హైటెక్ నక్సల్స్..! బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లతో రంగంలోకి..

బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ల వాడకం
ధ్రువీకరించిన ఛత్తీస్ గఢ్ పోలీసులు

భద్రాచలం, వెలుగు: దండకారణ్యంలో నక్సల్స్ తమ యుద్దరీతిని మార్చారు. మావోయిస్టు పార్టీ దళపతి నంబాల కేశవరావు వచ్చాక దాడుల వేగాన్ని పెంచారు. గతంలో రాకెట్ లాంచర్లు, విదేశీ ఆయుధాలు వినియోగించినట్లుగా భద్రతా బలగాలు గుర్తించాయి. గతేడాది డ్రోన్ల ద్వారా దండకారణ్యంలో భద్రతాబలగాల కదలికలను, బేస్ క్యాంపుల్లో జవాన్ల కార్యకలాపాలను తెలుసుకుంటూ చక్రబంధం చేసిన నక్సల్స్ తాజాగా బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు, టోపీలు వినియోగిస్తున్నట్లుగా బహిర్గతమైంది. రెండ్రోజులుగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కిష్టారం ఏరియాలో రెండుసార్లు ఆపరేషన్ ప్రహార్‌లో భాగంగా భద్రతా బలగాలు నక్సల్స్‌ను ఎటాక్ చేశాయి. నక్సల్స్ గంటల తరబడి జవాన్ల కాల్పులను తిప్పికొడుతూనే పోరాడారు. తొలిరోజు ఫిబ్రవరి 18న ఒక జవాన్ చనిపోయాడు. 19న గుర్తు తెలియని నక్సల్స్ సానుభూతి పరుడి శవం దొరికింది. అయినా నక్సల్స్ వెనక్కి తగ్గలేదు. సుక్మా ఏఎస్పీ సిద్ధార్థ్ తివారీ దాడి అనంతరం సీఆర్‌పీఎఫ్ జవాన్లు, కోబ్రా బలగాలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బహిర్గతమయ్యాయి. నక్సల్స్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, టోపీలు ధరించారని అతి దగ్గరగా కాల్పులు జరిపిన జవాన్లు వెల్లడించారు. ఇదే విషయమై సుక్మా పోలీసులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. నక్సల్స్ బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ల వినియోగం గురించి కేంద్ర హోంశాఖకు కూడా నివేదించారు.

నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలకు సమాచారం
తాజాగా నక్సల్స్ బుల్లెట్ ప్రూఫ్ వాడకం విషయం బట్టబయలు కావడంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. జర్మన్ తుపాకులు, డ్రోన్ల వాడకం, బైనాక్యులర్ల వినియోగంతో కలవరం పెట్టిన నక్సల్స్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, టోపీల వాడకంతో భద్రతా బలగాల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. ఇటీవల భద్రాచలం నుంచి నక్సల్స్‌కు వాకీటాకీలు సరఫరా చేస్తున్న విషయాన్ని పోలీసులు పసిగట్టారు. రణరీతిని మార్చి బలగాలపై యుద్ధానికి దిగుతున్న నక్సల్స్ ఏ క్షణాణ ఏం చేస్తారో ? అన్న భయాందోళనలు విప్లవ కారిడార్‌లోని గ్రామాల్లో నెలకొంది. సుక్మా ఏఎస్పీ సిద్ధార్థ్ తివారీ లెక్కల ప్రకారం భారీ సంఖ్యలోనే బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు, టోపీలు మావోయిస్టుల వద్ద ఉన్నట్లు సమాచారం. అలాగే నక్సల్స్ 600కు పైగా యుబీజీఎస్ అత్యాధునిక అండర్ బేరల్ గ్రేనైడ్ లాంఛర్లు కల్గి ఉన్నారని ఎదురుకాల్పుల్లో పాల్గొన్న జవాన్లు చెబుతున్నారు. కొన్ని రోజులుగా తెలంగాణలోనూ నక్సల్స్ కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఉత్తర తెలంగాణలో ఉద్యమ విస్తరణకు ప్రయత్నిస్తున్న మావోయిస్టు పార్టీ గోదావరి దాటేందుకు సకల ప్రయత్నాలు చేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం-ములుగు జిల్లాల సరిహద్దుల్లోని గోదావరి మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు నక్సల్స్ చేస్తున్న ప్రయత్నాలకు పోలీసులు గండి పెడుతున్నారు. తాజా సమాచారంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

Latest Updates