వైరస్‌పై ప్రజల్లో భయాన్ని పోగొట్టండి: రాహుల్‌

  • లాక్‌డౌన్‌ ఆన్‌ ఆఫ్‌ స్విచ్‌ కాదు
  • 17 తర్వాత స్ట్రాటజీ చెప్పాలని డిమాండ్‌

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ ఎత్తేసే విషయంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ ఆన్‌ ఆఫ్‌ స్విచ్‌ కాదని, ఎత్తేయాలంటే ఒక నిర్దిష్టమైన స్ట్రాటజీ కావాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాహుల్‌ శుక్రవారం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. దేశంలోని 99 శాతం మంది సేఫ్‌గా ఉన్నారని, కరోనా వల్ల 1 శాతం మాత్రం చనిపోతారని రాహుల్‌ అన్నారు. పిల్లలు, ముసలోళ్లకే దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతాయనే విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలని రాహుల్‌ చెప్పారు. ప్రజల్లో ఉన్న భయాన్ని కాన్ఫిడెన్స్‌గా మార్చాలని అభిప్రాయపడ్డారు. ప్రజల్లో భయాన్ని పొగొట్టిన తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తేస్తే లాభముంటుందని, లేదంటే ప్రజలు భయంతో ఇళ్లకే పరిమితమయ్యే చాన్స్‌ ఉందని అన్నారు. “ లాక్‌డౌన్‌ ఎప్పుడు ఎలా ఎత్తేస్తారు. ఏయే ప్రమాణాలు, సూత్రాల ఆధారంగా లాక్‌డౌన్‌ ఎత్తేస్తారో ఆలోచించాలి. కేంద్రం ఒక క్లారిటీతో ప్రజల ముందుకు రావాలి” అని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కూడా రీస్టార్ట్‌ చేయాల్సిన టైం వచ్చిందని రాహుల్‌ గాంధీ అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులను తీవ్రంగా నష్టపోయారని, వారిని వెంటనే కేంద్రం ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ నెల 17 తర్వాత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు.

Latest Updates