
పెరిగిన డిమాండ్..అందుకోని సప్లయ్
ప్రొడక్షన్ పెంచుతున్న కంపెనీలు
న్యూఢిల్లీ: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే మ్యాక్సిమమ్ 2–3 నెలలు వెయిట్ చేయాల్సిందే. కొన్ని ప్రత్యేక సందర్బాలలో 10 నెలలు కూడా పడుతోంది. కరోనా దెబ్బతో సొంత వెహికల్స్‌కు డిమాండ్ పెరిగింది. దీనికితోడు వెహికల్ లోన్లపై వడ్డీ రేట్లు కూడా పదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. దీంతో ఎంట్రీ లెవెల్ మోడల్స్‌ను కొనడానికి కూడా మినిమమ్ 2–3 నెలల పాటు వెయిట్ చేయాల్సి వస్తోంది. బాగా సేల్ అవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పాటు మారుతి ఆల్టో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, హ్యుండయ్ ఐ20, వెర్నా వంటి హ్యాచ్ బ్యాక్, సెడాన్ మోడల్స్‌ను కొనడానికి ఒకటి నుంచి మూడు నెలల పాటు కస్టమర్లు వెయిట్చేయక తప్పడం లేదు.
ఫుల్ కెపాసిటీతో ప్లాంట్లు..
మారుతి సుజుకీ కిందటేడాది అక్టోబర్ నుంచి ఫుల్ కెపాసిటీతో పనిచేస్తోంది. అయినప్పటికీ స్విఫ్ట్, ఆల్టో, వ్యాగన్ ఆర్ వంటి మోడల్స్‌కు 3 నుంచి నాలుగు వారాల వెయిట్ లిస్ట్ ఉంది. అదే ఎర్టిగా మోడల్ కావాలంటే కనీసం 6–8 వారాలు వేచి ఉండాల్సిందే. మెయింటెనెన్స్ కోసం డిసెంబర్ 27 నుంచి జనవరి 3 మధ్య కంపెనీ తన మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌ను షట్ డౌన్ చేసింది కూడా. వెహికల్స్ అసెంబ్లింగ్ ఫుల్ కెపాసిటీతో పనిచేస్తున్నా కస్టమర్లకు కార్లను డెలివరీ చేయడంలో టైమ్ పడుతోందని డీలర్లు చెబుతున్నారు. హ్యుండయ్ కూడా తన కీలక మోడళ్ల తయారీని పెంచింది. 6 నెలల కిందటే క్రెటా ప్రొడక్షన్‌ను రోజుకి 340 యూనిట్ల నుంచి 640 యూనిట్లకు పెంచామని హ్యుండయ్ మోటార్ ఇండియా డైరక్టర్ గణేష్ మని అన్నారు. దీంతో క్రెటా వెయిట్‌లిస్ట్ ఆరు నెలల నుంచి 2–3 నెలలకు తగ్గిందని చెప్పారు. వెర్నా, వెన్యూ మోడల్స్ తయారీని కూడా కూడా కంపెనీ పెంచింది. ప్రస్తుతం న్యూ ఐ20 కోసం కస్టమర్లు 2–3 నెలలు వెయిట్ చేయాల్సి వస్తోందని, ఈ మోడల్ ప్రొడక్షన్‌ను కూడా పెంచామని మని చెప్పారు. కంపెనీ నెలకు 8,000–9,000 యూనిట్లను తయారు చేస్తోందని, దీన్ని 12,000 కు పెంచాలని చూస్తున్నామని పేర్కొన్నారు.
వెయిటింగ్ పిరియడ్‌ను తగ్గిస్తున్న కంపెనీలు
మార్కెట్లో ఊహించిన దానికంటే ఎక్కువ డిమాండ్ క్రియేట్ అయ్యిందని, దీన్ని చేరుకునేందుకు కంపెనీకి చెందిన నాసిక్ ప్లాంట్‌లో ప్రొడక్షన్‌ను పెంచామని మహింద్రా అండ్ మహింద్రా ఆటో సీఈఓ విజయ్ నాక్రా అన్నారు. అంతేకాకుండా సప్లయర్ సైడ్ కూడా ప్రొడక్షన్‌ను పెంచామని చెప్పారు. ప్రారంభంలో నెలకు 2 వేల యూనిట్లను తయారు చేయాలని ప్లాన్స్ వేసుకున్నామని, కానీ తక్కువ టైమ్‌లోనే దీన్ని 3 వేల నుంచి 3,500 యూనిట్లకు పెంచాల్సి వచ్చిందని అన్నారు. దీంతో వెహికల్ వెయిట్పీరియడ్ను చాలా వరకు తగ్గించగలిగామని పేర్కొన్నారు. కాగా, తాజాగా లాంచ్ అయిన మహింద్రా థార్ వెయిటింగ్ పిరియడ్ 5 నుంచి 10 నెలల వరకు ఉంది. ఈ వారం ప్రారంభంలో నిస్సాన్ కూడా తన మాగ్నైట్ మోడల్ ప్రొడక్షన్‌ను నెలకు 2,700 యూనిట్ల నుంచి నాలుగు వేల యూనిట్లకు పెంచుతామని ప్రకటించింది.