ప్రమాణ స్వీకారం సంగతి మాకు తెలియదు: ఎన్సీపీ ఎమ్మెల్యేలు

ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీ నేత అజిత్ పవార్‌కు షాక్ ఇస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆయన వెంట రాజ్‌భవన్‌కు వెళ్లిన శాసనసభ్యుల్లో ముగ్గురు ఇప్పటికే జారుకున్నారు. తిరిగి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వద్దకు చేరుకున్నారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి శరద్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. తమకు ప్రమాణ స్వీకారం విషయం చెప్పకుండానే రాజ్‌భవన్‌కు తీసుకెళ్లారని వాళ్లు చెబుతున్నారు.

అనూహ్యంగా ఇవాళ ఉదయం బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర సీఎంగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ అజిత్ పవార్ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యరీకి లేఖ ఇవ్వడంతో ఆయన ప్రమాణం చేయించారు.

మాట్లాడాలని పిలిచి.. ప్రమాణ స్వీకారానికి..

అజిత్ పవార్‌ మాట్లాడాలని పిలిచి, తనతో పాటు వెంట మరికొంత మంది ఎమ్మెల్యేలను రాజ్‌భవన్‌కు తీసుకెళ్లారని ఎన్సీపీ ఎమ్మెల్యే రాజేంద్ర షింగనే చెప్పారు. అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే ప్రమాణ స్వీకారం జరిగిపోయిందన్నారు. ఆ తర్వాత నేరుగా శరద్ పవార్ వద్దకు చేరుకుని, తమ మద్దతు ఆయనకే అని చెప్పామన్నారు. ఎక్కడికి వెళ్తున్నామో కూడా చెప్పకుండా తమను అజిత్ పవార్ రాజ్‌భవన్‌కు తీసుకెళ్లారని మరో ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు సందీప్ క్షీర్‌సాగర్, సునీల్ భుసారా తెలిపారు. అలాగే ఎమ్మెల్యేలు దిలీప్ రావ్ బంకర్, అతుల్ బంకే కూడా తాము అజిత్ పవార్ ఏదో మాట్లాడాలని పిలిస్తే వెళ్లామని, తమ మద్దతు శరద్ పవార్‌కేనని చెప్పారు.

MORE NEWS: 

‘మహా’ ట్విస్ట్: సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై కారు పల్టీ.. పరిశీలనకు ఇంజినీర్లు

‘శరద్ పవార్‌కి తెలియకుండా ఏదీ జరగలేదు’

Latest Updates