఫేస్​ చేయలేవు. అందుకే ఆరోగ్యకరమైన న్యూట్రిషనల్​ ఫుడ్​ తీసుకోవడం ద్వారా కూడా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ముదురు ఆకుపచ్చటి కూరగాయలు, పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర మంచి చాయిస్. చేపలు కంటిచూపును కాపాడే మంచి బలమైన ఆహారం. వీటిలో ఉండే ఒమెగా ఫ్యాటీ 3యాసిడ్స్ కంటిని కాపాడతాయి. చేపలు తినలేని వారు వాల్​నట్స్ తీసుకోవడం బెటర్. వీటిలోనూ ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయి. విటమిన్ ఎ ఉండే క్యారెట్లు కూడా కళ్లకు మంచివి. మొలకెత్తిన గింజలు కూడా రోజూ తినాలి.

కళ్లద్దాల క్లీనింగ్​ మర్చిపోవద్దు

చాలామంది కళ్లద్దాలను క్లీన్​ చేయడం గురించి పెద్దగా పట్టించుకోరు. గ్లాస్​పై మరకలు కనిపించినప్పుడే క్లీన్​ చేస్తుంటారు. అదీ ఆ మరక ఉన్నచోట పైపైనే క్లీన్​ చేస్తుంటారు. నిజానికి రోజూ కళ్లద్దాలను క్లీన్​ చేయాలి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టే అలవాటు వల్ల వాటికి బ్యాక్టీరియా, వైరస్​లు అంటుకుంటాయి. ఆ తర్వాత కళ్లద్దాల ద్వారా అవి నేరుగా కంట్లోకి వెళ్లి రకరకాల సమస్యలకు కారణమవుతాయి.

Latest Updates