టెట్ ఒక్కసారి రాస్తే చాలు.. లైఫ్​టైమ్ వ్యాలిడిటీ

టెట్ వ్యాలిడిటీ.. లైఫ్​టైమ్

ఇక నుంచి రాసే వారికే ఈ చాన్స్​

ఏడేండ్ల వ్యాలిడిటీకి ఫుల్​స్టాప్​

ఎన్సీటీఈ  కీలక నిర్ణయం

రాష్ట్రంలో మూడేండ్ల నుంచి టెట్​ నిర్వహించని సర్కార్​

హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ ) సర్టిఫికెట్ విషయంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ఒకసారి టెట్  రాసి అర్హత సాధిస్తే..  లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుందని ప్రకటించింది. ఇక నుంచి టెట్​ రాసే వారికి ఇది వర్తిస్తుంది.  ఇప్పటివరకు ఉన్న ఏడేండ్ల వ్యాలిడిటీ విధానాన్ని రద్దు చేసింది. గత నెల 29న జరిగిన ఎన్సీటీఈ  50వ జనరల్ బాడీ మీటింగ్​లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించిన మినిట్స్​ను  రిలీజ్ చేశారు. ఇప్పటివరకూ మనదగ్గర మొత్తం ఆరుసార్లు టెట్  జరగ్గా.. అందులో నాలుగు సార్లు ఉమ్మడి ఏపీలో, రెండు తెలంగాణ రాష్ట్రంలో జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారిగా 2011 జులై  1 నిర్వహించారు. ఆ తర్వాత రెండోసారి 2012 జనవరి  8న, మూడోసారి 2012 జూన్ 1న, నాల్గోసారి 2014 మార్చి16న నిర్వహించారు. తెలంగాణ వచ్చిన తర్వాత  2016  మే 22న ఒకసారి, 2017 జులై 23న రెండోసారి టెట్ నిర్వహించారు. నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మూడేండ్లు దాటినా ఇప్పటికీ రాష్ట్రంలో టెట్​నిర్వహించడం లేదు.  దీంతో చాలామంది టెట్ వ్యాలిడిటీ అయిపోయింది. వారితోపాటు ఇంకా చాలా మంది టెట్​ కోసం ఎదురుచూస్తున్నారు. మొదట్లో టెట్ వ్యాలిడిటీ నాలుగేండ్లు ఉండగా, తర్వాత ఏడేండ్లకు పెంచారు. ప్రస్తుతం ఎన్సీటీఈ  తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒకసారి టెట్​లో క్వాలిఫై అయితే, ఇక మళ్లీ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది. అయితే ఇప్పటికే పరీక్ష రాసి క్వాలిఫై అయిన వారినీ లైఫ్ టైమ్ కేటగిరిలోకి తీసుకురావాలా..? లేక వారి వ్యాలిడిటీ అయిపోయాక మళ్లీ పరీక్ష రాసుకోవాల్సిందేనా? అనే అంశంపై ఇంకా ఎన్సీటీఈ నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించింది. టెట్ లైఫ్​ టైమ్​ వ్యాలిడిటీ ఇవ్వడం మంచి నిర్ణయమని బీఎడ్, డీఎడ్  అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మూడేండ్ల నుంచి టెట్ నిర్వహించడం లేదని, దీనిపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

For More News..

ఎంబీబీఎస్ ఫీజుల పెంపు? కన్వీనర్​ సీటుకే రూ.లక్ష అయితే… మరి మేనేజ్‌మెంట్ సీటుకు?

కల్వకుర్తి ఘటనపై ముందే హెచ్చరించినా పట్టించుకోని ప్రభుత్వం

‘ధరణి’లో వ్యవసాయేతర ఆస్తులను ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు

Latest Updates