
హైదరాబాద్, వెలుగు:
నీరా త్వరలోనే మార్కెట్‌లోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం నీరా పాలసీని రూపొందిస్తోంది. మూడు నెలల్లో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నీరా బార్ ఏర్పాటు చేయనుంది. ట్యాంక్ బండ్ వద్ద నీరా ఔట్‌లెట్స్‌ను కూడా తీసుకురానుంది. అలాగే నీరా వైన్, నీరా అనుబంధ ఉత్పత్తులను తయారు చేసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. తద్వారా ఏటా రూ.100 కోట్ల ఆదాయం పొందాలని భావిస్తున్నారు. ఇప్పటికే నీరాపై స్టడీకి అధికారులు పలు ప్రాంతాల్లో పర్యటించారు.
ముందుగా నెక్లెస్ రోడ్డులో..
నీరాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ఆబ్కారీ శాఖ, బీసీ కార్పొరేషన్ సమన్వయంతో పని చేస్తున్నాయి. ముందుగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో నీరా బార్‌ను ప్రారంభించనున్నారు. అచ్చంగా పల్లెల్లో తాటి చెట్ల కింద కూర్చుని తాగినట్లే అక్కడ లొకేషన్ ఉండనుంది. అలాగే గ్రామాల్లో మాదిరి గుగ్గిళ్లు, గుడాలు, గ్రామీణ వంటకాలు అందుబాటులో ఉండనున్నాయి. దాన్ని ఆనుకుని పక్కనే మరో నీరా స్టాల్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది హైటెక్ హంగులతో ఫైవ్ స్టార్ హోటల్ మాదిరి ఉండనుంది. తర్వాత ట్యాంక్ బండ్ వద్ద రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఔట్‌లెట్స్‌ను ప్రారంభించనున్నారు. మాల్స్‌లో మాదిరి ఫుడ్ కోర్టులు, ఇతర వాణిజ్య సముదాయాలు ఉంటాయి. ఇక్కడ సక్సెస్ అయ్యాక దశలవారీగా జిల్లాలకు విస్తరించనున్నారు. నీరా బార్, ఔట్‌లెట్స్ ప్రారంభానికి కనీసం మూడు నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నారు.
స్టోరేజీకి కసరత్తు
తెల్లవారుజామున నాలుగున్నర తర్వాత నుంచి నీరాను సేకరిస్తారు. అయితే దాన్ని స్టోర్ చేయడమే పెద్ద సమస్య. ఉదయం సేకరించిన వెంటనే తాగాలి. అప్పుడే అది తియ్యగా, రుచిగా, ఆల్కహాల్ కలవకుండా ఉంటుంది. మత్తు రాదు. లేకుంటే తర్వాత పులిసిపోతుంది. దీంతో స్టోరేజీపై కసరత్తు చేస్తున్నారు. నీరా పులిసిపోకుండా సుమారు ఆరు నెలల వరకు నిల్వ చేయవచ్చని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. పుణెలోని నేషనల్ కెమికల్ ల్యాబోరేటరీ సైంటిస్టులు ఇందుకు సంబంధించిన టెక్నాలజీని కనుగొన్నారని అధికారులు పేర్కొంటున్నారు. నీరాను ఏడాది పొడవునా నిల్వ ఉంచే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తూర్పు గోదావరి జిల్లా పందిరి మామిడిలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ రీసెర్చ్ సెంటర్ సైంటిస్టులు రూపొందించారని చెబుతున్నారు.
మస్తు మంచిది
ఆల్కహాల్ తాగి హెల్త్ పాడు చేసుకోవడం కంటే నీరా తాగితే బెటర్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. నీరా ఆరోగ్యానికి ఎంతో మంచిదని పలువురు అంటున్నారు. సహజసిద్ధంగా వస్తుందని, షుగర్ ఉన్న వారు, చిన్నపిల్లలు, గర్భిణులు కూడా తాగొచ్చని చెబుతున్నారు. గెల నుంచి తీసిన నీరాలో కంటే కాయల నుంచి తీసిన నీరాలో పోషక విలువలు ఎక్కువని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే మాంసకృత్తులు, చక్కెర, ఐరన్, నైట్రోజన్, భాస్వరం, కాల్షియం, థయామిన్, వివిధ విటమిన్లు ఉండటంతో నీరా టానిక్‌లా పనిచేస్తుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో ఎంతో మంది గౌడ కులస్తులకు ఉపాధి లభించనుందని
చెబుతున్నారు.