క్లియర్‌గా పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోంది: జాతీయ మహిళా కమిషన్

హైదరాబాద్: ప్రియాంక రెడ్డి ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం క్లియర్‌గా కనిపిస్తోందని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామల కుందర్ అన్నారు. స్టేషన్ల పరిధి మొదలు, సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలనలో, లారీ రెండ్రోజులుగా అక్కడే ఉన్నా పట్టించుకోకపోవడం సహా చాలా విషయాల్లో అలసత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారామె. ప్రియాంక రెడ్డి కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని, రంగంలోకి దిగింది. ఇవాళ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన కమిషన్ సభ్యులు.. బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామల కుందర్ మీడియాతో మాట్లాడారు.

పోలీసులు ఆ కామన్ సెన్స్ కూడా వాడలేదు

‘రెండ్రోజుల నుంచి లారీ అక్కడే ఉంది. డ్రైవర్, క్లీనర్లు మందు తాగుతున్నారు. ఒక వెహికల్ రోజుల తరబడి అక్కడే ఉంటే పోలీసుల ఏం చేస్తున్నారు. సామాన్య ప్రజలు కూడా ఇంటి ఎదుట ఏదైనా వాహనం రెండ్రోజులుగా నిలిచి ఉంటే అతి ఎవరిదీ, ఏంటన్న విషయాలు ఎంక్వైరీ చేస్తారు? అది కామన్ సెనస్. పోలీసులు, పెట్రోలింగ్ సిబ్బంది ఎవరూ ఆ పని చేయకపోవడం దారుణం’ అని అన్నారు శ్యామల. పోలీసులు కనీసం ఆ పని చేసి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదన్నారు.

పెట్రోలింగ్ పోలీసులపై యాక్షన్ తీసుకోవాలని, విధులను నుంచి వారిని తొలగించాలని అన్నారు. ప్రియాంక తల్లి, చెల్లెలు స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇస్తే తమ పరిధి కాదంటూ రెండు మూడు స్టేషన్లు తిప్పారని, సమస్యలో తామున్నామన్న ధైర్యం ఇవ్వకుండా పోలీసులు ఇలా చేయడం బాధాకరమని అన్నారు. శంషాబాద్, ఆర్జీఐ పోలీస్ స్టేషన్ల సిబ్బందిపైనా యాక్షన్ తీసుకోవాలన్నారు.

సీసీ కెమెరాలు చూడాల్సింది నేరం జరిగాక కాదు

ప్రియాంక రెడ్డి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్కూటీ టోల్ ప్లాజా దగ్గర పెట్టి వెళ్లి రాత్రి 9 గంటలకు వచ్చిందని, ఈ గ్యాప్‌లోనే నిందితులు పంక్చర్ చేశారని అన్నారు మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామల. మరి సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉన్నప్పుడు దీన్ని ఎందుకు గమనించలేకపోయారని ప్రశ్నించారామె. సీసీ కెమెరాలు ఉన్నది నేరం జరిగాక నిందితులను పట్టుకోవడానికి కాదని, నేరాలను నియంత్రించడానికని అన్నారు. సీసీ కెమెరాలను మానిటర్ చేయకపోవడం దారుణమని, ఆ ఫుటేజీ కూడా సరిగా కనిపించడం లేదని, దాని నిర్వాహకులపై యాక్షన్ తీసుకోవాలని అన్నారామె.

మహమూద్ అలీపై స్పందన

ఈ ఘటన జరిగిన టైంలో ప్రియాంక తన చెల్లికి కాకుండా 100కి ఫోన్ చేసి ఉండాల్సిందని హోం మంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలపైనా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామల స్పందించారు. ఇంత ఘోరం జరుగుతుందని ఎవరు ఊహిస్తారని, ఆమె ఫోన్‌లో చెల్లెలితో మాట్లాడినప్పుడు కూడా తెల్లారి డ్యూటీకి వెళ్లాలికదా అంటూ కాన్ఫిడెంట్‌గా ఉందని చెప్పారు. ఏదైనా సమస్య వస్తే ముందుగా పేరెంట్స్‌కే ఫోన్ చేస్తారని అన్నారామె. వాళ్ల కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు వెంటనే స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదన్నారు.

Latest Updates