విద్యార్థులను కుక్కి తీసుకెళ్తున్నరు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లో వ్యక్తిగత వాహనాలనే ట్రాన్స్ పోర్ట్ వాహనాలుగా మార్చేసి యథేచ్ఛగా స్కూల్ పిల్లలను బళ్లలో దింపుతున్నారు. స్కూల్ మొదలయ్యే సమయంలో గానీ విడిచిపెట్టే సమయంలో గ్రేటర్ పరిధిలో ఏ రోడ్డుపై నిలుచున్న పదుల సంఖ్యలో విద్యార్థులను కుక్కి తీసుకెళ్తున్న ఆటోలు, మిని వ్యాన్ లు దర్శనమిస్తున్నాయి. పిల్లల భద్రతను ప్రమాదంలోకి నెడుతున్న ఈ వ్యవహారంలో ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు, స్కూల్ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. అనుకోని ప్రమాదాలు జరిగితే ప్రమాదాలు ఎవరు బాధ్యత వహించాలన్నది ప్రశ్నార్థకంగా మారింది.

అనుమతులు లేకుండా నడుపుతున్నరు

స్కూల్స్ ప్రారంభమైన మొదట్లో స్కూల్​బస్సుల విషయంలో అధికారులు హడావుడి చేస్తుంటారు. తర్వాత ఆటోలు, మిని వ్యాన్ లు తిరుగుతున్న పట్టించుకోవట్లే. గ్రేటర్​లో అక్రమంగా అనుమతులు లేకుండా స్కూల్​పిల్లలను ఎక్కించుకునే వాహనాల సంఖ్య దాదాపు పది వేల వరకు ఉంది. రోజుకు పదివేలకు పైగా వాహనాలు తిరుగుతుంటే గత నెలరోజుల్లో అధికారులు ఒక్క వాహనాన్ని కూడా సీజ్ చేసింది లేదు. ఒక్కో వాహనంలో పది నుంచి 20 మంది విద్యార్థులు వేలాడుతూ ఆటోకు బయటకు కూర్చోని ప్రయాణం చేస్తుంటారు. చాలా మంది తల్లితండ్రులు తెలిసినా కాస్త డబ్బులు తక్కువని పిల్లలను
ప్రమాదంలోకి నెడుతున్నరు. స్కూల్ యాజమాన్యాలు రోజుకు పదుల సంఖ్యలో అక్రమ వాహనాల్లో స్కూల్ వద్దకు ఆటోలు, వ్యాన్లు వస్తున్న పట్టించుకోవడం లేదు.

మేనేజ్​మెంట్ బాధ్యత తీసుకోవాలి

పిల్లలను తరలిస్తున్న అక్రమ వాహనాలపై దృష్టి పెట్టాం. ఐతే ప్రతిరోజు వాహనాలను తనిఖీ చేసే అంతా సిబ్బంది లేదు. కనుక స్కూల్ యాజమాన్యాలు ఈ బాధ్యత తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలు స్కూల్ వద్దకు వచ్చినప్పుడు ఆ వివరాలను ఆర్టీఏ అధికారులకు తెలియజేయాలి. పాండురంగనాయక్, జేటీసీ హైదరాబాద్

డబ్బులు తక్కువని ప్రమాదంలో నెట్టొద్దు

స్కూల్ పిల్లలను తరలించే వాహనాల విషయంలో కర్నాటక ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కూడా అలాంటి నిబంధనలు పాటిస్తే అక్రమ వావానాలను ఎప్పటికప్పుడు గుర్తించవచ్చు. ఐతే తల్లితండ్రులు కూడా పిల్లలను తరలించే వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు తక్కువ తీసుకుంటున్నారని విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టవద్దు. సంజన, విద్యార్థి తల్లి, హైటెక్ సిటీ

కర్నాటక లో ఇలా..      

కర్నాటక ప్రభుత్వం ఇటీవలే ఓ జీవో ను జారీ చేసింది. స్కూల్ పిల్లలను కండిషన్ లేని ప్రమాదకర వాహనాల్లో ప్రయాణించడాన్ని అడ్డుకోవడమే ఈ జీవో ఉద్దేశం. ఇందుకోసం ప్రతి స్కూల్ యాజమాన్యం కొంతమంది సిబ్బందితో కలిపి ఒక కమిటీ వేయాలని ఆదేశించింది. ఈ కమిటీ ప్రతి రోజు స్కూల్ పిల్లలను తీసుకొచ్చే వాహనాలను గేట్ వద్ద ఉండి చెక్ చేయాలి. ఆ వాహనానికి సరైన ఫిట్ నెస్ ఉందా ? ప్రభుత్వం అనుమతి ఉన్న వాహనమేనా, నిబంధనలు పాటిస్తున్నారా? ఇన్సూరెన్స్ ఉందా, చెక్ చేయడం వారి పని. రోజుకు స్కూల్ వచ్చే వాహనాలను ఇలా చెక్ చేయటం ద్వారా నిబంధనలను ఉల్లంఘించే వాహనాలను సులభంగా గుర్తించవచ్చు.

Latest Updates