అవినీతికి కేరాఫ్ ఖమ్మం రవాణాశాఖ..!

ఖమ్మం, వెలుగు: ఖమ్మం ట్రాన్స్‌‌పోర్టు డిపార్ట్మెంట్‌‌ వసూళ్లకు, అవినీతికి కేరాఫ్‌‌గా మారింది. ఇప్పటికే  పెనుబల్లి మండలం ముత్తగూడెం చెక్ పోస్టు అక్రమాలకు పాల్పడిన ఏఎంవీఐ మసూద్‌‌అలీ వ్యవహారం తర్వాత ఒక్కో అధికారి లీలలు బయట పడుతున్నాయి. పై ఆఫీసర్లను, ఎమ్మెల్యేలనూ కూడా లెక్క చేయకుండా అక్రమాలకు తెగబడుతున్నారు. పోస్టింగుల దగ్గరనుంచి తనిఖీల దాకా ఇష్టారాజ్యం చెలాయిస్తున్నారు. రవాణా శాఖ అంటేనే భయపడేవారు ఖమ్మం అధికారులంటే మరింత వణికిపోతున్నారు.

పోస్టింగ్ పైనా సందేహాలే

అదిలాబాద్‌‌, వరంగల్‌‌లలో పని చేసినప్పుడు రెండుసార్లు ఏసీబీకి చిక్కి కేసులు నడుస్తున్న గౌస్‌‌పాషా అనే మరో అధికారి ఖమ్మంలో తిష్ట వేశారు. కొత్తగూడేనికి బదిలీ అయిన తర్వాత కూడా ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టు గుర్తించిన ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. ఆయనను నల్గొండకు బదిలీ చేసినా వెళ్లకుండా పై ఆఫీసర్లను మానేజీ చేసి ఇక్కడే పోస్టింగ్‌‌ వేయించుకున్నాడన్న ఆరోపణలున్నాయి.కేసులున్న జిల్లాలోనే ఎలా నియమించారని అప్పటి ఏసీబీ డీజీ కూడా ట్రాన్స్‌‌పోర్ట్ కమిషనర్‌‌కు లెటర్‌‌ రాశారని తెల్సింది. రాష్ట్ర విభజన టైమ్‌‌లో ఆయన వైరాలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్‌‌గా ఉన్నారు. అప్పుడు ఆంధ్రలో రవాణా ఉద్యోగులు సమ్మె చేస్తుండడంతో తెలంగాణ అధికారులే ఫిట్‌‌నెస్​సర్టిఫికెట్ఇచ్చారు. అప్పుడు 23 రోజుల్లోనే ఆయన 1563 ఫిట్‌‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేశారు. అలా కోట్లాది రూపాయలు దండుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో ఎక్కడ లేనంత భారీగా ఇక్కడ సర్టిఫికెట్లు ఇవ్వడంపైనా అంతర్గత విచారణ జరిగింది.

ఎమ్మెల్యేనా..ఐతే ఏంటీ..

ట్రాక్టర్‌‌  ట్రయిలర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్నారంటూ ఒక్కో ట్రాక్టర్ కు రూ.30 వేలు డిమాండ్‌‌ చేశాడు. రైతులు స్థానిక ఎమ్మెల్యేకు చెప్పగా ఆఅధికారికి ఫోన్​ చేశారు. రైతుల  ట్రాక్టర్లను విడిచిపెట్టాలని ఎమ్మెల్యే చెప్పినా వినకుండా చలానాల రూపంలో భారీగా వసూల్లు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో గౌస్‌‌కు టీటీవో మెమో జారీ చేశారు.   ఆయన డ్యూటీలో ఎప్పుడూ యూనిఫాం వేసుకోలేదు. తనిఖీల సమయంలో ఆయన కారులో కూర్చుంటే హోంగార్డు, మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులే వసూలు చేస్తుంటారు. దీన్ని అడ్వాంటేజీగా తీసుకుని కొందరు యువకులు ఖమ్మంలో రవాణా అధికారులమంటూ బెదిరించి డబ్బులు వసూలు చేశారు. వారిని పోలీసులు పట్టుకుని కేసులు పెట్టారు. ఉన్నతాధికారులు చెప్పినా పట్టించుకోకపోవడంతో గౌస్‌‌కు ఇటీవల మరో మెమో జారీ చేశారు.

Latest Updates